
వారు సమాజాన్నే కుటుంబంగా భావించారు. ప్రజలందరినీ తమ బంధువులనుకున్నారు. సమాజంలోని వివిధ రకాల సమస్యలను సోదరభావంతో పరిష్కరిస్తున్నారు. ఆ భావనతోనే మరింతమందిని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్లు. అనేక కార్యక్రమాలతో ప్రజల్లో వారు చైతన్యం తీసుకువస్తున్నారు.
కోల్‌కతాకు చెందిన ‘సొరొప్టమిస్ట్ ఇంటర్నేషనల్ ఆఫ్ కోలకతా’ (ఎస్ఐసి) అనే స్వచ్ఛంద సంస్థ సమాజానికి సోదరభావంతో సేవలందించేందుకు శ్రీకారం చుట్టింది. పశ్చిమబెంగాల్లోని అనేక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, వైద్యులు, వ్యాపార వేత్తలంతా ఒకే వేదికపైకి వచ్చి అవసరమైనవారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ‘సోదరభావంతో పలుకరిస్తే ఆ ఆత్మీయత మనసుకు హత్తుకుంటుంది. అందుకే సమాజంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలను ఆ భావనతోనే కదిలించాలని, అలాంటప్పుడే వారి బాధను పూర్తిగా మనతో పంచుకోగలుగుతారని’ ఎస్ఐసి ప్రెసిడెంట్ ఉత్తరదాసగుప్త చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రజల పట్ల సోదరభావం చూపిస్తూ వారి బాధలను తీరుస్తున్నామని ఆమె అంటున్నది. అనేక వృత్తుల్లో నిపుణులైన వారందరూ ఓ బృందంగా ఏర్పడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్నారు. 69 ఏండ్ల ఉత్తరదాసగుప్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. బ్యాంకు మేనేజర్‌గా ఆమెకున్న పరిచయాలతో ఎంతోమంది మహిళలకు రుణాలిప్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నది. గృహిణులకు ఉపాధి కల్పించడమేకాకుండా విద్యా, వైద్యం అందించే పలు కార్యక్రమాలనూ అమలు చేస్తున్నారు. 12 సర్కారు బడుల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలామంది ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. మరికొంతమంది పిల్లలు చదువు మానేశారు. అటువంటి పాఠశాలలకు మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నదో తెలుసుకోవడానికి కొంతమంది ఎస్ఐసి వలంటీర్లు పనిచేస్తుంటారు. వీరు అందించిన సమాచారాన్ని బట్టి వారికి అవసరమైన సాయాన్ని అందిస్తుంటారు.