బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఏడేండ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి, జహీర్ ఇక్బాల్ ఇటీవలే కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
పెండ్లితంతు చాలా సింపుల్‌గా కానిచ్చినా.. కాస్ట్యూమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచింది సోనాక్షి. మెహందీ ఈవెంట్ నుంచి ఏడడుగులు నడిచే దాకా సోనాక్షి వస్త్రధారణ అదుర్స్ అనిపించింది. సాధారణంగా పెండ్లి అనగానే భారీ లెహంగాలు, చీనాంబరాలు మాత్రమే కాదు.. డ్రెస్సుల్లోనూ కనువిందు చేయొచ్చని సోనాక్షి నిరూపించింది. పెండ్లికి ముందు జరిగిన పూజలో నీలిరంగు డ్రెస్‌లో మెరిసిపోయిందామె. పెండ్లికి ఐవరీ చీరలో తళుకులీనింది. అయితే, ఈ చీర తన తల్లి పూనమ్ సిన్హా పెండ్లి చీరేనట. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్లో బనారసీ చీరలో గ్లామరస్‌గా కనిపించింది. మొత్తం మీద సోనాక్షి వివాహ క్రతువు చిత్తరువులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.