నర్మద పరిక్రమ


Sun,December 8, 2019 01:13 AM

Narmada
దైవం మానవరూపంలో!
తీర్థయాత్ర : 32


- మల్లాది వెంకట కృష్ణమూర్తి

(గత సంచిక తరువాయి)
31 అక్టోబర్‌ 2008, శుక్రవారం- 13వ రోజు

ముందురోజు రాత్రే నాలుగు వ్యాన్‌లను మాట్లాడారు దేశాయ్‌. ఆ రోజు అమర్‌కంటక్‌కు మా ప్రయాణం. అది తూర్పు మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌ జిల్లా. ‘అమర్‌ కంఠం’ అంటే శివుడి గొంతు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని కంఠంలోకి గ్రహించిన తర్వాత శివుడు ఇక్కడికే వచ్చి నర్మద నీటితో తన మండే గొంతు మంటను చల్లార్చుకొన్నట్టు పురాణ కథనం. సముద్రమట్టానికి 1,000 మీటర్ల ఎగువన ఉన్న అమర్‌కంటక్‌ శిఖరంపైనే నర్మద పుట్టింది. దీన్ని ‘తీర్థరాజ’ అనీ పిలుస్తారు. ఇది మైకల్‌ పర్వతశ్రేణిలోని అతిఎత్తయిన శిఖరాల్లో ఒకటి.

అమర్‌కంటక్‌ శిఖరం కింద కోటి టన్నుల బాక్సైట్‌ నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ బొగ్గుగనులు కూడా ఉన్నాయి. సోహన్‌పూర్‌ కోల్‌మైన్స్‌లో 406కోట్ల 40లక్షల టన్నుల బొగ్గునిల్వలు ఉన్నాయని అంచనా.
కొంతదూరం వెళ్లాక వ్యాన్‌లు ఆగిపోయాయి. అక్కడినుంచి నర్మద పుట్టే కొండమీదకి రోడ్డు లేదు. కాలినడకనే వెళ్లాలి. దేశాయ్‌, ప్రభులకు దారి తెలుసు. మేమంతా వాళ్లను అనుసరించాం. అడవిలో అటు, ఇటు దట్టమైన చెట్లు. అక్కడక్కడ నర్మద నది ఉపరితలంలో మనిషి దాట గలిగేంత కాలువలుగానూ పారుతున్నది. వాటిని దాటకూడదని మమ్మల్ని పక్క నుంచి తీసుకెళ్లారు. తెలియని వారు వాటిని దాటే అవకాశం ఉంటుంది. కాలిబాటన దాదాపు 2 కి.మీ. దూరం వెళ్లాక ఓ చోట కంచెకింద నుంచి దూరి వెళ్తే నర్మద పుట్టినచోటు వచ్చింది. ఎలుగుబంట్లు రాకుండా ఓ కంచె కట్టారు.

ఓ మామిడి చెట్టుకింద చిన్న గుండంలో నర్మద పుట్టింది. గుండం ఇవతల నుంచి చూడాలి తప్ప, దానికి ప్రదక్షిణ చేసినా, అవతలికి వెళ్లినా నదిని దాటినట్టే. అక్కడి పూజారి ఓ కర్రను గుండానికి అడ్డంగా పట్టుకొని నిలబడ్డాడు. అటువైపు పరిక్రమ వాసులు వెళ్లకూడదన్న బోర్డుకూడా ఉంది. నర్మదా గుండంలోని నీటిని మా నెత్తిన చల్లుకొని, నర్మదమాతకు పూజ చేశాక పూజారి మా అందరికీ తీర్థం ఇచ్చాడు. నల్లటి రాతితో చేసిన నర్మద మాత విగ్రహం. వెండికండ్లతో చూడముచ్చటగా ఉన్నది. ఆ ఆలయానికి ఎదురుగా అమరకంఠేశ్వర శివలింగం ఉంది. ఇది స్వయంభువు. పక్కనే తెల్లరాతితో చేసిన పార్వతి విగ్రహం ఉన్నది. ఇంకా, సూర్య, విష్ణు, గోరఖ్‌నాథ్‌, గ్యారా రుద్ర (11 శివలింగాలు) దేవాలయాలుకూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఓం నర్మదే హర’ అని పూజారితోపాటు చాలామంది భక్తిగా కీర్తించారు. అక్కడ 61 ఏండ్ల నుంచి మౌనవ్రతం పాటిస్తున్న ఓ మౌనస్వామిని చూశాను. అమర్‌కంటక్‌లో నర్మద నదిని ఓ వంతెనమీద నుంచి దాటివచ్చిన మా బస్సులోకి అందరం ఎక్కాం. ఇప్పుడు ఉత్తర తటిన రెండవ తీరంలో ప్రయాణించి మేము పరిక్రమ ఆరంభించిన ఓంకారేశ్వర్‌కు చేరుకొంటే మా పరిక్రమ పూర్తయినట్లే.

1 నవంబర్‌ 2008, శనివారం-పద్నాలుగో రోజు

బస్సు బయలుదేరే ముందు నేను ఎదురుగా ఉన్న సత్రానికి వెళ్లి, దాని యజమానురాలిని కలిశాను. నడుం వంగిపోయిన ఆ వృద్ధురాలి కాళ్లకు దండం పెట్టి 100 రూపాయలు ఇచ్చాను. ఆజన్మ బ్రహ్మచారిణి అయిన ఆవిడ అక్కడి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాక, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌తో ఆ సత్రాన్ని కట్టించింది. నర్మద మాత భక్తురాలైన ఆవిడ పరిక్రమ వాసుల కోసం ఏ సౌకర్యాలూ లేని అక్కడ దీనిని కట్టించింది. అలాంటి నర్మద మాత భక్తురాలి కాళ్లకు దండం పెట్టాలని అనిపించింది. ఆవడ లాంటివారు అరుదు. డబ్బు చూసి ఆవిడ ఎంతో సంబురపడింది.

మా బస్సు ఆరింటికల్లా మళ్లీ బయలుదేరింది. నర్మదా నదికి 100 గజాల దూరంలో ఉన్న ఘోడాచౌక్‌లో గోపాల్‌ మందిర్‌ (అగర్వాల్‌ హౌజ్‌) అనే ఓ సత్రం ముందు ఆగింది. హోషంగాబాద్‌లో ఇంకా కోరిఘాట్‌, కంకళ్‌ ఘాట్‌, పిచనీ ఘాట్‌, ఖర్చా ఘాట్‌ మొదలైనవి ఉన్నాయి. సేఠాణీ ఘాట్‌లో నది ఒడ్డున ఏడెనిమిది పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నది బాగా విశాలంగా ఉన్నది. మెట్లమీద కూర్చుని ఉన్న ఓ సన్యాసిని పలుకరించాను. కర్నాటకు చెందిన అతను కురుక్షేత్రం నుంచి వచ్చారు. నర్మద పరిక్రమలో లేరు. ‘అప్పుడప్పుడు కురుక్షేత్రం నుంచి వచ్చి అక్కడ జపం చేసుకొని వెళ్తుంటానని’ చెప్పారు. పేరు శంకర చైతన్య అన్నారు. కురుక్షేత్రంలో ‘బ్రహ్మ సరోవర్‌' అనే పెద్ద చెరువు ఉందని, తను అక్కడే ఉంటానని, తనలా అక్కడ చాలామంది సన్యాసులు ఉంటారని చెప్పారు. కురుక్షేత్రానికి 8 కి.మీ. దూరంలోని ‘జ్యోతీశ్వర్‌' ప్రాంతమే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధ చేసిన చోటు అని చెప్పారు. 64 ఏండ్ల శంకర చైతన్య నిత్యం మూడు పిడకలు కొని వాటిని రాజేసి రొట్టెలు చేసుకొని తింటుండడం విశేషం.

2 నవంబర్‌ 2008, ఆదివారం- పదిహేనవ రోజు

ఉదయం నాలుగున్నరకే మెలకువ వచ్చింది. బస్సు బయల్దేరాక ఖాండ్వాలోని ధునివాలా బాబా సమాధి మందిరానికి కిలోమీటర్‌ దూరంలోని రోడ్డువద్దకు వచ్చింది. కానీ, అక్కడ బస్సు ఆపలేదు. ఆపి వుంటే, సమాధిని దర్శించుకొనే వాణ్ణి. మధ్యాహ్నం 1 గంటకు ధన్‌గావ్‌ అనే ఊళ్లోని హనుమాన్‌ ఆశ్రమం ముందు బస్సు ఆగింది. అందులో రామాలయం, పంచానన హనుమాన్‌ మందిరం ఉన్నాయి. హనుమాన్‌ మందిరంలోని మనోహర్‌దాస్‌ అనే బ్రహ్మచారి 25 ఆగస్టు 2008 నుంచి పన్నెండేండ్లపాటు మౌనదీక్షలో ఉన్నారు. ఆయన వయసు అరవైదాకా ఉండవచ్చు. చాలామంది మౌనస్వాముల్లా ఆయనకూడా కమ్యునికేషన్‌ కోసం ఒక పలకను వాడుతున్నారు. లంచ్‌ అయ్యాక మా బస్సు బయల్దేరి మధ్యాహ్నం రెండున్నరకల్లా ఓంకారేశ్వర్‌కు చేరింది.

సాయంత్రం నర్మద నదికి వెళ్లాం. ఒక్కోటి రూపాయి చొప్పున చిన్న పిల్లలు అమ్మే దొప్పల్లోని మైనపు వత్తులను వెలిగించి, యాత్రికులు నదిలో దీపాలను వదులుతున్నారు. నదిలోకి విసిరే కొబ్బరికాయలను పిల్లలు ఈది తెచ్చుకొంటున్నారు. బయల్దేరేప్పుడు ఎక్కడైతే స్నానాలు చేసి సంకల్పం తీసుకొన్నామో అక్కడే పరిక్రమకు ఉద్వాసన చెప్పుకొన్నాం. ఓ బ్రాహ్మణుడు మళ్లీ పూజ చేసి, మాతో ఉద్వాసన చేయించాడు. నదికి 2,400 కి.మీ. ప్రదక్షిణం చేసి బయలుదేరిన చోటుకు రావడంతో మా నర్మద పరిక్రమ విజయవంతంగా సంపూర్ణమైంది. తలో అయిదు రూపాయలు ఇచ్చి పడవలో అవతలి ఒడ్డుకు చేరుకొని మెట్లమీదుగా ఓంకారేశ్వరాలయానికి వెళ్లాం. మా పరిక్రమ మొదలయ్యాక నదిని దాటడం ఇదే మొదటిసారి.

3 నవంబర్‌ 2008, సోమవారం-పదహారవ రోజు

ఉదయం త్వరగా లేచి, వేగంగా నదికి వెళ్లి మూడుసార్లు మునిగి ఆ తడిబట్టల్తోనే వెళ్లి ఓంకారేశ్వరుని దర్శనం చేసుకొన్నాం. గర్భగుళ్లో చిన్న క్యూ ఉన్నది. లింగాన్ని అభిషేకించడానికి అక్కడ ఓ చిన్న చెంబు, నీళ్లు ఉన్నాయి. నా ముందున్న అతను లింగానికి అభిషేకం చేస్తుండగా అతని వెనకనే వున్న నన్ను పూజారి వెనుక వాళ్లకు అడ్డు రాకుండా వెళ్లిపొమ్మని చెప్పారు. నేను కదలగానే తెల్లబట్టల్లోని ఒకతను తన చేతిలోని నీళ్లున్న చెంబును నాకు ఇచ్చి వెళ్లిపోయారు. నా ముందతను కూడా వెళ్లిపోయాడు. నేను కొద్దినీటిని లింగంపై అభిషేకం చేశాను. బయటికి వచ్చి, అతనికి థ్యాంక్స్‌ చెబుదామని చూస్తే ఆ తెల్లబట్టల వ్యక్తి అక్కడ లేడు. ‘దైవం మానుష రూపేణ’ అనుకొన్నాను.

పదహారు రోజులపాటు నర్మద పరిక్రమ చేశాక అది పూర్తయిందన్న ఉత్సాహంతో తిరుగు ప్రయాణం చాలా హుషారుగా సాగింది. కానీ, నేను నా మనసును నర్మదమాత మీంచి అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాల మీదకు తీసుకురాలేక పోయాను. సాయంత్రం అయిదు ముప్పావుకు మా బస్సు నాసిక్‌కు చేరుకుంది.

మా పరిక్రమ గుజరాత్‌లో రెండు రోజులు, మధ్యప్రదేశ్‌లో పద్నాలుగు రోజులు సాగింది. ఈ యాత్రలో వేల కి.మీ. ఎత్తెత్తి పడేసే బస్సు కుదుపుల్లో మేం ఇంత శ్రమపడి ప్రయాణించింది కేవలం నదీమతల్లిమీది భక్తితోనే. దీనివల్ల మేం పొందింది కంటికి కనబడేది కాదు. ఇతరుల అనుభూతికి అందేది కాదు. ప్రతీ మతం తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి కారణం అది తప్పక ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తుందనే. ఎందుకంటే, తీర్థయాత్ర ఓ సుకర్మ అని శాస్త్రం చెబుతున్నది.
(ముగిసింది)

308
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles