నలుపంటే చాలామందికి కంటగింపు. కానీ, కాటుక వెతుక్కొని మరీ బుగ్గమీద దిష్టి చుక్క దిద్దుకుంటారు. తుమ్మెద వరుసల్లాంటి కురుల్లో ఒక్క తెల్ల పోగు కనిపించినా ‘అన్నన్నా..’ అనుకుంటూ హెన్నా పెట్టేస్తారు. అదే, ఆభరణాల దగ్గరికి వచ్చేసరికి నలుపును అంతగా పట్టించుకోరు. కానీ, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మన్నికైన రంగుగా పేరున్న నలుపు నగనిగల్లో ధగధగ తళుకులీనుతున్నది. రంగురంగుల రాళ్లతో తయారు చేసే వాటికన్నా నల్లని బీడ్స్, రాళ్లు పొదిగిన ఆభరణాలే ముద్దంటున్నారు ఈ తరం ముద్దుగుమ్మలు.
ఆభరణాల్లో నలుపు వాడకం చాలా తక్కువ. వివాహితలు నల్లపూసలు మాత్రమే ధరిస్తారు. అంతేతప్ప నల్లటి ఆభరణాలు ధరించడానికి ఇష్టపడరు. కానీ, అయిదోతనానికి గుర్తుగా మంగళసూత్రంలోనూ నల్లపూసలు జతచేస్తారు. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి బ్లాక్ జెమ్ జువెలరీ.
నల్లటి బీడ్స్, రాళ్లు పొదిగిన ఆభరణాలు రెట్టింపు మెరుపుతో మహిళల మేనిపై అందంగా మెరిసిపోతున్నాయి. ఈ బ్లాక్ జువెలరీలో బంగారానికి బదులు వెండి, జిర్కోనియం వంటి లోహాలను వాడుతున్నారు. దీంతో సరసమైన ధరలకే ఇవి లభ్యమవుతున్నాయి. చోకర్లు, కంఠాభరణాలు, పెండెంట్లు, ఉంగరాలు, చెవికమ్మలు, గాజులు, బ్రేస్లెట్లు, వాచ్బెల్టులు, గొలుసులు ఇలా అతివలు ముచ్చటపడే నగలన్నీ నిండైన నలుపు మెరుపులతో సిద్ధంగా ఉన్నాయి.
సంప్రదాయ దుస్తులపై ధరించేందుకు వీలుగా పెద్దపెద్ద చోకర్లు, హారాలతోపాటు వెస్ట్రన్ వేర్‌పై నప్పేలా సన్నటి, చిన్నచిన్న నగలూ దొరుకుతున్నాయి. పైనుంచి కిందివరకు ఒకే థీమ్‌తో అలంకరించుకునేలా కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్! ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ట్రై చేయండి!