వైద్యం.. పరిపాలన.. బాధ్యత!


Sat,November 2, 2019 12:54 AM

డాక్టర్ పట్టా తీసుకున్న ఓ యువతి సమాజానికి మరిన్ని సేవలు అందించాలనుకున్నది. అందుకోసం సివిల్స్ రాసి విజయం సాధించింది. ఐఏఎస్ అధికారిణిగా ఎంపికైంది. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందిస్తూనే పరిపాలనాదక్షతను నిరూపించుకుంటున్నది.
This-Doctor
కోల్‌కతాకు చెందిన ఆకాంక్ష భాస్కర్ అనే ఈ వైద్యురాలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నది. ఎంబీబీఎస్ చేసిన తర్వాత పలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యురాలిగా పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే డాక్టర్‌కంటే ఐఏఎస్ అధికారిగా సమాజానికి మరిన్ని సేవలందించవచ్చనుకున్నది ఆకాంక్ష. అందుకోసం 2014లో యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షలు రాసింది. ఆమెకు మొదటి ప్రయత్నంలోనే 76వ ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నది. అనంతరం పశ్చిమబెంగాల్లోని రఘునాథ్‌పూర్ సబ్‌డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టంది. ఆమె విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలోని సర్కారు దవాఖానాల్లో సరైన వైద్యసిబ్బంది లేరు. దీంతో అక్కడికి వైద్యం కోసం వచ్చే పేద రోగులు అనారోగ్యంతో చనిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆకాంక్ష.. సెలవుదినాల్లో అక్కడి ప్రజలకు తానే స్వయంగా వైద్య సేవలు అందించడం మొదలు పెట్టింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వైద్యులు కావడంతో వారి సహాయం తీసుకొని మరింతమందికి చికిత్సలు అందిస్తున్నది. గర్భిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి వారికి అవసరమైన మందులు ఇచ్చింది. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నది. బాలింతలకు చిన్నారుల పోషణకు సంబంధించిన అంశాలను తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నది. పరిపాలనా అధికారిణిగానేకాకుండా వైద్య సేవలందించే డాక్టరుగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన సేవలందించగలుగుతున్నానుఅని ఆకాంక్ష భాస్కర్ చెబుతున్నది. గతంలో కంటే ఇప్పుడు వారిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దీని వల్ల వ్యాధుల బారిన పడేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది అని అంటున్నది.

165
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles