అగ్రరాజ్యంలో మన మున్నీ


Sat,November 9, 2019 01:11 AM

ఎవరైనా వ్యక్తులు గొప్ప విజయాలు సాధించినప్పుడు.. వారి విజయరహస్యాలతో పాటు.. మూలాలు వెతుకుతుంటారు. ఆ మూలాలు మనకు అతిదగ్గరగా ఉండి.. ఆ మూలమే మన జన్మస్థలమైతే.. అతను మనోడే అని కాలర్ ఎగరేసి
చెప్పుకుంటాం. అలాంటి సందర్భమే ఇది. అగ్రరాజ్యం అమెరికాలో మన హైదరాబాద్‌కు చెందిన ఘజాలా హష్మీ(మున్నీ) ఓ రాష్ర్టానికే సెనేటర్‌గా చరిత్ర లిఖించేలా ఎన్నికకావడం మనకూ గర్వకారణమే. ఆమెకు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం ఏమిటో తెలుసా?

ghazala-hashmi-family
వర్జీనియా డిస్ట్రిక్-10 సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, భారత సంతతికి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు మన మున్నీ. ఈమె గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నది. హైదరాబాద్‌తో మున్నీ (ఘజాల హష్మీ)కి ఎంతో అనుబంధం ఉన్నది. ఉన్నతవిద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన మున్నీకి చిన్ననాటి నుంచే సమాజానికి సేవ చేయాలని ఉండేది. ఆమె తాతలిద్దరూ ఉన్నతచదువులు చదివిన వారే. 1964లో జులై 5న హైదరాబాద్‌లో తన్వీర్, జియాహష్మీ దంపతులకు జన్మించారు. ఆమె కుటుంబం 1969లో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళింది. ఘజాలా హష్మీ మలక్‌పేటలోని అజీజియా ఉన్నతపాఠశాలలో చుదువుకున్నారు. ఆ సమయంలో ఆమెను సహవిద్యార్థులు మున్నీ అని పిలిచేవాళ్లు. ఘజాలా చిన్నతనంలో ఎంతో చురుకుగా ఉండేది. చదువుల్లోనూ, ఆటల్లోనూ ముందుండేది. ఆమె స్నేహితులతో సన్నిహితంగా ఉండేవారు.


వర్జీనియా కామన్ వెల్త్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అజార్ రఫీక్‌ను ఘజాలా హష్మీ పెండ్లి చేసుకున్నారు. 1991లో భర్తతో కలిసి రిచమండ్‌కు మారారు. హష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె యాస్మిన్ పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. చిన్న కుమార్తె నూర్ ఇంజినీరింగ్ చదువుతున్నది. వీరిద్దరి పిల్లలను అక్కడి ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించారు. ఘజాలా తండ్రి జియా హష్మీ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. జియా తండ్రి రాజా సాహెబ్ మోహిద్దీన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో బీఏ చదివారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. తన్వీర్(ఘజాల తల్లి) తండ్రి మహమ్మద్ రౌఫ్ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. జియా హష్మీ 1954లో విద్యార్థిసంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా వెళ్లి అంతర్జాతీయ సంబంధాలు అనే అంశంపై దక్షిణ కెరొలిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. అదే యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఘజాల తల్లి తన్వీర్ హష్మీ హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చదివారు. ఇలా తల్లిదండ్రులిద్దరూ ఉన్నత చదువులు చదివినవారే.

ఐ లవ్ హైదరాబాద్..

ghazala-hashmi-family1
అక్కడ స్థిరపడిన తర్వాత మున్నీ కుటుంబం ఇప్పటి వరకు నాలుగైదుసార్లు మాత్రమే మన హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి భాగ్యనగరంలోని పర్యాటక ప్రాంతాల్లో కుటుంబంతో సహా తిరిగేవారు. అయితే అమెకున్న బాధ్యతలరీత్యా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయేవారని చాలా సందర్భాల్లో చెప్పారు ఘజాల హష్మీ. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు.. అందరి ఇళ్లకు వెళ్లి.. వారితో సరదాగా గడిపేవారు. తాను ఎన్ని ప్రదేశాలు తిరిగినా.. హైదరాబాద్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని ఆమె అంటున్నారు.

పూర్తిగా అమెరికాలోనే స్థిరపడిన వీరి కుటుంబం.. మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తల్లిదండ్రుల వారసత్వంగా జార్జియా సదరన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఘజాల. అనంతరం అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. ఆమె అన్న సొహైల్ హష్మీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం మసాచుసెట్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఘజాల చెల్లెలు సైరా అలీఖాన్ ఫ్లోరిడాలో డాక్టర్‌గా పని చేస్తున్నది. వర్జీనియా కళాశాలతోపాటు పలు యూనివర్సిటీల్లో దాదాపు 25 ఏండ్లపాటు విద్యావేత్తగా సేవలందించారు ఘజాలా. ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీ, టీచింగ్ అండ్ లెర్నింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్( సీఈటీఎల్)లో ఫౌండింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నాణ్యమైన విద్యతో పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు రూపుమాపవచ్చని దృఢంగా నమ్మేవారు ఘజాల. త్వరితగతిన అభివృద్ధి సాధించాలన్నా, ఎటువంటి రంగంలో రాణించాలన్నా ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరేవారు. కళాశాల ప్రొఫెసర్‌గా చదువుకు పెద్దపీట వేయాలని రాజకీయనాయకులకు, ప్రభుత్వ అధికారులకు చెబుతుండేవారు హష్మీ. విద్యతోపాటు ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. లింగవివక్ష, గన్ కల్చర్‌ను వ్యతిరేకించి, వాటిపై పోరాడారు. సామాజిక సమస్యలను పరిష్కరించాలంటే రాజకీయాల్లోకి రావడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా టెన్త్ సెనేట్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరపున సెనేటర్‌గా గెలుపొందారు. రిపబ్లికన్ అభ్యర్థి, సిట్టింగ్ సెనేటర్ గ్లెన్ స్టర్టెవాంట్‌పై ఘజాల హష్మీ విజయం సాధించింది.

-పసుపులేటి వెంకటేశ్వరరావు

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles