దేశముదురు సినిమాతో తొలి అడుగులోనే కుర్రకారు గుండెల్లో గోలపెట్టింది హన్సిక. పిల్లందం కేక కేక అంటూ పాటలు పాడుకునేలా చేసింది. కథానాయికగా అరంగేట్రం చేసి దశాబ్ద కాలం దాటినా తన అందచందాలతో ప్రేక్షకుల్ని మైమరపిస్తూనే ఉన్నది. దక్షిణాది చిత్రసీమలో యాభై సినిమాల మైలురాయిని పూర్తిచేసుకున్నా ఆమె ఇప్పుడే తన అసలైన ప్రయాణం ఆరంభమైందని ద్విగుణీకృత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది. భవిష్యత్తు గురించి భయపడనని, వర్తమానంలోనే జీవిస్తానని తాత్వికధోరణిలో సమాధానమిస్తున్న హన్సిక అంతరంగమిది...

సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
1998లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. పదహారేళ్ల వయసులో కథానాయికగా మారాను. కష్టసుఖాల కలబోతగా నా ప్రయాణం సాగింది. ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా గడచిన రోజులున్నాయి. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగిన క్షణాలున్నాయి. రోలర్కోస్టర్రైడ్గా గడిచిపోయింది. తొలినాళ్లతో పోలిస్తే నటిగా, వ్యక్తిగతంగా నాలో ఎంతో పరిణితి వచ్చింది. ఆలోచనా ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి.
నటిగా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని అనుకుంటున్నారా?
ఇదే నా గమ్యం అంటూ నిర్దేశించుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టకూడదు. ఏ రంగంలోని వారైనా తమ లక్ష్యాన్ని చేరుకున్నామని రిలాక్స్ అయితే ఆ రోజుతో వారి కెరీర్ ముగిసిపోయినట్లే. అందుకు నేను అతీతమేమీ కాదు. ఇప్పుడిప్పుడే నా సినీకెరీర్‌ను ఆరంభించిన భావన కలుగుతున్నది. భవిష్యత్తులో నేను చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. అంగీకరించాల్సిన సినిమాలు, పోషించాల్సిన పాత్రలు ఎన్నో మిగిలిపోయాయి. నటిగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకోవాలి.
సినిమాలకు దూరంగా వెళ్లిపోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
అలాంటి ఆలోచన నా మనసులోకి ఎప్పుడూ రాదు. రానివ్వను. సినిమాలు, నటనను బోర్‌గా ఫీలయ్యే క్షణాలు నటీనటుల జీవితాల్లో ఉండవు. నా దృష్టిలో మిగతా రంగాలతో పోలిస్తే నటననే అన్నింటికంటే ఉత్తమమైంది. ప్రతి సినిమాతో కొత్త వ్యక్తులు, ప్రదేశాలు, సాంకేతిక అంశాలతో పరిచయం ఏర్పడుతుంది. మనదికాని వ్యక్తిత్వమున్న ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయే అవకాశం దొరుకుతుంది. సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్న రోజున సమయం గడవదు. అదే సెట్స్‌లో ఉంటే టైమ్ తెలియదు.
సినిమాలు,ప్రచార కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటారు. ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మీరు ఎంచుకునే మార్గమేమిటి?
పెయింటింగ్స్ ద్వారా అలసట నుంచి దూరమవుతాను. ఇప్పటివరకు చాలా పెయింటింగ్స్ వేశాను. వాటన్నింటితో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నది నా కోరిక. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదు. వచ్చే ఏడాదైనా ఆ కల నెరవేరుతుందనే నమ్మకం ఉంది. అలాగే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే ధన్‌తెరాస్ పండగ సందర్భంగా అమ్మ నుంచి ఓ విలువైన కారును బహుమతిగా అందుకున్నాను.
వేగాన్ని తగ్గించారు ఎందుకలా?
చేసిన పాత్ర మళ్లీ చేయడం అంటే నాకు బోర్ కొట్టడమే కాకుండా ప్రేక్షకులు అలాంటి వాటిని స్వీకరించడానికి ఇష్టపడరు. నవ్యత, విలక్షణత ఉన్న పాత్రల వల్లే మనలోని నటనాప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుంది. నటనకు ఆస్కారం ఉన్న అలాంటి సినిమాలు ఏడాదికి ఒకటి రెండు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో ఇదే పంథాను అనుసరిస్తాను.
చాలామంది కథానాయికలు నటనతోపాటు చిత్రనిర్మాణం, వ్యాపార రంగాల్లో ప్రవేశించి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. మీకు అలాంటి ఆలోచన ఉందా?
ప్రస్తుతం నటిగా నా ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
గత ఏడాది కాలంగా తెలుగులో సినిమాల్ని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి?
కథ, నా పాత్ర తీరుతెన్నులు నచ్చక కొన్ని సినిమాల్ని వదులుకున్నాను. కానీ అవేమిటో మాత్రం చెప్పను. వాటిని రహస్యంగానే ఉంచడం మంచిది.
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంటారు?
సోషల్‌మీడియాకు అడిక్ట్ను నేను. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటాను. సినిమాలతోపాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటుంటాను.
సామాజిక మాధ్యమాల్లో మీపై వచ్చే విమర్శల్ని ఎలా తీసుకుంటారు?
సోషల్‌మీడియాలో భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తుంటారు. అందరికీ సమాధానం చెప్పాలంటే కుదరదు. అందుకే వాటిని చదివి వదిలేస్తాను. విమర్శల్ని పట్టించుకోను.
ఇటీవలి కాలంలో మీరు నటించిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ వైఫల్యాల నుంచి ఎలా బయటపడగలిగారు?
ఒకటి రెండు సినిమాలు పరాజయం పాలైతే కెరీర్ ముగిసిపోయినట్లుకాదు. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. నా వరకైతే సక్సెస్ఫెయిల్యూర్స్ను సమంగానే స్వీకరిస్తాను. సంతోషం, బాధ రెండింటినీ నాలోనే దాచుకుంటాను. వాటిని బయటకు వ్యక్తపరచడం తక్కువే. పరాజయాల్ని కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం సరికాదన్నది నా అభిమతం. నాయకానాయికల వల్లే సినిమా ఆడలేదనే మాటల్ని నేను విశ్వసించను. నేను నటించిన సినిమా సరైన ఫలితం అందుకోకపోతే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా తదుపరి చిత్రాలపై దృష్టిసారిస్తూ ఆ బాధను మరచిపోయే ప్రయత్నం చేస్తాను.

విలన్ పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారా?
కామెడీ, ప్రతినాయిక ఛాయలున్న పాత్రలకు తెరపై న్యాయం చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు చేయడం నాకూ ఇష్టమే. మలయాళ చిత్రం విలన్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను.
వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సినిమాల్ని చూడటానికి ఇష్టపడతారు?
పాత సినిమాల్ని బాగా చూస్తుంటాను. హేరాఫేరీ, అందాజ్ ఆప్నా ఆప్నా నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్. స్వతహగా కామెడీ నా ఫేవరేట్ జోనర్. వినోదత్మాక సినిమాల్ని చూడటం, నటించడం రెండింటిని ఎంజాయ్ చేస్తాను.
50 సినిమాల ప్రయాణం ఎలా ఉంది?
ఇదివరకటితో పోలిస్తే మరింత స్ట్రాంగ్‌గా మారిపోయాను. యాభై చిత్రాల తర్వాతేఅసలైన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనుభూతి కలుగుతున్నది. దర్శకనిర్మాతలు మంచి పాత్రల్ని సృష్టించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. ఫలానా తరహా సినిమాలు మాత్రమే చేయాలనే పరిమితులేవి విధించుకోలేదు. నాకు వస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగా ఉన్నాను
సినీ ప్రయాణంలో ఎదురైన అవరోధాలు ఎప్పుడైనా గుర్తొస్తుంటాయా?
కష్టాలు లేకుండా ఉన్నత శిఖరాల్ని అధిరోహించేవారుండరు. కెరీర్లో నేను ఎన్నో సినీ కష్టాల్ని ఎదుర్కొన్నాను. వాటిని ఆత్మైస్థెర్యంతో దాటుకుంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆ కష్టాల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను.
అమ్మ మీకు స్ఫూర్తి అని చాలా వేడుకల్లో చెప్పారు. ఆమెతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
నా జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని అమ్మతో పంచుకుంటాను. నేను చేయబోయే సినిమాలు, కథల విషయంలో తన అభిప్రాయం తీసుకుంటాను. అవసరమైతేనే తాను సలహాలు ఇస్తుంది.
మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నారు. వాటి నుంచి ఎలా బయటపడగలిగారు?వాటిపై మీరేమంటారు?
నా జీవితంలో జరిగిన సంఘటనల పట్ల ఎవరినీ నిందించడం లేదు. అవన్నీ నాకో అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను.
సినిమాలు తప్ప ఇతర వేడుకల్లో ఎక్కువగా కనిపించరెందుకని?
పార్టీలపై నాకు అంతగా ఆసక్తి ఉండదు. షూటింగ్ లేకపోతే ఇల్లు దాటి బయట అడుగుపెట్టను. పుట్టినరోజు, దీపావళి పార్టీలు తప్పితే మిగతా పార్టీలకు పెద్దగా ప్రాధాన్యమివ్వను. కుటుంబం, స్నేహితులు ఇవే నా ప్రపంచం.
తెలుగు ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్‌ఫ్రెండ్స్?
అందరూ స్నేహితులే. ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు.
కెరీర్ పట్ల అనిశ్చితితో ఉన్న సందర్భాలున్నాయా?
భవిష్యత్తును తల్చుకొని భయపడను. వర్తమానంలోనే జీవించడానికి ఇష్టపడతాను. నెగెటివిటీ నా దగ్గరకు రాకుండా జాగ్రత్తపడతాను. ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తాను. ఇదే నేను నమ్మే సిద్ధాంతం.
యాపిల్బ్యూటీ, ఫ్రూటీ ఇలా అభిమానులు మిమ్మల్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆ ముద్రల పట్ల మీ అభిప్రాయమేమిటి?
దేశముదురు సమయంలోనే యాపిల్వైట్బ్యూటీ అంటూ పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ పేరు అలాగే కొనసాగుతున్నది. ఆ ట్యాగ్‌లను నేను ఎంజాయ్ చేశాను. అదే కాదు ఫ్రూటీ, తమిళంలో మిల్కీబ్యూటీ డార్లింగ్ డంబక్డా అంటూ అభిమానులు నన్ను పేర్కొంటుంటారు. అలా పిలువడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవు.
-నరేష్ నెల్కి
-సిఎం. ప్రవీణ్