నటీనటులు ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అలాగే, వాళ్లు మాట్లాడింది పాజిటివ్ అయినా సరే కొన్నిసార్లు నెగెటివ్ అర్థాలు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి సమస్యే ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది నటి, మోడల్ మాళొబిక బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళొబిక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి షేర్ చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ‘నీ వెనకాలే నడిచి’ అనే ప్రైవేట్ సాంగ్ చేసిందామె.
ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ‘విజయ్‌కి హిందీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను. ఆ మాటను మీడియాలో వక్రీకరించారు. హిందీ అంటేనే తనకు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని రాస్తున్నారు. అసలు నేను అలా అనలేదు. కానీ, ఎంతో దారుణంగా రాస్తున్నారు. ఈ రాతల కారణంగా మంచి స్నేహితుడికి దూరమయ్యాను. సరదాగా అన్న మాటలను సీరియస్‌గా రాశారు. ఆ కామెంట్లు చదివిన తర్వాత విజయ్ టచ్‌లోకి రావడం లేదు. ఆయన్ను ఇరికించాలనో, తప్పుపట్టాలనో ఆ మాటలు అనలేదు’ అని వాపోయింది మాళొబిక.