అధ్యయనమే ఆయుధం


Sat,November 2, 2019 12:55 AM

Nawin-Samala
సామల నవీన్‌రెడ్డిది కామారెడ్డి జిల్లా దేమికలాన్ గ్రామం. ఉపాయం ఉంటే ఉన్నత ఉద్యోగం సాధ్యం అని నిరూపించాడు నవీన్. తెలంగాణ అంటే మనసంతా ప్రేమే. ఈయనేంది పొద్దున ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో చరిత్ర మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఉమెన్స్ కాలేజీలో ఇంకేదో సమాచారం సేకరిస్తాడు. సాయంత్రం కల్లా కామారెడ్డిలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యటించి అక్కడేవో ఆధారాలు సేకరిస్తాడు. ఏం పనిలేదా నవీన్‌కు? అసలేం అర్థమే కాడు అని చాలామంది అనుకున్నారట ఆయన గురించి. కానీ.. అందరూ అనుకున్నట్టు ఆయన పనిలేక జిల్లాలన్నీ కట్టగట్టుకొని తిరగలేదు. తెలంగాణ చరిత్ర.. కళలు.. సాహిత్యం.. జీవన స్థితిగతుల గురించి నిరంతరం అధ్యయనం చేశాడు. ఒక్కోసారి తిండీ తిప్పలు కూడా మానేసి జోడేఘాట్‌లాంటి ప్రాంతాల్లో పర్యటించాడు.


ఇదంతా ఎందుకు అంటే?

తెలంగాణపై మనసులో ఏర్పరచుకున్న ప్రేమ కోసం. అదే ఇవాళ ఆయనకు గ్రూప్-2 పరీక్షల్లో విజయం సాధించేలా తోడ్పాటునందించిందని అంటున్నాడు నవీన్.
డిగ్రీవరకు కామారెడ్డిలో చదివిన నవీన్ తర్వాత హైదరాబాద్‌లో ఎంబీఏ చేశాడు. దాని తర్వాత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేశాడు. చిన్నప్పటి నుంచే ఏ పనిచేసినా బాధ్యతాయుతంగా చేసేవాడు. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని వందకు వందశాతం పూర్తిచేసే రకం.

నవీన్ వాళ్ల నాన్న హెడ్‌కానిస్టేబుల్. పబ్లిక్ సర్వెంట్‌గా చేస్తే ఎలాంటి గౌరవం ఉంటుందో వాళ్ల నాన్నను చూసి తెలుసుకున్నాడు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అనుకున్నాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. 2011లో గ్రూప్-2 పరీక్ష రాసినప్పటికీ అనుభవలేమి.. అకడమిక్ స్టడీస్ వల్ల విజయం సాధించలేకపోయాడు. అదేసమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగటం.. తెలంగాణ లిటరేచర్ పరిచయం అవ్వడంతో అన్ని విషయాలపై అధ్యయనం చేశాడు. థియరీ పాఠాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. నిపుణులను సంప్రదించి.. గ్రంథాలయాల్లో గంటల తరబడి అన్వేషించి తెలంగాణపై పట్టు సంపాదించాడు. వర్థమాన.. ఆర్థిక.. సామాజిక అంశాల మీద మిత్రులతో జరిపిన చర్చలు కూడా తనకు ఉపయోగపడ్డాయి. తర్వాత గ్రూప్-2 నోటిఫికేషన్‌కు అప్లయ్‌చేసి ఆత్మవిశ్వాసంతో ప్రిపేరయ్యాడు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు.

ఈ మొత్తం ప్రయాణంలో పక్కా ప్రణాళిక.. ప్రామాణిక పుస్తకాలు.. పట్టు వదలని అధ్యయనాలే తన ప్రతిభకు పదును పెట్టాయి అంటున్నాడు నవీన్.
గ్రూప్స్ ప్రిపేరయ్యేవాళ్లు మొదట సిలబస్ పరిధి ఏంటి? ప్రామాణిక పుస్తకాలు ఏంటి? తెలంగాణ భౌగోళిక.. సామాజిక.. సాంస్కృతిక అంశాల మీద అవగాహన పెంచుకోవాలి. సామర్థ్యాలను గుర్తుంచుకొని ఒకరి ప్రిపరేషన్ మాడల్‌ని గుడ్డిగా అనుకరించకుండా తమదైన శైలిలో చదివితే విజయం గ్యారెంటీ అంటున్నాడు సామల నవీన్‌రెడ్డి.

152
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles