ఇంటర్నెట్‌ స్టార్‌


Mon,January 13, 2020 01:48 AM

దివ్యాంగురాలన్న కారణంతో ఆమెను కొందరు చిన్నచూపు చూశారు. కళాశాలలో చేర్చుకునేందుకూ నిరాకరించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను భరించింది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసి తానేంటో నిరూపించుకున్నది.
chandini-nair
కేరళకు చెందిన చాందినీ నాయర్‌ అనే యువతికి పుట్టిన ఏడాదికే కాళ్లకు కండరాల సంబంధిత వ్యాధి వచ్చింది. చికిత్స అందించేలోపే ఆమె కాళ్లు చచ్చుబడి పోయాయి. దీంతో ఆమె వీల్‌ చైర్‌కు పరిమితం అయింది. ఆమె పుట్టింది కేరళలోనే అయినా, పెరిగింది మాత్రం తమిళనాడులో. చాందినీ నాయర్‌ వీల్‌ చైర్‌కు పరిమితం కావడం వల్ల ఆమెను పాఠశాలలో చేర్చుకునేందుకు ఆయా యాజమాన్యాలు నిరాకరించాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధ పడేవాళ్లు. బాగా చదివి డాక్టర్‌ కావాలనుకునేది చాందిని. ఆమె పట్టుదల చూసిన తండ్రి ఓ పాఠశాలలో చేర్పించాడు. చాందిని పదోతరగతి పరీక్షలు రాసే సమయంలో ఆమె వెన్నెముకకు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. అటువంటి సమయంలో తల్లిదండ్రుల సాయంతో చదివింది. ఆరు నెలల వరకూ చాందినీ బెడ్‌ మీదనే ఉండాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లోనే ఆమె పదోతరగతి పరీక్షలు రాసి, 88 శాతం మార్కులతో పాసయింది.


బెంగళూరులోని ఆక్స్‌ఫోర్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో సీటు లభించింది. ఈ కళాశాలలో ఆమెకు అనుకూలమైన మరుగుదొడ్డి కట్టించడంతోపాటు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. చిన్నప్పటి నుంచి టీవీలో పాటలు వినేది. ఆ సమయంలో టీవీ సౌండ్‌ మ్యూట్‌లో ఉంచి ఆమె అద్భుతంగా పాడేది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు చాందినిని ప్రోత్సహించారు. డబ్‌స్మాష్‌, టిక్‌ టాక్‌ వంటి యాప్‌ల ద్వారా వీడియోలు రూపొందించింది. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఐదు మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించారు. చాందిని గాత్రానికి ఫిదా అయిన నెటిజన్‌లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించడం మొదలు పెట్టారు.‘ దివ్యాంగులపై జాలీ,దయ చూపవద్దు. చిరు నవ్వు నవ్వి వారిని ప్రోత్సహిస్తే చాలు అటువంటి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దివ్యాంగులందరిలోనూ ఎంతో ప్రతిభ దాగి ఉన్నది. ప్రతిభ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. ఆ ప్రతిభే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని’ చాందిని నాయర్‌ చెబుతున్నది. ‘మీలో ఎటువంటి టాలెంట్‌ ఉన్నా దానిని బయటి ప్రపంచానికి తెలియజేయండి. దీనివల్ల మంచి గుర్తింపు వస్తుందని’ అంటున్నది. చాందిని పాటలకు మంత్రముగ్ధులవుతున్న నెటిజన్లు ఆమెను ‘ఇంటర్నెట్‌ స్టార్‌' అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

490
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles