గుండెల నిండా తెలంగాణ.. గ్రూప్-2 విజయం


Sat,November 2, 2019 12:57 AM

ఉన్నత స్థాయికి చేరుకోవాలని చాలామంది కలగంటారు. కానీ కొందరే ఆ కల సాకారం చేసుకుంటారు. మిగతావాళ్ల కల కలగానే ఎందుకు మిగిలిపోతుంది? వాళ్ల కల ఎప్పటికీ సాకారం కాదా? అందమైన జీవితాన్ని ఊహించుకొంటూ నిద్రపోతే కల ఎప్పటికీ సాకారం కాదు. కల సాకారం కావాలంటే ఊహా లోకం నుంచి బయటకొచ్చి.. అందమైన జీవితం ఎలా సాధ్యమవుతుందో మార్గాలు అన్వేషించాలి. వీరు తమ కలను అలాగే సాకారం చేసుకున్నారు. తెలంగాణను గుండెల
నిండా ప్రేమించి.. మనసు నిండా ఆస్వాదించి గ్రూప్-2 విజేతలై నిలిచారు.


పబ్లిక్ సర్వీస్‌లో సేవలందించాలని చాలామందికి ఉంటుంది. కానీ దానిని సాధించే క్రమంలో కొంతమంది విఫలమవుతున్నారు. దీనికి కారణం ప్రణాళిక లేకపోవడం. సామాజికాంశాలపై అవగాహన కొరవడటం. కానీ.. పక్కా ప్రణాళిక వేసుకొని సామాజికాంశాల పట్ల అవగాహన పెంపొందించుకొని ప్రిపేర్ అయితే పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో తమ సత్తా చాటి ఉన్నత ఉద్యోగాలు సంపాదించిన వారిని చూస్తే అర్థమవుతుంది.

Pailla-Naveen-Anusha

భార్యాభర్త-ఒకే ఉద్యోగం

గ్రూప్-2లో ఉద్యోగం సంపాదించినవారి సక్సెస్ సూత్రం ఒకటి ఉంది. అదే అవగాహన.. అధ్యయనం.. అప్లికేషన్. కుటుంబ బాధ్యతల్లో పడితే ఉద్యోగం కొట్టలేం.. పెండ్లయితే చదవలేం అనే అపోహల్ని పటాపంచలు చేస్తూ విజయం సాధించి చూపించారు నవీన్.. అతని భార్య అనూష. పైళ్ల నవీన్‌రెడ్డిది సామాన్య వ్యవసాయ కుటుంబం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. పెరిగి.. చదువుకున్న నవీన్ చిన్నప్పటి నుంచి ప్రతీది ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడు. డిగ్రీ పూర్తవగానే పీహెచ్‌డీపై దృష్టి మళ్లింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశాడు.

యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత నవీన్ ఆలోచనలు మరింత పదునెక్కాయి. చిన్నప్పటి నుంచి చూసిన ప్రాక్టికల్ అనుభవాలకు పీహెచ్‌డీ అనుభవాలు తోడవ్వడంతో కాంపిటీటివ్ పరీక్షలపై ఆసక్తి పెంచుకున్నాడు.
పోటీ పరీక్షలు అంటే ఏమేం ఉంటాయి? దేనికి ఎలా ప్రిపేర్ కావాలి? ఏ ఉద్యోగానికి ఎలాంటి సిలబస్ ఉంటుంది? పరీక్ష రాసినంత మాత్రాన ఉద్యోగం వస్తుందా? అనేవి పూర్తిస్థాయిలో విశ్లేషించుకున్నాడు.
అది 2013. సీఎస్‌ఐఆర్ నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల్లో ఆల్ ఇండియా 77వ ర్యాంక్ సాధించాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేస్తున్నా. కానీ అది ప్రజలకు నేరుగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఒక్కదానిపైనే ఆధారపడి ఉండకుండా ఏం చేయాలి? అని ఆలోచించి.. పీహెచ్‌డీ చేస్తూనే సొంతంగా గ్రూప్-1కు ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పబ్లిక్ సర్వీస్ ఉద్యోగం సంపాదించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సంకల్పించాడు. ప్రిపరేషన్ కొనసాగుతుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. 2016లో గ్రూప్-2, పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ పరీక్షలు రాశాడు. 2017లో వచ్చిన ఫలితాల్లో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం సంపాదించాడు.
అక్కడితోనే ఆగిపోవద్దని ప్రిపరేషన్‌ను కొనసాగించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించి కల సాకారం చేసుకున్నాడు.
నవీన్ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఆయన సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామస్తులు.. స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇది పక్కనపెడితే.. నవీన్ ఉద్యోగ పర్వంలో ఇంకో అద్భుతం జరిగింది.

అదేంటంటే.. ఆయన భార్య కూడా గ్రూప్-2లో విజయం సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇది చాలా అరుదు. ఈ పరీక్షలో వీరితో పాటు మరికొంతమంది గ్రూప్-2లో విజయం సాధించినప్పటికీ సేమ్ ఉద్యోగం ఎవరికీ రాలేదు. కొందరికి ఏసీటీవో వస్తే.. మరికొందరికి ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి టీఎస్‌పీఎస్స్ పరీక్షల్లో గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్ ఉగ్యోగం సంపాదించిన తొలి దంపతులు వీళ్లే కావడం విశేషం. నవీన్ భార్య అనూష ప్రస్తుతం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్నారు. మంచి ఉద్యోగం. శ్రమ కూడా చాలా తక్కువ. హాయిగా ఉండొచ్చు. కానీ హాయిగా ఉండటం కోసం కాదు.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు అనూష.
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో 2014లో ప్రిపరేషన్ ప్రారంభించారు. కానీ ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా 2018లో ఎఫ్‌ఆర్‌ఓగా సెలెక్ట్ అయ్యారు. ట్రెయినింగ్ కూడా మొదలుపెట్టారు. అంతకుముందే రాసిన గ్రూప్-2 పరీక్షలు ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించారు.

ఒకే ఇంటి నుంచి.. అది కూడా భార్యాభర్తలు ఒకే డిపార్ట్‌మెంట్‌లో ఒకే క్యాడర్ ఉద్యోగానికి సెలక్ట్ అవ్వడం పట్ల అందరూ సంతోషపడుతున్నారు.
వాస్తవానికి వీరిద్దరూ గ్రూప్-2 ఉద్యోగం కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఎలాంటి మాక్ టెస్ట్‌లకు హాజరు కాలేదు. వారికి వారే సొంతంగా కోచింగ్ ఇచ్చుకున్నారు. సొంతంగా మాక్ టెస్ట్‌లు పెట్టుకున్నారు.
నవీన్‌కు ఇక్కడ చిన్నప్పటి నుంచి అధ్యయనం చేసిన చారిత్రక, సాంస్కృతిక, కళ, ఆర్థిక స్థితిగతులు బాగా పనికొచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకొని తెలంగాణ చరిత్ర-ఉద్యమం-కళలు-సాహిత్యం పేరుతో పీఎన్‌ఆర్ పబ్లికేషన్స్ ఏర్పాటుచేసి ప్రచురించారు. ఇదే మెటీరియల్‌ను ఇద్దరూ ఫాలో అయ్యారు. వారే కాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న చాలామందికి వీటిని ఇచ్చారు.
సిలబస్‌పై అవగాహన.. ప్రామాణిక పుస్తకాలు.. దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని నవీన్‌రెడ్డి ఈ పుస్తకం తీసుకురాగలిగారు. తెలంగాణపై అవగాహన.. నిండైన ప్రేమ ఉండటంతో మంచి విషయాన్ని పొందుపర్చగలిగారు. తానే కాకుండా.. తన భార్య అనూషను కూడా విజేతగా నిలిచేట్లు చేయగలిగారు.

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles