ఆర్గానిక్ లిప్‌స్టిక్ వ్యాపారి కళ్యాణపు శ్రావ్య


Mon,October 21, 2019 12:49 AM

కళ్యాణపు శ్రావ్య.. ఈ పేరు వినగానే చాలామంది అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయి అని మాత్రమే గుర్తు పడతారు. కానీ, ఆ పోటీలకు ముందే ఆమె వ్యాపారరంగంలో రాణించాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ లిప్‌స్టిక్‌లను తయారు చేసి గుర్తింపు తెచ్చుకుంది. చిన్నతనం నుండి సమాజానికి ఏదో చేయాలనే ఆరాటం కలిగిన ఆమె అనుకోకుండా మోడలింగ్‌లోకి ప్రవేశించింది. ఆ రంగంలో మిస్ వరల్డ్ కెనడా టైటిల్‌ను గెలుచుకుంది. ఇటు వ్యాపారం, అటు మోడలింగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంతమొత్తాన్ని సామాజిక సేవకు కూడా వినియోగిస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నది. చదువు, వ్యాపారం, సేవ ఇలా మూడు రంగాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న కెనడాలో స్ధిరపడిన మన తెలంగాణ అమ్మాయి కళ్యాణపు శ్రావ్య సక్సెస్‌మంత్ర.
shravya
శ్రావ్య పుట్టింది ఖమ్మం జిల్లా. ఆమె తండ్రి రవికుమార్ ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో వ్యవసాయ అధికారిగా పనిచేశారు. వ్యవసాయాధికారి కావడంతో వారి జీవితమంతా పైరు, పంటల చుట్టే తిరిగింది. రవికుమార్ తన ఉద్యోగరీత్యా శ్రావ్యకు పదేండ్ల వయసు వచ్చేవరకు ఆదిలాబాద్‌లోనే ఆమె ప్రాథమికవిద్యను పూర్తి చేశారు. ఆ తరువాత వారి కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. చిన్నతనం నుంచే సాంస్కృతిక, సామాజిక రంగాల పట్ల ఆసక్తి కలిగిన శ్రావ్య సాంస్కృతిక కార్యక్రమాలు, సోషల్ గ్రూప్‌లు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు కెనడాలో చక్కటి గుర్తింపు వచ్చింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టాలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తరువాత కెమికల్ ఇంజినీరింగ్ కూడా చేసింది. కెనడాలోనే జరిగిన మిస్‌నార్తన్ ఆల్బెర్టా వరల్డ్ 2017 పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. దాంతో ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.


ఆర్గానిక్ లిప్‌స్టిక్

శ్రావ్య చిన్నప్పటినుంచి సమాజానికి భిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఉంది. అందుకే చిన్నతనంలో అనేక రకాల ప్రయోగాలు చేసేది. అలా పాఠశాల స్థాయిలోనే స్కూల్ స్నేహితురాలితో కలిపి వంద శాతం ఆర్గానిక్ లిప్‌స్టిక్‌లను తయారు చేయాలనుకుం ది. మనం వాడే సౌందర్య ఉత్పత్తుల్లోని చాలా పదార్థాలు పర్యావరణానికి హానిచేసేవే. అందుకే కొబ్బరి, ఆలివ్ నూనెలు, రంగు కోసం కొన్నిరకాల క్లేలు, వాసనకోసం పండ్లు.. వంటి సహజంగా దొరికే పదార్థాల మేళవింపుతో లిప్‌స్టిక్‌లు తయారుచేయాలనుకున్నా. చదువుకుంటూ ప్రయోగాలు చేయాలి కాబట్టి సరైన ఫార్ములా రావడానికి రెండేండ్లు పట్టింది. వీటిని సెలెస్టి లిప్‌స్టిక్స్ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. వారి ఉత్పత్తులకు ఉత్తర అమెరికాలో వినియోగదారులు ఎక్కువ. వినియోగదారుల నుండి విశ్వాసం పెరిగిన తర్వాత మరిన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేయాలనుకుంది. అలా బ్రాంజర్, బ్లష్, ఐక్రీం.. వంటి ఆరు రకాల ఉత్పత్తులను వంద శాతం సేంద్రియంగా తయారు చేయడం చూసింది.

సేవకోసం కొంత

చిన్నతనం నుండి సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఉన్న శ్రావ్య తను సంపాదించిన దానిలో సమాజానికి కొంత ఇవ్వాలని నేర్చుకుంది. మొదటి ఏడాది తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తంతో 200 మంది పిల్లలకు ఉచిత ఆరోగ్యపరీక్షలు చేయించింది. రక్తహీనత బారిన పడకుండా మందుల తయారీ సంస్థలతో మాట్లాడి విటమిన్, ఐరన్ మాత్రలు ఇప్పించింది. రెండో ఏడాది ముంబయికి చెందిన నలభైమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్స్ అందించింది. మేక్ ఏ విష్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసింది. కుకీస్‌తో పాటు ఇతర ఆహారపదార్థాలు వండి ఇంటింటికీ వెళ్లి అమ్మి నాలుగువేల డాలర్లు సేకరించింది. కొన్నాళ్లక్రితం కెనడాలో లిబరల్స్ పార్టీ శ్రావ్య గురించి తెలుసుకుని ఎంపీగా పోటీచేయమంటూ ఆహ్వానించింది. చదువు వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నానంటున్నది. సమాజానికి ఎక్కువ సేవ చేయాలంటే.. రాజకీయాలే సరైన మార్గమని, ఆ దిశగా భవిష్యత్తులో ఆలోచిస్తానని అంటున్నదామె.

పిల్లలు, మహిళలకోసం..

శ్రావ్యది స్వతంత్ర ఆలోచనా స్వభావం. అందుకే మహిళలపై జరిగే దాడులు, ఇతరాత్ర విషయా ల్లో వెంటనే స్పందించేది. ప్రపంచవ్యాప్తంగా మహిళల మీద జరిగే దాడులు, వారిపై వివక్ష పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మనందరం కోరుకునే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే.. మహిళల ఆర్థిక స్వావలంబన ముఖ్యం అంటారా మె. అలాగే ఆడపిల్లలు ఎంత పెద్ద చదువులు చదివినా.. సొంతకాళ్ల మీద నిలబడినప్పుడు.. వచ్చే ఆర్థిక ఆత్వవిశ్వాసమే వేరు. ఇతరులపై ఆధారపడే తత్వం తగ్గుతుంది. అందుకే శ్రావ్య ఒకవైపు చదువుకుంటూనే సెలెస్టి అనే లిప్‌స్టిక్ కంపెనీలో సహభాగస్వామి అయ్యింది. చదువు, కంపెనీతోపాటు.. తనకు తోచిన సామాజిక సేవలోను పాలుపంచుకోవడం శ్రావ్య ప్రత్యేకత. కెనడాలోని కొన్ని క్లబ్బులకు వెళ్లి.. పిల్లలు, మహిళలను ఉత్సాహపరుస్తూ ఉంటుంది. శ్రావ్య కెనడాలో ఉండికూడా తెలుగు రాష్ర్టాల్లోని కొన్ని పల్లెల్లో వైద్యశిబిరాలను నిర్వహిస్తుండడం విశేషం. హాజరైన పిల్లలకు వైద్యపరీక్షలు చేసి.. తగిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తూ అందరి మన్నన అందుకుంది.

shravya3

అవాంతరాలు అధిగమించి..

శ్రావ్య కెమికల్ ఇంజినీరింగ్ చదివింది. లిప్‌స్టిక్స్ తయారీ మొదలుపెట్టినప్పుడు ఓవైపు చదువు, మరోవైపు ప్రయోగాలతో సమయం సరిపోయేది కాదు. దానికోసం ఆమె దాదాపు 200 నుంచి 500 ఫార్ములాలు కనిపెట్టింది. కష్టపడి ఓ లిప్‌స్టిక్ తయారుచేస్తే వాసన బాగుండేది కాదు. లేదా విరిగిపోయేది. ఇలా అనేక అవాంతరాలు ఎదుర్కొంది. అయితే వాటన్నింటినీ అధికమించి లోపాల్ని దిద్దుకుంటూ ఉత్పత్తిని బయటకు తీసుకొచ్చింది. ఇందుకోసం అమ్మ, మామయ్య హోమియోపతి డాక్టర్ కావడంతో ఆయనతోనూ మాట్లాడి ఆయుర్వేదిక్ పుస్తకాలు చదివింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని మార్కెట్‌లోకి తన లిప్‌స్టిక్‌ను ప్రవేశపెట్టింది.

shravya2

మిస్ వరల్డ్ కెనడా

రెండెండ్ల క్రితం కెనడాలో జరిగిన మిస్ వరల్డ్ కెనడా పోటీల్లో పాల్గొని శ్రావ్య ప్రజల ఓటింగ్ ద్వారా మిస్ వరల్డ్ కెనడా టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనుకోకుండా పోటీల్లో పాల్గొన్నా అక్కడితో ఆగిపోలేదామె. చదువు, వ్యాపారం, సేవ అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నది. మిస్ కెనడా పోటీల గురించి చెల్లి మయూఖ చెప్పినా మొదట ఆసక్తి చూపలేదు. కారణం తను సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నానని, మోడలింగ్ రంగం దానికి పూర్తి బిన్నం అని అమె అనుకుంది. అయితే అది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, దాని ద్వారా వచ్చే పేరుతో సమాజానికి మనం అనుకున్న పనులు చేయగలమని, ముఖ్యంగా ఈ రంగంలో ఉన్న వారు కూడా సామాజిక సేవ చేయొచ్చని కుటుంబసభ్యులు చెప్పడంతో దరఖాస్తు చేసింది. ఆమె గురించిన ఆ వివరాల్నీ పోటీ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో పీపుల్స్ చాయిస్‌లో భాగంగా మిస్ కెనడా టైటిల్‌ను అందుకుంది.

902
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles