బ్యూటీ, ఫిట్‌నెస్‌ వ్యాపారంలో తిరుగులేని విజయం వందన లూత్రా


Mon,January 13, 2020 01:56 AM

నేడు యువతరానికి ఆరోగ్య స్పృహతో పాటు సౌందర్య స్పృహ కూడా ఎక్కువే. ఈ విషయాన్ని ఆమె మూడు దశాబ్దాల క్రితమే గ్రహించారు. అందుకే ఆ రెండింటినీ ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశ్యంతో వీఎల్‌సీసీ బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ కంపెనీని ప్రారంభించారు. ఒకప్పుడు గృహిణిగా ఇంటికే పరిమితమైన ఆమె ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే 1989లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, నేడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్‌ సహకార సమాఖ్యలలోని సుమారు 16 దేశాల్లో రెండొందల నగరాలకు విస్తరించింది వీఎల్‌సీసీ. ఇప్పటికీ విజయ వంతంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పదమూడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయిన వీఎల్‌సీసీ(వందనా లూత్రా కరల్స్‌ అండ్‌ కర్వస్‌) వ్యవస్థాపకురాలు వందనలూత్రా సక్సెస్‌మంత్ర.
vandana-luthra-center1
వందన లూత్రా కుటుంబానిది కోల్‌కతా. కానీ వారు ఢిల్లీలో స్థిరపడ్డారు. అక్కడే 12 జూలై 1959న వందన జన్మించారు. తండ్రి మెకానికల్‌ ఇంజినీర్‌ కాగా తల్లి చారిటబుల్‌ యోగా ఆశ్రమం నిర్వహిస్తుండేది. వందన ఢిల్లీలోనే పాలిటెక్నిక్‌ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రసిద్ధ లేడీ శ్రీరామ్‌ కళాశాలలో మనస్తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ ్త చేసింది. ఆ తరువాత సౌందర్య రంగం పట్ల ఆసక్తిని పెంచుకుని జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌లో పోషకాహార, సౌందర్య శాస్ర్తాల్లో ఉన్నత విద్యనభ్యసించారు.


పెద్దలకు ఇష్టం లేని పెళ్లి

ఒకవైపు ఉన్నత చదువులు చదువుతున్న సమయంలోనే ముఖేష్‌లూత్రాను ప్రేమించింది. ఆడపిల్లలకు పూర్తిస్వేచ్చాస్వాతంత్య్రాలు ఉండాలని కోరుకునే అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబంలో పుట్టి, స్వతంత్రవ్యక్తిత్వం కలిగిన వందన వ్యాపారంలో స్ధిరపడిన సంప్రదాయ కుటుంబానికి చెందిన ముఖేష్‌ను ఇష్టపడింది. అతను కూడా వందన వ్యక్తిత్వాన్ని అమితంగా ఇష్టపడేవాడు. కానీ తమ ప్రేమను పెద్దలకు చెబితే రెండూ కుటుంబాలు అందుకు ఒప్పుకోలేదు. అయినా వారిద్దరూ పెద్దలను కాదని 1980లో పెళ్లిచేసుకున్నారు. తను పెరిగిన వాతావరణం, కుటుంబ వ్యవస్థకు పూర్తి భిన్నమైన కట్టుబాట్లు సంప్రదాయాల కుటుంబంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్నతనం నుండి తను ఏది కావాలన్నా ఇష్టంగా చేసిన వందన మెట్టినింట్లో మాత్రం నెగ్గుకురాలేకపోయింది. కట్నం తీసుకురాలేదని, తమకు ఇష్టమైన అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని చేసుకున్నాడన్న కోపం ఆమె అత్తలో కనిపించేది. అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయాలను వల్లేవేస్తూ వందనను వేధించేది. అలవాటు లేకపోయినా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అయినా అత్త ఈసడింపులు మాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఆమెకు ఒకరి తర్వాత ఒకరు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడం ఆమె జీవితాన్ని మరింత నరకప్రాయం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అత్తారిల్లు వదిలి వేరుకాపురం పెట్టాల్సి వచ్చింది.

మలుపు తిరిగిన జీవితం

మెట్టినింట్లో ఎక్కువ మంది ఉండడంతో ప్రతిరోజు పొద్దున లేచింది మొదలు అర్థరాత్రి వరకు తీరికలేకుండా ఏదో ఒక పనిచేయాల్సి వచ్చేది. కానీ వేరుకాపురంలో భర్త ఆఫీసుకు , పిల్లలు స్కూలుకు వెళ్లగానే ఆమెకు చాలా ఖాళీ సమయం ఉండేది. దీంతో బోరుకొట్టేది. అదే సమయంలో పిల్లలను స్కూలుకు పంపే క్రమంలో వారిని అందంగా అలంకరించడం చేసేది. వారిని చూసిన ఇతర పిల్లలు కూడా ఆమెతో తమ అందానికి మెరుగులు పెట్టించుకునేందుకు ఆసక్తిని చూపేవారు. ఇంటికి వచ్చే పిల్లల స్నేహితులకు, వారి తల్లిదండ్రులకు కేశాలంకరణ, సౌందర్య చిట్కాలు, పోషకాహారం తదితర అంశాల పట్ల అవగాహన కల్పించేది. తక్కువ సమయంలోనే వారంతా వందనకు అభిమానులయ్యారు. ‘వందనా నువ్వు ఒక బ్యూటీపార్లర్‌ పెడితే చాలా బావుంటుంది’ అని వారి మాటల్లోనే చెప్పేవారు. వారి మాటలు వందనను ఆలోచింపజేశాయి. తనకు తెలిసిన పనే కనుక ఎలాంటి ఇబ్బందిలేకుండా కొనసాగవచ్చని ఆమె గమనించింది. పలు బ్యూటీపార్లర్‌లను సందర్శించి వారి పనితనాన్ని గుర్తించేది. న్యూట్రీషియన్‌ సంస్థలను చుట్టివచ్చేది. అదే సమయంలో బ్యూటీపార్లర్‌ నిర్వహణ, పోషకాహారం విషయంలో అనేక పరిశోధనలు చేసింది. వాటిలో కొత్త ప్రయోగాలు ప్రవేశపెట్టేది. అదే సమయంలో ఢిల్లీలో ఒకరు తాము నిర్వహిస్తున్న బ్యూటీపార్లర్‌ను మూసివేస్తున్నట్లు ఎవరో వందన దృష్టికి తీసుకు వచ్చారు. ఇక ఆలస్యం చేయలేదు. బ్యాంక్‌లో కొంత రుణం తీసుకుని దాన్ని కొనుగోలు చేసింది.

తల్లిపైనే తొలి ప్రయోగం

vandana-luthra-center2
చదువుకుంటున్న రోజుల్లోనే వందన సౌందర్య, శరీర సంరక్షణ, ఆరోగ్యం..వంటి రంగాల పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే రంగాల్లోనే ఉన్నత విద్యను అభ్యసించింది. సౌందర్య ఉత్పత్తుల విషయంలో తను అనేక ప్రయోగాలు చేసేదట. వాటిని తన తల్లిమీదే ప్రయోగించేది. ముఖ్యంగా శనగపిండితో ఫేషియల్‌ చేయడం, జుట్టుకు గోరింటాకు పట్టించడం వంటివన్ని చేసేదట. బతికినన్ని రోజులు అందంతో పాటు ఆనందం, ఆత్మవిశ్వాసంతో బతకాలన్నదే ఆమె ఆకాంక్ష. అందుకే ఎంత వయస్సు వచ్చినా సౌందర్య సాధానాలను ఉపయోగించాలని ఆమె ఎప్పుడూ చెబుతుండేవారట.

తొలి అడుగు

అది 1989.. అప్పటికీ మహిళలు వ్యాపారరంగంలోకి అంతగా రాని కాలం. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు వ్యాపారం చేస్తున్నారంటే చిన్నచూపు చూసేవారు. అయినా వందన వెనుకడుగువేయలేదు. తను కోరుకున్న రంగంలోకి అడుగుపెడుతున్నానన్న సంతోషం కన్న దాని నిర్వహణకు అవసరమైన రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోయేది. ఎవరూ కూడా లోన్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. కానీ వాస్తవానికి అప్పటికీ అందం మీద అంతగా అవగాహన లేని కాలం. అందులోనూ బ్యూటీపార్లర్‌ అంటే చిన్నచూపు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా తిరిగి బ్యాంకులో రుణం సంపాదించింది. దానితో తొలి ఔట్‌లెట్‌ ప్రారంభించింది. ఒకవైపు అత్తగారింటి నుండి సూటిపోటిమాటలు. గొప్ప వ్యాపారస్తుల కోడలు బ్యూటీపార్లర్‌ నడపడం ఏంటీ అంటూ ప్రశ్నలు. అయినా వెనుకడుగు వేయలేదు. దానికి వందన తన పేరే పెట్టుకుంది వందనా లూత్రా కరల్స్‌ అండ్‌ కర్వస్‌ (విఎల్‌సీసీ)అని. ఆమె ప్రయత్నం విజయవంతమైంది. అప్పటివరకు ఇంటికే పరిమితమైన ఆడవారు విఎల్‌సీసీలోకి అడుగుపెట్టడమే కాకుండా అక్కడి ట్రీట్‌మెంట్‌కు ఆకర్షితులయ్యారు. కేవలం బ్యూటీనే కాకుండా బరువుతగ్గించుకోవడం, పౌష్టికాహారం, ఫిట్నెస్‌ ఇలా అన్ని రకాల సేవలు ఒకే దగ్గర లభిస్తుండడంతో మహిళలు క్యూ కట్టారు. వ్యాపారం పుంజుకుంది. ఒకటిగా మొదలైన ఔట్‌లెట్ల సంఖ్య ఏడాదికే పదికి పెరిగాయి.

గుర్తింపు

వీఎల్‌సీసీ అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందింది. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సినీతారలు, క్రీడాకారులు ఇలా సంపన్నులే కాకుండా మధ్యతరగతి వారు కూడా తమ అవసరాల కోసం ఇక్కడికి వచ్చేవారు. దీంతో తక్కువ కాలంలోనే వందన ప్రముఖుల సరసన చేరింది. అప్పటివరకు ఇతర ఉద్యోగంలో ఉన్న భర్త కూడా ఆమెతో కలిసివచ్చారు. మరోవైపు అత్త కూడా తను చేసిన తప్పు తెలుసుకుని ఆమెను చేరదీశారు. దీంతో చర్మ సౌందర్యం, ఆరోగ్య సేవల రంగంలో వీఎల్‌సీసీకి మంచి గుర్తింపు వచ్చింది. అనేకమందిని ఆకర్షించడంతో ఆమెతో కలిసి పనిచేయడానికి పలు సంస్థలు, ఇతర ప్రాంతాల్లో ఔట్‌లెట్లు తెరవడానికి భాగస్వాములు పెరిగారు. మరోవైపు విదేశాలకు కూడా విస్తరించింది ఆసియా, ఆఫ్రికాలలోని పదహారు దేశాల్లో రెండువందలకు పైగా నగరాలకు విస్తరించింది. అంతేకాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద శిక్షణా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు వందన ఆస్తి రూ. 1300 కోట్లు.

పద్మశ్రీ వందన

vandana-luthra-center
ఖాళీ చేతులతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి మూడు దశాబ్దాలలో ఆమె సాధించిన విజయాన్ని పలు సంస్థలు గుర్తించాయి. కేంద్రప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి 2013లో ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది. అలాగే 2015 ఫార్చూన్‌ ఇండియా ప్రచురించిన శక్తివంతమైన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్లో 33వ స్థానం దక్కించుకున్నారు. ఇవే కాక ఇంకా అనేక ఆవార్డులు, రివార్డులు వందనలూత్రా ఖాతాలో చేరాయి. అలాగే వెల్‌నెస్‌, ఫిట్‌నెస్‌లు ప్రధానాంశంగా కంప్లీట్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం, ఎ గుడ్‌ లైఫ్‌ పేరుతో రెండు బుక్స్‌ కూడా ఆమె వెలువరించారు.

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles