వైద్యవృత్తిని వదిలి డిజైనింగ్ రంగంలో దూసుకెళ్తున్న ఆంచల్ మఖీజ


Mon,December 2, 2019 01:06 AM

ప్రతి ఒక్కరికీ కొన్ని అభిరుచులుంటాయి. కానీ తమ అభిరుచులను కాదనుకుని, కుటుంబ గౌరవం కోసమో, తల్లిదండ్రుల కోరిక మేరకో తమ కెరీర్లతో కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడో మిగిలిన అసంతృప్తితో జీవితాన్ని నెట్టుకువస్తుంటారు కొందరు.ఆ కొందరిలా మిగలొద్దనేదే ఆంచల్ పట్టుదల. వృత్తిరీత్యా ఆమె ఒక డెంటిస్ట్. డెంటల్ సర్జన్‌గా మంచి జీవితం ఉన్నప్పటికీ దాన్ని వద్దనుకుని వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిందామె. ది పెహ్నవా పేరుతో
ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించి కోరుకున్నవారికి కోరుకు న్నట్లు దుస్తులు డిజైన్ చేసి ఇస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఆంచల్ మఖీజ సక్సెస్‌మంత్ర.

Makhiza
ఆంచల్ ఢిల్లీలోని మనవ్చ్రనా మెడికల్ కాలేజీలోఎంతో వ్యయప్రయాసల కోర్చి డెంటల్ కోర్సు పూర్తి చేసింది. డెంటిస్ట్‌గా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి మనసును ఆవహించింది. ఏంటది..? తనను తాను ప్రశ్నించుకుంది. కొన్నాళ్లకి సమాధానం దొరికింది. వెంటనే డెంటిస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. తనకెంతో ఇష్టమైన కాస్ట్యూమ్ డిజైనింగ్, వ్యాపారం వైపు అడుగులు వేసింది. అలాగని అదంత సులభంగా జరుగలేదు. సీనియర్ మెడికల్ అధికారిగా పనిచేస్తూ పెద్ద మొత్తంలో జీతం అందుకుంటున్న సమయంలో తన నిర్ణయాన్ని వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో కొంతకాలం డెంటిస్ట్‌గానే కొనసాగింది. కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభించడంతో తల్లిదండ్రులు ఒప్పుకోవలసి వచ్చింది.


మధ్యతరగతి వారికోసం...

వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకోవడం సులభంగానే సాగింది. కానీ, చదువుకు, చేయాలనుకున్న పనికి ఏమాత్రం పొంతనలేదు. అందుకే ఆ వ్యాపారంలో అవగాహన పెంచుకునేందుకుగాను ఎంబీయేలో చేరింది. ఎంబీయే చేస్తూనే సంస్థ ప్రారంభించే ఏర్పాట్లు చేసుకుంది.అంతేకాదు ఆడవారికి పెద్ద డిజైనర్లు డిజైన్ చేసిన వస్ర్తాలే సామాన్యంగా నచ్చవు. ఎంత బాగున్నా. ఇంకా ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటారు. అందుకే వారి ఆలోచన మేరకే డిజైన్ చేసి ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించే దుస్తులకు ఏమాత్రం తగ్గకుండా, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేవిధంగా దుస్తులు డిజైన్ చేసి అమ్మాలని నిర్ణయించుకుంది. అలా పెహ్నహకు ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడింది.

ఆటంకాలను అధిగమించి

Makhiza1
ఒక ఈ కామర్స్ పోర్టల్ ద్వారా వ్యాపారం ప్రారంభించాలని అంతా సెట్ చేసుకుంది ఆంచల్. ఒక ఐటీ కంపెనీని కూడా సంప్రదించింది. వారికి వెబ్‌సైట్ రూపొందించే పనిని అప్పగించింది. కానీ ఇంతలోనే మోసం జరిగిపోయింది. తను ఎంతో ఇన్వెస్ట్ చేసి రూపుదిద్దాలనుకున్న వెబ్‌సైట్ తయారుచేస్తున్న కంపెనీ ఫ్రాడ్ అని తేలింది. ఇది నిజంగా ఒక షాక్. అయినా భయపడలేదు. చాలెంజింగ్‌గా తీసుకొంది. ఐటీ రంగంతో సంబంధం లేకపోయినా ఒక టీంను ఏర్పాటు చేసుకొంది. పెహ్నవా వెబ్ పోర్టల్ ఈ కామర్స్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. నెమ్మదిగా సేల్స్ పెరిగాయి. ఆర్డర్లు పెరుగుతూ పోయాయి. 2015లో ది పెహ్నవా డాట్ కామ్ ప్రారంభమైంది. దీనికి ఆమె సోదరుడు అంకిత్ మఖీజ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్వవహరిస్తున్నాడు.

ఆన్‌లైన్‌ను ప్రారంభించి..

అప్పుడే ఈ కామర్స్ రంగం వేళ్లూనుకుంటుంది. అప్పుడప్పుడే ఈ కామర్స్ సైట్లు ప్రారంభమవుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బిజినెస్‌లో దూసుకెళ్లాలని ఆంచల్ నిర్ణయించుకుంది. దానిలోని మంచి చెడులను అంచనా వేసుకుని వెంటనే పెహ్నవా పేరిట ఈ కామర్స్ ప్లాట్ ఫాం తయారు చేసింది. సంప్రదాయ డిజైన్లకు పెట్టింది పేరుగా తన స్టార్టప్‌ను తీర్చిదిద్దాలనుకుంది. అంతేకాదు డిజైనర్ వేర్ అనే కాన్సెప్ట్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రతీ ఒక్కరూ మనీష్ మల్హోత్రా లాంటి టాప్ డిజైనర్లతో దుస్తులు డిజైన్ చేయించలేరు. మరి అలాంటి వారికోసం తక్కువ ఖర్చుతో కొత్త డిజైనర్లు చేసిన దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు మార్కెట్‌కు సంబంధించిన మెళకువలను అందిపుచ్చుకునే పనిలో పడింది.

అమ్మకాలు పెరిగాయి

కస్టమర్ ఫ్రెండ్లీగా పెహ్నవాను తీర్చిదిద్దడంలో ఆంచల్ సఫలం అయ్యింది. తమ డిజైన్లు ఏ రంగులో ఉండాలి? దానిపై ఎలాంటి డిజైన్లు ఉండాలి? అని కస్టమర్లు కోరిన డిజైన్లను అందుబాటులో ఉంచింది. వినూత్నమైన ఆఫర్లతో పెహ్నవా దూసుకొచ్చింది. పెద్ద ఆన్‌లైన్ పోర్టల్స్ బిగ్ బిలియన్ సేల్ లాంటివి ఆఫర్లు ప్రకటించినప్పటికీ. పెహ్నవా ఎక్స్‌క్లూజివ్ డిజైన్లతో కస్టమర్లను ఆకర్షించి సేల్స్ గ్రాఫ్ పడనివ్వలేదు. అమ్మకాలు పెరిగే కొద్దీ సైట్ ట్రాఫిక్‌ను మరింత పెంచేలా సర్వర్ సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పటి వరకూ పెహ్నవా సైట్ నుంచి 20 వేల మందికి పైగా కొనుగోళ్లు జరుగగా, ఏటా లక్షన్నర డాలర్ల రెవెన్యూను ఆర్జించింది. వినియోగదారులు కోరుకున్న విధంగా దుస్తులు రూపొందించి వాటిని డోర్ డెలివరీ చేయడం పెహ్నవా ప్రత్యేకత.

అభరణాల తయారీ రంగంలోకి..

thepehnavaaanchal
కోటి రూపాయాల టర్నోవర్ దాటిన ఆంచల్ ప్రస్తుతం తన తోటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు వారికి శిక్షణ ఇచ్చి మరీ పనిలో పెట్టుకొని సామాజిక బాధ్యతను తలకెత్తుకుంది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మహిళలకు ఆత్మరక్షణపై పలు కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ అవగాహనా సదస్సులు, ఆత్మరక్షణ పరికరాలు అందజేసింది. అంతేకాదు ఆంచల్ జువెల్లరీ, ఇతర ఆభరణాల వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది.

విజయ రహస్యం

నిజానికి ఆంచల్ తీసుకున్న నిర్ణయం కుటుంబానికి నచ్చలేదు. ప్రోత్సాహం పెద్దగా లభించలేదు. కానీ విజయమే అతిపెద్ద ప్రోత్సాహం ఇస్తుందని ఆంచల్ భావించింది. అనుకున్నట్టే కష్టపడింది. ఆంచల్‌కు ఎదురు దెబ్బలు తగిలినా, ఆమె తీసుకున్న నిర్ణయం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా, తండ్రి మాత్రం తనవైపే నిల్చున్నాడు. కూతురు ఇష్టాయిష్టాలను కాదనలేదు.

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles