వ్యర్థమేదైనా.. అర్థవంతమే!


Sat,November 2, 2019 01:08 AM

ఇన్నాళ్లూ బయోగ్యాస్ తయారీ అంటే.. పశువుల వ్యర్థాలే అనుకునే స్థితిని మార్చేసింది ఈ యువతి. వ్యర్థమనుకున్న పదార్థం ఏదైనా.. దాన్ని అర్థవంతంగా ఉపయోగించుకుంటే వేస్టేజ్ అనే మాట వినిపించదని ఘంటాపథంగా చెబుతున్నది. సహజవనరులు తరిగిపోకుండా, ప్రకృతికి ప్రమాదం వాటిల్లకుండా ప్రత్యామ్నాయాలను అనుసరిస్తున్నది. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తిని క్షేత్రస్థాయి నుంచి ప్రోత్సహిస్తున్నది. పర్యావరణాన్ని పదికాలాల పాటు కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది మన తెలంగాణ యువ వ్యాపార కెరటం శృతి ఆహుజ.
shruti-ahuja
Change your thoughts and
you change your world
ఒక ఆలోచన ప్రపంచాన్నే మార్చేయగలదన్న సూత్రమే శృతి ఆహుజలో ఎనలేని నమ్మకాన్ని ఇచ్చింది. అమెరికాలో లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్‌కు పయనమైంది. తన చదువు, విజ్ఞానం పుట్టిన దేశానికే ఉపయోగపడాలన్న ఆకాంక్ష.. ఆమెలో కొత్త ప్రయోగాలకు నాంది పలికింది. వ్యర్థాలకు అర్థమివ్వాలనే తనముందున్న లక్ష్యం. తాను అనుకున్న పనిలో విజయం సాధిస్తే.. పర్యావరణానికి ఎంతోకొంత మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నది. అప్పుడే సహజసిద్ధమైన వ్యర్థాల నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, క్యాంటీన్లు, మార్కెట్ యార్డులు, అన్నదాన సత్రాల్లాంటి చోట్ల ఎక్కువ స్థాయిలో సేంద్రియ వ్యర్థాలు విడుదల అవుతుంటాయి. వాటిని వృథాగా వదిలేయకుండా బయోగ్యాస్, విద్యుత్ అందించే యంత్రాలను రూపొందించాలనుకున్నది.


పరిశోధన ప్రారంభమైంది..

తన ఆలోచనకు తగ్గట్లుగా వ్యవస్థాగతమైన వాస్తవాలు తెలుసుకునేందుకు పరిశోధన మొదలు పెట్టింది శృతి ఆహుజ. బయోగ్యాస్, విద్యుత్ తయారుచేసే విధానాల గురించి అన్వేషించింది. అనేక పౌల్ట్రీ పరిశ్రమలను సందర్శించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లో అమలవుతున్న వ్యర్థపదార్థాల నిర్వహణ విధానాల గురించి తెలుసుకున్నది. అక్కడ అమలయ్యే పద్ధతులు ఆశించిన ప్రయోజనాలు అందించలేకపోవడాన్ని గమనించింది. పౌల్ట్రీ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అనే విషయాన్ని కొన్ని పరిశోధనల ద్వారా తెలుసుకున్నది. అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని ఏర్పాటు చేసుకొని.. పౌల్ట్రీ వ్యర్థాల్లో ఉండే అమోనియా ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి విజయం సాధించింది. పౌల్ట్రీ వ్యర్థాలతో గ్యాస్, విద్యుత్ ఎలా తయారు చేసుకోవాలో యజమానులకు వీడియోల ద్వారా డెమో ఇచ్చింది. దీంతో రైతులు పౌల్ట్రీల వద్ద బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి యజమానులు అంగీకరించారు. వాటివల్ల ఉపయోగాలు తెలిశాక రైతులు ఖర్చు గురించి వెనకాడలేదు.

సేంద్రియ వ్యర్థాలతో గ్యాస్..

మొదటి దశలో కొన్ని అపజయాలు ఎదురైనా.. వెనకడుగు వేయలేదు శృతి. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు సేంద్రియ వ్యర్థాల మీద దృష్టి పెట్టింది. కాయగూరలు, పండ్ల వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్ తయారు చేయడంపై దృష్టి సారించింది. నగరాల్లో స్టార్‌హోటళ్లు, క్యాంటీన్లు, మార్కెట్ యార్డుల నుంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అలాకాకుండా ఈ చెత్త నుంచే వంట గ్యాస్ అందించాలనుకున్నది. 2014లో మళ్లీ కొత్త ప్లాంట్ తయారీని మొదలుపెట్టింది. ఆహుజ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్‌లిమిటెడ్ పేరుతో శృతి సరికొత్త యంత్రాలను ప్రవేశపెట్టింది. ఆమె రూపొందించిన యంత్రాలు మంచి ఫలితాలివ్వడంతో అనేక సంస్థలు యంత్రాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. దేశంలో పలు చోట్ల ఆహారం అందించే అక్షయ పాత్ర నిర్వాహకుల్ని సంప్రదించి తన ఆలోచన వివరించింది. వాళ్లు వెంటనే అంగీకరించి వారి వంటగదిలో ఆహుజ రూపొందించిన యంత్రాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 సంస్థలకు బయోగ్యాస్ తయారీకి సంబంధించి శృతి సేవలందిస్తున్నది.

అపజయాల నుంచి..

దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడానికి శ్రుతి ఆహుజ ఎంతో శ్రమించింది. ఎన్నో అపజయాలను చవిచూసి.. మరెంతో అనుభవ పాఠాలు నేర్చుకున్నది. తండ్రి ఆర్థికంగా సాయం అందించడంతో సంస్థను ఏర్పాటుచేసింది. తూఫ్రాన్ వద్ద కొంత స్థలం కొనుగోలు చేసింది. సొంతగా బయోగ్యాస్ ప్లాంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు ఆరేడు నెలల పాటు రకరకాల పరిశోధనలు, అధ్యయనాల అనంతరం ప్లాంటును ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెట్టే పథకాల్లో బయోగ్యాస్, పవర్‌ప్లాంట్‌కు సబ్సిడీ వర్తించేలా కృషి చేయడంతో.. వారు కూడా యంత్రాల కొనుగోలుపై ఆసక్తి చూపారు. రెండేండ్ల శ్రమతో ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించింది శృతి ఆహుజ.

అవసరాలకు తగ్గట్లుగా..

మార్కెట్‌లో ఎన్నిరకాల ఉత్పత్తులు ఉన్నా.. ప్రజా అవసరాలు తీర్చగలిగేవే పేరు తెచ్చుకుంటాయి. అందుకే శృతి కూడా మార్కెట్ పోటీని తట్టుకునేలా యంత్రాలను రూపొందించింది. సామర్థ్యాన్ని బట్టి యంత్రాలను అందించడం మొదలు పెట్టింది. దీంతో అనేక సంస్థలు ఆ యంత్రాలను వాడేందుకు ముందుకు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ, రాంకీ గ్రూప్స్, ఐఐసీటీ, కూరగాయల మార్కెట్, క్యాంటీన్లు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఆసుపత్రులు, కాలేజీల్లో ఆహుజ ఇంజినీరింగ్ సర్వీసెస్ బయోగ్యాస్ ప్లాంట్లనే ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గ్యాస్, విద్యుత్ ఖర్చులు భారీగా తగ్గించుకుంటున్నారు. వ్యర్థాల సామర్థ్యాన్ని బట్టి ధర ఉంటుంది. రోజుకు 250 నుంచి 300 కేజీల వ్యర్థాలతో గ్యాస్ లేదా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ధర రూ.16 లక్షల వరకు ఉంటుంది.
shruti-ahuja1

గ్యాస్ వ్యర్థాల నుంచి ఎరువులు..

పాడైన కూరగాయలు, మిగిలిన అన్నం, కూరలు, కూరగాయ ముక్కలు, పచ్చగడ్డి ఇలా ఏరకం ఆహారం వృథా అయినా ఈ యంత్రంలో వేస్తాం. అలా వేసిన తర్వాత లోపల ఆక్సిజన్ లేకుండా చేసి, బ్యాక్టీరియాను వేస్తాం. దీంతో ఆ ఆహారం కుళ్లిపోయి గ్యాస్, పిప్పి రూపంలో మారుతుంది. ఇలా వచ్చిన గ్యాస్‌ను వంటలకు ఉపయోగించుకోవచ్చు. పిప్పిని పొడిలా మార్చి ఎరువుగా పంట పొలాలకు వినియోగించవచ్చు. వ్యర్థ పదార్థాలు పెరగడం వల్ల ఖనిజాలతోపాటు జల వనరులు తగ్గిపోతాయి. మేము రూపొందించిన యంత్రాలతో తరిగిపోతున్న శిలాజ ఇంధనాలు, ఇతర సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయ శక్తి ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. శిలాజ ఇంధనాల స్థానంలో వీటిని వాడడం వల్ల తక్కువ కాలుష్యం వెలువడుతుంది. ఇటువంటివి వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు తోడ్పడుతాయి.
- శృతి ఆహుజ, యువ వ్యాపారవేత్త

-పసుపులేటి వెంకటేశ్వరరావు

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles