నర్మద పరిక్రమ


Sun,November 3, 2019 12:05 AM

NARMAADAA
తీర్థయాత్ర 27


నాగా బాబాల ఆధ్యాత్మిక శిక్షణ!
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

(గత సంచిక తరువాయి)

రాత్రి భోజనంలోకి అన్నం, చపాతి, బెండకాయ కూర, పప్పు చేశారు. రాత్రి చాలాసేపు జపం చేసుకొన్నాను. నర్మద సముద్రంలో సంగమించే స్థలం కాబట్టి, ఇంకా ఎక్కువసేపు జపం చేయాలనుకొన్నాను. కాని, ప్రభు నా గురించి చెప్పినట్లు వున్నారు, మిసెస్‌ సారిక అభిజిత్‌ వచ్చి ఆసక్తిగా కొల్లూరు మూకాంబికా ఆలయంలోని నా అనుభవాన్ని అడిగి చెప్పించు కొన్నారు. ఆ తర్వాత జపం కొనసాగించి ఆలస్యంగా పడుకొన్నాను. మేం చూడలేదు కానీ, బరౌచి సమీపంలోని కబీర్‌వాడ్‌ అనే నదీ ద్వీపంలో హెక్టార్‌ వైశాల్యం గల మర్రిచెట్టు ఉన్నది.
NARMAADAA1

23 అక్టోబర్‌ 2008, గురువారం, అయిదో రోజు

ఉదయం ఐదుకు లేచాను. రోజూ నాలుగుకే నిద్ర లేచే వాళ్లం. కానీ, ఆ రోజు బస్సు ప్రయాణం కేవలం నాలుగు గంటలే కాబట్టి ఐదుకు లేవచ్చని దేశాయ్‌ క్రితం రాత్రే చెప్పారు. ఈ యాత్రలో నిత్యం నాలుగుకే లేవాలి. లేవని వాళ్లను దేశాయ్‌ వచ్చి లేపేవారు. బస్సు బయలు దేరేది ఏడు- ఏడున్నరకు అయినా సరే. ఒకటి, రెండు ఉదయాలు మాత్రమే దేశాయ్‌ ఐదు గంటలకు లేవనిచ్చారు.

మా అక్క ప్రమీలకు అమెరికానుంచి ఆమె పెద్దకూతురు వాణి యాంటీఆక్సిడెంట్‌గల డ్రైఫూట్స్‌ మిక్స్‌ను (బ్లూబెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, చెర్రీస్‌, ప్లమ్స్‌ మొదలైనవి), ఇంకా పిస్తా, బాదంపప్పు ప్యాకెట్లను కొన్నింటిని పంపించింది. వాటిలో తలొకటి నాకు యాత్రలో తినడానికి ఇచ్చింది. పరిక్రమ చేసే సాధువులకు భిక్ష దొరక్కపోతే తినడానికి ఉపయోగపడతాయి కాబట్టి, వారికి ఇవ్వాలని వాటిని నేను తెరవనే లేదు. ఎదురు బిల్డింగ్‌లో స్నానం చేసి వెళుతున్న ఇద్దరు నాగ సాధువులు కనిపించారు. వాళ్ల దగ్గరకు వెళ్లి నమస్కరించి, హిందీలో అడిగాను, ‘పరిక్రమలో ఉన్నారా?’ అని. ‘అవునంటే’, వారికి అవి ఇచ్చి, దారిలో భోజనం దొరకనప్పుడు ఉపయోగించమని చెప్పాను.

2007 మార్చిలో నేను అమెరికాలో ఉన్నప్పుడు, హ్యూస్టన్‌లోని కేటీమాల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని బ్రాస్‌పో షాపులో బ్యాటరీ అవసరం లేని టార్చిలైట్లను కొన్నింటిని సాధువుల కోసం కొన్నాను. వాటిలో కొన్ని గాయత్రిగారికి ఇచ్చి హిమాలయాల్లోని సాధువులకు ఇవ్వమని పంపాను. రెండు నా వెంట తెచ్చాను. ఒకటి ఆ నాగా సాధువులకు ఇచ్చాను. బ్యాటరీ అవసరం లేని దాన్ని అటు ఇటు కదిపితే చాలు, చార్జి అవుతుంది. వాటర్‌ ప్రూఫ్‌ కూడా. ఎక్కువ బరువుండదు. నీటిలో తేలుతుంది. అండర్‌ వాటర్‌లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. వారిని ‘మీకు నర్మదా మాత దర్శనం అయిందా?’ అని అడిగితే ‘కాలేదని’ చెప్పారు. పది నిమిషాలు వాళ్లతో ముచ్చటించాను.

నాగా బాబాలు

‘వాళ్లు నాగా బాబాలని నేను ఎలా తెలుసుకొన్నానని’ వెంకటేశ్వరరావు అడిగారు. హిమాలయాల్లో నాగా బాబాలు చాలాచోట్ల కనబడతారు. జడని తలపైన జటాజూటంలా ముడి వేసుకొంటారు. సాధారణంగా అంతా యోగా చేస్తారు కాబట్టి సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ల ప్రాంతం ముఖాలు నాకు బాగా గుర్తు. వాళ్లు ప్రత్యేక అఖాడాలకు చెందిన వారై ఉంటారు. అదిశంకరాచార్య నాగాలాండ్‌లో ప్రజలలోని నాగా బాబాలను హిందూమతానికి సైన్యంగా తీర్చిదిద్దారని ప్రతీతి. వారి దగ్గర శూలం, కత్తులుకూడా ఉంటాయి. వాళ్లకి ధైర్యం ఎక్కువ. ప్రమాదకరమైన వారు కూడా.
NARMAADAA2
అవసరం వస్తే మనిషిని చంపడానికికూడా వెనుకాడరు. కాశీలో నాగాబాబాల బృందం వస్తున్నదని తెలిస్తే చాలు, వ్యాపారులు వెంటనే తమ దుకాణాలను మూసేస్తారుట. ఎందుకంటే, వారు తమకు కావాల్సినవి తీసుకొని డబ్బు చెల్లించకుండానే వెళ్లిపోతారు. డబ్బు అడిగితే ‘పంచభూత నిర్మితమైన ఆ వస్తువులకు డబ్బు చెల్లించనక్కర్లేదని, పంచభూతాలు అందరి సొత్తని’ వాదిస్తారని విన్నాను.
2006 జనవరిలో అనుకుంటా, అర్ధకుంభమేళాకి ప్రయాగకు వెళ్లినప్పుడు నేను నాగా బాబాలకు సన్యాసదీక్ష ఇచ్చాక ఇచ్చే శిక్షణను చూశాను. ఎలాంటి పైకప్పు లేకుండా చుట్టూ కంచెగల ఓ ఓపెన్‌ ప్లేస్‌లో నాగా సాధువులను నగ్నంగా రెండు రోజులు చలిలో ఉంచారు. నాగా సాధువులు ఉండే గుడారాలన్నీ తిరిగి చూశాను.

ఎడమచేతిని గాలిలోకి లేపి ఉంచిన ఓ బాబా కనిపించాడు. చాలా ఏండ్లుగా అతను ఆ చేతిని దింపకపోవడంతో ఇక అది కట్టెలా గాల్లోనే బిగుసుకుపోయింది. తనను తాను ఇనుపగొలుసుతో బంధించుకొన్న మరొక నాగా బాబా, రుద్రాక్ష మాలలనే ఒంటినిండా ఆచ్చాదనగా వేసుకొన్న వేరొక నాగా బాబా, గోళ్లను కట్‌ చేయకుండా చాలా పొడుగ్గా పెంచుకున్న ఇంకో నాగాబాబా.. ఇలా అనేక వింత బాబాలు నాకు అక్కడ కనిపించారు.

హిమాలయాల్లో నాగా బాబాలు చాలాచోట్ల కనబడతారు. జడని తలపైన జటాజూటంలా ముడి వేసుకొంటారు. సాధారణంగా అంతా యోగా చేస్తారు కాబట్టి సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు.

- సశేషం

260
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles