గీతాజయంతి సందర్భంగా..గీతామృతం!


Sun,December 8, 2019 01:17 AM

Chintana

- ప్రపంచ సమస్యలన్నింటికీ భగవద్గీతలోనే పరిష్కారాలు
- వాటిని అందిపుచ్చుకోవడమే తరువాయి
- గీతా పారాయణమే ప్రతి ఒక్కరికీ మార్గదర్శి

ప్రతి ఒక్కరూ తోటివారికి తగిన సాయమందించగలిగినప్పుడు ఇక ఈ ప్రపంచం ఏ మాత్రం దుఃఖాలయం కాజాలదు! ఆవిర్భావ తిథియైన ఈ పవిత్ర ‘గీతాజయంతి’ రోజునుండి భగవద్గీత పారాయణం ప్రారంభిద్దాం. క్రమం తప్పని పఠనం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. తద్వార శాంతియుత సమాజ స్థాపనలో ఏర్పడే అవరోధాలను, శక్తులను అధిగమిద్దాం.

ప్రపంచంలోని ధృవీకృతమైన సమస్త విజ్ఞానానికే ‘వేదం’ అని పేరు. మనకు తెలిసిన ఈ ప్రపంచంలోని విజ్ఞానంతోపాటు మనకు తెలియని ప్రపంచాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సైతం మనం ప్రయోగాత్మకంగా గానీ లేదా ప్రాచీన సంప్రదాయాల ద్వారాగానీ అర్థం చేసుకోవచ్చు. జీవం ఉనికికి చెందిన వాస్తవాలను ప్రయోగాత్మకంగా విశ్లేషించి నిర్ధారించటమన్నది సమయం, డబ్బుతోపాటు ఎంతో పరిశ్రమతో కూడుకున్న పని. ఐతే, ఒక ప్రామాణిక వైదిక సంప్రదాయాన్ని లేదా పరంపరనుగానీ ఆశ్రయించినట్లయితే, జీవానికి సంబంధించిన నిగూఢ సత్యాలను తెలుసుకోవడం అత్యంత సులభం. ప్రయోగాల ద్వారా తెలుసుకున్న జ్ఞానమేదీ స్థిరంగా ఉండటం మనం చూడట్లేదు. పలు పరిశోధనల ద్వారా నిత్యం ఆవిష్కృతమవుతున్న నూతన సిద్ధాంతాలతో గతంలో కనుగొన్న జ్ఞానాన్ని సరిదిద్దడం లేదా మరింత మెరుగు పరచటం నిత్యం జరుగుతున్న ప్రక్రియే. ఇదిలావుండగా, శతాబ్దాలు గడిచినా ఎటువంటి మార్పులూ చెందని వైదిక విజ్ఞానానికి మాత్రం సుస్థిరతే విలక్షణం.

ప్రాపంచిక పరిశోధనలతో సముపార్జించిన జ్ఞానం ఈ ప్రపంచంలోని కొన్ని సత్యాలనైతే కనుగొన్నది, ముఖ్యంగా శారీరక సౌకర్యాలను మెరుగుపరిచే రంగంలో. ఉదాహరణకు సమాచారం, రవాణా సదుపాయాలకు సంబంధించి మరిన్ని సౌకర్యాల కోసం మొబైల్స్‌, విమానాలు, వాహనాలు మొదలైనవెన్నో కనుగొన్నాం. ఈ ఆవిష్కరణలన్నీ ప్రశంసనీయమైనవే అయినా వీటివల్ల ప్రపంచంలో పర్యావరణ సమస్యలు, కాలుష్యం, పోషక లోపం, వాతావరణ మార్పులూ మొదలైన అనేక రకాల సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచంలోని ఈ సమస్యలకుగల మూలకారణాలకు తమ వద్ద పరిష్కారమేదీ లేదని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు.

నేడు ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కారణం స్వార్థం, లోభం, క్రోధం, నిర్లక్ష్యాలే. జీవితంలోని ఈ సమస్యలకు మాత్రం ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్తా పరిష్కారం కనుగొనలేకపోతున్నాడు. నేటి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం మనకు కొత్త కొత్త పరికరాలను అందిస్తున్నది. మన సౌకర్యాలను మెరుగుపరచింది మన ప్రయోజనాల కోసం. ప్రకృతిలోని సహజ పరిణామాలను సైతం మార్పు చేయగల సాంకేతికతను పెంపొందించుకుంటున్నప్పటికీ, మన భౌతిక పురోగమనానికి మాత్రమే అది పరిమితమైంది. కానీ, జీవితానికి సంబంధించి సాధించవలసిన పురోగతి మాటేమిటి? నిత్య జీవన సమస్యలైన అసంతృప్తి, విపరీత స్వార్థబుద్ధి, దురాశ, అహంకారాలను తొలగించే పరిష్కారం ఎక్కడ? ఆ మార్గం మనకెవరు చూపిస్తారు?

మన మనసులోని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే ఈ ఉద్వేగాలకు పరిష్కార మార్గం చూపే అత్యున్నత విజ్ఞానశాస్త్రమే శ్రీమద్భగవద్గీత. ‘త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మాన:/ కామ: క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్‌. కామం, క్రోధం, లోభం అనే మూడు నరకద్వారాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవి ఆత్మ ప్రబోధానికి అడ్డంకులు. అందుకే, బుద్ధిమంతుడైన ప్రతి మనిషీ వాటిని త్యజించాలి [భ.గీ. 16.21]. జీవం లేదా ఆత్మకు సంబంధించిన విషయాలపై భగవద్గీత విస్తృతంగా వివరించింది. ఒక వ్యక్తి పతనానికిగల కారణాలను వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు అవసరమైన చక్కటి మార్గనిర్దేశాలను సైతం అందించింది.

భౌతిక జడపదార్థాలకన్నా జీవం ఉత్తమమైందని మనందరికీ తెలుసు. అంటే, జీవాత్మ అయిన ఒక శాస్త్రవేత్త కూడా ఈ భౌతిక ప్రకృతికన్నా శ్రేష్ఠుడు. అందుకే, అతడు ఈ ప్రకృతిలోని ఎన్నో అందమైన విషయాలను కనుగొనగలుగుతున్నాడు. భగవద్గీత ఆత్మ, జడపదార్థం మధ్యనున్న వ్యత్యాసాన్ని సుస్పష్టంగా వివరిస్తుంది. మనమంతా పైకి కనిపించే ఈ భౌతిక దేహాలం కాదని, ఈ దేహంలో కొలువైవున్న ‘ఆత్మ స్వరూపులమని’ గీత ప్రవచించింది. ఈ భౌతిక శరీరం కన్నా మనం ఉత్తములమైనప్పటికీ, ప్రస్తుతం ఇందులో బంధీలమయ్యామన్న సత్యాన్ని మరిచిపోకూడదు. ఒక జీవాత్మ అధోగతి చెందితే, ఇక శాస్త్రీయ సిద్ధాంతాలు/ఆవిష్కరణలు కూడా ఈ ప్రపంచాన్ని దిగజార్చడానికే ఉపయోగపడతాయి. వాతావరణంలో మార్పులు, కాలుష్యం మొదలైన వాటికే కారణమవుతాయి. కాలుష్యం, ఆకలి, పోషక లోపాలు, వ్యాధుల పెరుగుదల, జీవితంలో అసంతృప్తి, మన:శ్శాంతి లేకపోవటం వంటి ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో ప్రపంచమంతా ఒక్కసారి భగవద్గీతపై దృష్టిని సారించాలి. ఈ ఉద్గ్రంథం చూపే పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టగలగాలి.

లోభం, క్రోధం, అనియంత్రిత కామం వంటి ధోరణులను నియంత్రించి, ప్రజల్లో సంతృప్తి, శాంతి, సౌభాగ్యాలను పెంపొందించడంలో భగవద్గీత గొప్పగా సహాయపడుతుంది. మనసు లోభంతో నిండినపుడు, తాను ప్రపంచాన్ని జయించినా సంతృప్తి చెందడు. కాని, సంతృప్తి పొందే మార్గం తెలిసినవాడు రిక్షా నడుపుకునే వాడైనా ఆనందంగా జీవించగలడు. తానేగాక తన కుటుంబం కూడా ఆనందంగా వుంటుంది. తాను ఈ భౌతిక శరీరం కాదు, సచ్చిదానంద ఆత్మ స్వరూపుడినని తెలుసుకోవటమే ఆ సంతృప్తిలోని రహస్యం. మన నిజమైన ఈ స్వరూప తత్త్వాన్ని భగవద్గీత వివరిస్తుంది. ఆధ్యాత్మిక లోకం నుండి ఈ భౌతిక లోకానికి బాటసారులుగా వచ్చిన మనం దారి తప్పిపోయాం. అరిషడ్వర్గాలను వీడి తిరిగి మళ్ళీ ఆ దిశగా ప్రయాణించేందుకు వీలుగా ఆత్మను జాగృతం చేసే విజ్ఞానాన్ని భగవద్గీతనుంచి అందుకొందాం.

ప్రపంచంలోని ప్రజలంతా తమకు సులువుగా లభించే వాటితో సంతృప్తిగా జీవించగలిగినప్పుడు, ప్రపంచం ఎంత ఆనందంగా ఉండగలదో ఒక్కసారి ఊహించండి. ఇక అప్పుడు కామ, క్రోధాదులతో ఎవ్వరూ ప్రకృతి నియమాలను ఉల్లంఘించరు. అలాగే, ప్రతి ఒక్కరూ తోటివారికి తగిన సాయమందించగలిగినప్పుడు ఇక ఈ ప్రపంచం ఏ మాత్రం దుఃఖాలయం కాజాలదు! ఆవిర్భావ తిథియైన ఈ పవిత్ర గీతాజయంతి రోజునుండి భగవద్గీత పారాయణం ప్రారంభిద్దాం. క్రమం తప్పని పఠనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. తద్వార శాంతియుత సమాజాన్ని స్థాపించడంలో ఏర్పడే అవరోధాలను సృష్టించే శక్తులన్నింటినీ తరిమికొడదాం. భగవద్గీతలోని సూచనలను అర్థం చేసుకొని వాటిని ఆచరించగలిగే శక్తిని ఆ భగవంతుడే మనందరికీ ప్రసాదించాలని కోరుకొందాం. ఓం తత్‌ సత్‌.

ఆధ్యాత్మిక పరివర్తనే అసలు పరిష్కారం!

అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షకుడు గస్‌ స్పెత్‌ (Gus Speth) అభిప్రాయం ఇక్కడ సందర్భోచితం. ‘ప్రకృతిలో జీవవైవిధ్యం క్షీణించడం, సమతుల్యత లోపించడం, వాతావరణంలోని మార్పులే పర్యావరణంలోని ప్రధాన సమస్యలుగా నేను భావించే వాడిని. మరో ముప్పై ఏండ్ల సైన్స్‌ పురోగతి వీటన్నింటికీ పరిష్కారం చూపగలదని అనుకునే వాడిని. కానీ, నేను పొరపాటు పడ్డాను. సమాజంలోని స్వార్థం, లోభం, ఉదాసీనతలే వాస్తవానికి అసలైన ప్రధాన సమస్యలు. వాటి నిర్మూలనకు సమాజం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా పరివర్తన చెందటం ఎంతైనా అవసరం. అయితే, అది ఎలా చేయాలో మాత్రం మా శాస్త్రజ్ఞులకు తెలియడం లేదు’ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Chintana1

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles