ఈ తరం వనితలు కాలంతో పరుగులు తీస్తున్నారు. ఒత్తిడితో సావాసం చేస్తున్నారు. ఈ తరహా జీవనశైలిలో మార్పు సాధ్యం కాకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా కావొద్దంటే.. ఒత్తిడికి చెక్ పెట్టే చిట్కాలు పాటించి చూడండి. అప్పుడు స్ట్రెస్ నుంచి తేలికగా బయటపడొచ్చు.
తులసి ఆకులు: తులసిలో ఔషధ గుణాలు అపారం. తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణుల మాట. రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు నమలడం వల్ల.. మంచి గుణం కనిపిస్తుంది. అలాగే పెరుగుతో తులసి ఆకులు కలిపి తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందట. పెరుగు, తులసి ఆకుల కలయిక ఒత్తిడిని తగ్గించే హార్మోన్లను విడుదల చేసి.. మనసును స్థిమితం చేస్తుందట.
మెంతులు: అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగితే.. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారానికి ఒకసారి ఇలా తీసుకుంటే.. అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
చేమంతి ఆకుల టీ: చేమంతి పూలు, ఆకులలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చేమంతి ఆకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతాయి. నిద్ర లేమి సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ టీ మేటిగా పనిచేస్తుంది.