టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్లీ మొదలైంది, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఢమరుకం వంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో హాస్యకథా చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేక పంథాను సృష్టించుకున్నారు శ్రీనివాస్‌రెడ్డి. ఆయన తొలిసారి తన శైలికి భిన్నంగా థ్రిల్లర్ ఇతివృత్తంతో రాగల 24 గంటల్లో చిత్రాన్ని రూపొందించారు. ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

తొలిసారి థ్రిల్లర్ జోనర్లో సినిమా తీశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. సినిమా మొదలైన ఐదు నిమిషాల నుంచే ఉత్కంఠభరితంగా కథాగమనం సాగుతుంది. శ్రీనివాస్‌వర్మ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో వెంటనే సినిమా చేద్దామనుకున్నా. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ పంచే విధంగా సినిమా ఉంటుంది.
టైటిల్ వాతావరణ సమాచారాన్ని సూచించేలా అనిపిస్తున్నది..?
రాగల 24 గంటల్లో అనే మాటను తరచూ వాతావరణ వార్తల్లో ఉపయోగిస్తుంటారు. ఈ సినిమా కథ ఆరంభం కూడా భారీ వర్షం, భీభత్సమైన గాలిదుమారం నేపథ్యంలో ఉంటుంది. అప్పుడే ఓ హత్యకు సంబంధించిన వార్త వినడం..ఈ క్రమంలో సాగే పోలీస్ పరిశోధన ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగానే టైటిల్‌ను పెట్టాం.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
దర్శకుడిగా నేను తొలిసారి చేస్తున్న థ్రిల్లర్ ఇది. సినిమా అంతా ఏడెనిమిది పాత్రల చుట్టూ నడుస్తుంది. 24గంటల వ్యవధిలో పూర్తవుతుంది. ఈ క్రమంలో నడిచే డ్రామా, సస్పెన్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. హీరోయిన్ ప్రధానంగా సాగే కథ కావడం కూడా మరో ఆకర్షణగా నిలుస్తుంది. ఈషారెబ్బా నయనతార స్థాయిలో అభినయాన్ని కనబర్చింది. శ్రీరామ్, సత్యదేవ్ పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయి.
మీరు కామెడీ చిత్రాల స్పెషలిస్ట్. ఇందులో వినోదాత్మక అంశాలు ఏమైనా ఉంటాయా?
ఈ సినిమాలో వినోదం, ఫ్యామిలీ అంశాలేమీ ఉండవు. నా శైలి హాస్యం ఎక్కడా కనిపించదు. రెండుగంటల పాటు అనుక్షణం ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగిస్తూ కథ, కథనాలు సాగుతాయి.
హాస్యచిత్రాలు రూపొందించే మీకు..థ్రిల్లర్ జోనర్లో సినిమా చేయడం కష్టమనిపించలేదా?
నా దృష్టిలో దర్శకుడంటే ప్రతి జోనర్‌ను టచ్ చేయగలిగాలి. ఏ రకమైన ఇతివృత్తాన్నైనా దృశ్యమానం చేయగలగాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో థ్రిల్లర్ జోనర్ ట్రెండ్ నడుస్తున్నది. ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాల్ని ఆదరిస్తున్నారు. దర్శకుడిగా నాకు థ్రిల్లర్ జోనర్‌ను డీల్ చేయడం ఏమాత్రం కష్టమనిపించలేదు. స్క్రిప్ట్ మొదలుకొని చిత్రీకరణ వరకు ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. దర్శకుడిగా నాలోని కొత్తకోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.
సంగీతపరంగా ఈ సినిమాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో సంగీతానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. అయితే ఈ సినిమాలో కథానుగుణంగా మూడు పాటలు చక్కగా కుదిరాయి. రఘు కుంచె అద్భుతమైన స్వరాల్ని అందించారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. కథలోని భావోద్వేగాల్ని నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది.
ఈ సినిమా ద్వారా కృష్ణభగవాన్‌ను రచయితగా పరిచయం చేస్తున్నారు..?
కృష్ణభగవాన్‌తో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. స్వతహాగా ఆయన మంచి రచయిత. ఈ సినిమాలో అద్భుతమైన సంభాషణలు రాశారు. ఆయన మాటలు హత్తుకునేలా ఉంటాయి.
తదుపరి సినిమా గురించి?
ఢమరుకం తరహా కథాంశంతో ఓ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. పెద్దహీరోతో ఈ సినిమా చేయాలనుకుంటున్నా. ఆ తర్వాత రాగల 24 గంటల్లో నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించే రెండు వినోదాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నాను.
ఢమరుకం తర్వాత సినిమాలకు చాలా విరామం తీసుకున్నారెందుకని?
ఢమరుకం తర్వాత హలోబ్రదర్ రీమేక్ చేద్దామకున్నాం. స్క్రిప్ట్ అంతా సిద్ధమైంది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత నాగచైతన్య కథానాయకుడిగా దుర్గ పేరుతో ఓ సినిమా అనుకున్నాం. అది కూడా కార్యరూపం దాల్చలేదు. దాంతో దర్శకుడిగా రెండేళ్లు విరామం తీసుకున్నా. మామ మంచు అల్లుడు కంచు సినిమా తీశాను. తిరిగి రెండేళ్ల విరామం అనంతరం రాగల 24గంటల్లో సినిమాతో మీ ముందుకొస్తున్నా.
- సినిమా డెస్క్