జిమ్నాస్ట్ కోచ్ పిలుస్తున్నది


Sat,November 9, 2019 01:17 AM

పెద్దయ్యాక ఏం చేస్తారు? అడిగింది టీచర్ డాక్టర్ అవుతా అన్నాడో విద్యార్థి ఇంజినీర్ అన్నాడు ఇంకో పిల్లాడు నేను స్పోర్ట్స్ ఆడుతా అన్నది ఓ విద్యార్థి లేచి.. టీచర్‌కు అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. అవును.. చదువుకుంటూ, ఆటలాడుతా,
పెద్ద చాంపియన్ అవుతా అన్నది ఆ విద్యార్థిని. టీచర్ చప్పట్లు కొట్టింది. ఆమెతో పాటు పిల్లలు కూడా. ఇట్లాంటి ఆలోచనలతో క్రీడల్లో రాణించాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం, వారి తల్లిదండ్రుల కోసం క్వీన్ మేకర్ అవుతున్నది హైదరాబాద్‌కు
చెందిన అలికాజో..

alika-jo
ఆడపిల్లలను చదవనిద్దాం.. ఎదగనిద్దాం అనేది తరచూ వింటున్న మాటలే కావొచ్చు. వాళ్లకు అవకాశాలిస్తే ఆకాశానికి ఎగురుతారు అనేది ప్రతిసారి నిరూపితం అవుతున్న నిజం. కానీ అవకాశాలే లేని ఆడపిల్లల సంగతేంటి? కనీసం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనేందుకు కూడా అవగాహన లేని వారి పరిస్థితేంటి? ఎలాంటి ప్రోత్సాహం లేని అమ్మాయి మాటేమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్ని ఎదురైనా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మహిళల ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి వారిలోనే అలికా జో ఒకరు. అమ్మాయిలకు మాత్రమే ఉండే రిథమిక్ జిమ్నాస్టిక్ క్రీడలో తనదైన గుర్తింపు పొందుతున్నది. చాంపియన్‌గా ఎదిగింది. తనలాంటి అమ్మాయిలకు జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా అకాడమీనే స్థాపించింది.


మూడేండ్ల వయస్సులో ఆమె పాఠశాలకు వెళ్లక ముందే జిమ్నాస్టిక్ శిక్షణా తరగతుల్లోకి వెళ్లింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆమెను ఆటలవైపు తీసుకెళ్లారు. జిమ్నాస్టిక్స్ అనేది అరుదైన క్రీడ. మానసిక, శారీరక బలాలు అవసరం. ఇందులో బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, అందం అన్నీ ముఖ్యమే. ఇలాంటి క్రీడల్లో దక్షిణ భారత దేశంలోంచి క్రీడాకారిణులు తక్కువే. అలాంటి మనరాష్ట్రం తరఫున జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద అలికాజో 150కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. జిమ్నాస్టిక్స్‌లో చేరింది మూడేండ్లప్పుడు అయినా ఆమె మొదటిసారి పతకాన్ని గెలిచింది 12 ఏండ్లప్పుడు. అందుకే ఈ జిమ్నాస్టిక్స్‌లో రాణించాలంటే ఓర్పు కూడా అవసరం అని చెప్తుందామె.

చిన్నప్పటి నుంచే అలికా జిమ్మ్నాస్టిక్స్ క్రీడాకారిణి. బడికి వెళ్తూనే రోజూ నాలుగు గంటలకు పైగా సాధన చేసేది. సెలవులు దొరికినప్పుడల్లా రష్యాకు వెళ్లి అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకునేది. 2016 రియో ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్ మార్గరీటా మామో దగ్గర అలికాజో శిక్షణ తీసుకునేది. ఇంటికి వచ్చి సాధన చేసేది. ఆ ప్రాక్టీస్ వీడియోలను కోచ్‌లకు పంపించి తప్పులను సరిదిద్దుకునేది. ఇటు చదువు, అటు జిమ్మాస్టిక్స్‌ను సమతుల్యం చేసుకునేది. జిమ్నాస్టిక్స్ అంటేనే బ్యాలెన్సింగ్ కాబట్టి జీవితాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం సమస్యగా అనిపించలేదు అని చెప్తున్నది.

పేద కుటుంబం నుంచి వెళ్లిన క్రీడాకారులు జాతీయ స్థాయి అకాడమీల్లో అవమానాలు ఎదుర్కొంటారు. అందరూ సరైన కిట్లతో, దుస్తులతో, షూలతో గ్రౌండ్‌లోకి వస్తే మన వాళ్లు మాత్రం చెప్పులతో, పాతదుస్తులతో గ్రౌండ్‌లోకి వస్తారు. వాళ్లను చూసి నార్త్ ఇండియా వాళ్లు నవ్వుకుంటారు ఇలాంటిది సినిమాల్లో చూస్తుంటాం.

alika-jo3
మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది అలికా. ఆ కాలేజీలో ఉన్నప్పుడు స్టార్ షట్లర్ పీవీ సింధూ అలికాజోకు సీనియర్. దీంతో స్పోర్ట్స్‌లో ఉండే పరిస్థితులను, అవగాహనను గురించి సింధూ సలహాలు తీసుకునేది. అదే కాలేజీలో ఎంకామ్ వరకూ చదివింది. కాలేజీ చదువుతున్న సమయంలో చైనా మార్షల్ ఆర్ట్స్ ఉషూ అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో అలికా పాల్గొంది. 2015లో జమ్నాస్టిక్స్ నుంచి రిటైర్డ్ అయింది. కానీ ఆ క్రీడలో ఆమె ప్రస్థానం ఆపాలనుకోలేదు. తనకంటే ప్రతిభావంతులైన జిమ్నాస్టిక్ ప్లేయర్లను తయారు చేయాలనుకున్నది. తల్లిదండ్రుల సాయంతో మణికొండలో జోయ్స్ జిమ్నాస్టిక్ అకాడెమీ ప్రారంభించింది. పిల్లలకు జిమ్నాస్టిక్‌లో తర్ఫీదు ఇస్తున్నది.

అకాడమీ ప్రారంభమై మూడునెలలు అవుతున్నది. పిల్లల్లో క్రీడల్లో నైపుణ్యం పెంచడానికి తల్లిదండ్రులు ఈ అకాడమీని ఉపయోగించుకుంటున్నారు. మూన్నెళ్ల నుంచి అలికా దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో జిల్లా, సౌత్ ఇండియా చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురు పతకాలు సాధించారు. వారిలో ఒకరికి మూడేండ్ల వయసు, మరో ఇద్దరికి ఏడేండ్లు . ఇటీవల ఖమ్మంలో జరిగిన సౌత్ నేషనల్స్‌లో ఓ పన్నెండేండ్ల అమ్మాయి రజత పతకం సాధించింది. రానున్న కాలంలో మరిన్ని రికార్డులను సాధించాలని చెప్తున్నది. అందుకు అవసరమైన కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నది.

సినిమాల్లోనే కాదు..

తెలుగు క్రీడాకారులన్నా, దక్షిణ భారత క్రీడాకారులన్నా చాలా అకాడమీల్లో, పోటీ ప్రాంతాల్లో చిన్నచూపు ఉంటుంది. పేద కుటుంబం నుంచి వెళ్లిన క్రీడాకారులు జాతీయ స్థాయి అకాడమీల్లో అవమానాలు ఎదుర్కొంటారు. అందరూ సరైన కిట్లతో, దుస్తులతో, షూలతో గ్రౌండ్‌లోకి వస్తే మన వాళ్లు మాత్రం చెప్పులతో, పాతదుస్తులతో గ్రౌండ్‌లోకి వస్తారు. వాళ్లను చూసి నార్త్ ఇండియా వాళ్లు నవ్వుకుంటారు ఇలాంటిది సినిమాల్లో చూస్తుంటాం. కానీ వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయని అలికాజో చెప్తున్నది. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్‌లో దక్షిణ భారతదేశం నుంచి కోచ్‌ల సంఖ్య చాలా తక్కువ. ఈ కారణంగా జిమ్నాస్టిక్స్ క్రీడాకారులూ తక్కువే. ఉన్న కొద్దో గొప్పే ప్లేయర్లు ప్రతిభ కనబర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. వీళ్లలో చాలామందికి కోచ్‌లు ఉండరు, సదుపాయాలు ఉండవు.

సాధించాలనే ఆత్మవిశ్వాసంతోనే సొంతనైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆమె చెప్పింది. అందుకే భవిష్యత్‌లో ఈ పరిస్థితులను మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే జోయ్స్ అకాడమీలో పిల్లలకు జిమ్నాస్టిక్ శిక్షణ ఇస్తున్నది. ఎప్పటికైనా తెలంగాణ నుంచి జిమ్నాస్టిక్స్‌లో పతకాలు సాధించే ప్లేయర్లను తయారు చేయాలని తపన పడుతున్నది. ముఖ్యంగా అమ్మాయిలను క్రీడల్లో రాణులను తయారు చేయాలన్నదే ఆశయం అని చెప్తున్నది. అలికాజో తల్లిదండ్రులది కేరళ అయినా ఆమె పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అందుకే జిమ్నాస్టిక్స్‌లో తన గుర్తింపును అంతా తెలంగాణకు అంకితమిచ్చింది. 25 ఇంటర్నేషన్ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ తరఫున స్వర్ణాలు తెచ్చింది. ఇప్పుడు తెలంగాణలో జిమ్నాస్టిక్ ప్లేయర్లకు శిక్షణ ఇస్తుంది. జిమ్నాస్టిక్స్‌లో అమ్మాయిలను క్వీన్‌లుగా తయారు చేసి దేశానికి అందించే క్వీన్ మేకర్‌గా అలికాజో కావాలని కోరుకుందాం.

-వినోద్ మామిడాల
alika-jo1
alika-jo2

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles