మాటల తూటాలు పేల్చే తుపాకి రాముడు


Sun,October 20, 2019 01:09 AM

ఢిల్లిల చాయ్ దాగిన. బొంబైల టిఫిన్ తిన్న. హైదరాబాద్‌కొచ్చి అన్నం దిన్న. గవన్నీ నాకు నచ్చలే మారాజ్.. గందుకే మనూరికొచ్చిన. గిక్కడ అంబలి దాగుత. గిదే నాకిష్టం. ప్రధాని మోది, ముఖ్యమంత్రి కేసీఆర్, బాలీవుడ్ వీరో అమితాబ్ బచ్చన్ గీళ్లంతా నా దోస్తులు. కాకపోతే ఆళ్లు పెద్ద పొజిషన్ల ఉన్నరని నేనే పట్టించుకునుడు మానేశిన. నాకు లెక్కలేనంత డబ్బున్నది. దొంగల భయం. గందుకే గా రిజర్వు బ్యాంకోనికి అప్పు ఇచ్చిన. ఇగ నాకు నేల మీద తిరిగే కార్లున్నయ్.. ఆకాశంల తిరిగే గాలిమోటర్లున్నయ్. గవన్నీ పెద్ద పెద్దోళ్లకు కిరాయికి ఇచ్చిన. నడిస్తే ఆరోగ్యం మంచిగుంటదట. గందుకే గిట్ల నడుసుకుంట మీ ఇంటికచ్చిన. లండన్ రాణి నాకోసం ఎదురుసూత్తాంది. తొందరగ పోవాలె. దారిఖర్సులకు లేవు. ఎంతో కొంత డబ్బులియ్.. ఇలా మాటల తూటాలు పేల్చేవాడే తుపాకీరాముడు. ఈ నెల 25న తుపాకీ రాముడు విడుదల కానున్న నేపథ్యంలో సినిమా గురించి చాలా విషయాలు హీరో, నిర్మాత జిందగీతో పంచుకున్నారు.
tupaki-ramudu
ఖాకీ రంగు బట్టలు. వెంట్రుకల్ని దాచిపెట్టే టోపీ. అరిగిపోయిన కిర్రు చెప్పులు. చేతిలో తుపాకీ. మీకు ఇప్పటికే మనసులో ఓ రూపం కనిపిస్తుంటుంది. అది తుపాకిరాముడిదే కదా. అతడు తుపాకీ పేలిస్తే ఎవ్వరిదైనా పొట్ట పగలాల్సిందే.. అదేనండీ ఎవ్వరైనా పొట్ట పగిలేలా నవ్వాల్సిందే.. టీవీలు, రేడియోలు రాకముందు నుంచే ప్రజలకు హాస్యం పంచాడు. అంతరించిపోతున్న కళలతో పాటు అతడూ అంతరించిపోయాడు.. కానీ అతడు పంచిన హాస్యం మాత్రం అంతరించిపోలేదు. నానమ్మలు, తాతయ్యలు చెప్పే కథలో.. కవులు, రచయితలూ రాసే పుస్తకాల్లో.. మేధావుల మాటల్లో ఇప్పటికీ బతికే ఉంది. జన జీవనంలో కలిసిపోయి.. తన బాధలను మరిచిపోయి.. ప్రజల పెదాల్లో నవ్వులు పూయించిన తోటమాలి తుపాకిరాముడు. అదే జోష్‌తో ఈ నెల 25న మన ముందుకు వస్తున్నాడు తుపాకిరాముడు.


సుపరిచితుడు సత్తి..

పూల చొక్కా, నిక్కరు వేసుకొని సాఫిత్రక్కా.. సాఫిత్రక్కా అంటూ ఎక్కడెక్కడి వార్తలనో మోసుకొచ్చే విలేకరి. మంచి మంచి సందేశాలిచ్చేవాడు. ఎంతటి సీరియస్ అంశమైనా సింపుల్‌గా చెప్పేవాడు. కడుపుబ్బా నవ్వించేవాడు. అందుకేనేమో పల్లె, పట్నం, ముసలీ ముతక, చిన్నా పెద్ద అందరికీ సుపరిచితుడయ్యాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. పాత్ర నిడివి ఎంతున్నా.. అందులో ఒదిగిపోయాడు. ఇప్పుడు తెలుగు తెరపై హీరోగా కనిపించనున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్.

కథానాయకుడు..

హీరో అంటే అందం, హైట్, పర్సనాలిటీ. పదిమందిని ఒంటి చేత్తో కొట్టగల సత్తా. ఇదే ఒకప్పటి హీరోయిజం. ఇప్పటిదాకా అందరూ అలాగే చూపించారు.. మనమూ అలాగే చూశాం. కానీ అసలైన హీరో ఎవరు? నలుగురి నోళ్లలో నానేవాడు.. చుట్టూ ఉన్నవారి మంచి చెడులను పంచుకునేవాడు. వాళ్లలో నవ్వులు పుట్టించేవాడు. మన కుటుంబంలో ఒకడిగా కలిసుండేవాడు. తుపాకి రాముడు సినిమాలో బిత్తిరి సత్తిది అచ్చం అలాంటి పాత్రే.

ఒక విచిత్రం

ప్రాంతీయ నేపథ్యంలో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే పోటీలో నిలిచాయి. మరికొన్ని మాత్రమే రికార్డుల్ని బ్రేక్ చేశాయి. పూర్తి తెలంగాణ పల్లె నేపథ్యంతో తెరకెక్కిన సినిమా తుపాకిరాముడు. మట్టి మనుషుల మంచితనాన్ని, తెలంగాణ మనుషుల బోళాతనాన్ని ఈ సినిమా ప్రతిబింబించనుంది. ఒకప్పుడు తుపాకి రాముడంటే హాస్యం. కానీ ప్రస్తుతం ఈ తుపాకి రాముడంటే నవ్వు, ప్రేమ, బాధ, బాధ్యత సకల కళల సమ్మేళనం. బిత్తిరిసత్తిగా పాపులర్ అయిన రవి అదే జోష్‌తో కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు. హీరోయిజం తెలంగాణ మనసుల్లో ఉంటదని నిరూపించడానికి వస్తున్నాడు.

కథ వెనుక కథ

ఆంధ్రపాలనలో తెలంగాణ సినిమాకు, కళాకారులకు అన్యాయం జరిగింది. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి, ఇక్కడి కళాకారులకు న్యాయం జరుగాలనుకున్నారు రసమయి బాలకిషన్. ఈ నేపథ్యంలో పదేండ్ల క్రితమే ఆయన అనేక కథలు రాశారు. అందులో తుపాకిరాముడు ఒకటి. ఈ కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కూడుకున్నది. కనుమరుగైపోతున్న ఓ కళాకారుడికి సంబంధించింది. నవ్వించే ఆ కళాకారుడి కనిపించని బాధలను ఇందులో చూపించనున్నారు. ఎదుటి వాళ్ల సమస్యల్ని తమ సమస్యలుగా భావించే పాత్ర గుండెకు హత్తుకునేలా ఉంటుందట. మూలకథకు డైరెక్టర్ టి. ప్రభాకర్ కొన్ని మార్పులు చేశారు. ఫైనల్‌గా తుపాకి రాముడు కథను కొత్తగా మలిచారు.

అన్వేషణ..

కళాకారులు, గాయకులు రసమయి బాలకిషన్. ఆయన శాసనసభ్యులుగా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు తనలోని కళ ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తన కథను తెరకెక్కించాలనుకున్నారు. తాను రాసిన తుపాకి రాముడు పాత్రకు సరిపోయే హీరో కోసం జల్లెడ పట్టారు. స్నేహితులు, పరిచయస్తులు ఎంతో మంది హీరోలను సూచించారు. కానీ ఆ కథలో సరిగ్గా సరిపోయేది ఒక్క బిత్తిరి సత్తి (చేవెళ్ల రవికుమార్) అని మాత్రమే నిర్ణయించున్నారు. వేరే ఆలోచనే లేకుండా ఆయనను సంప్రదించారు. రవికి మొదట కొంత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ తన జీవిత కల ఒక్కసారైనా తెరపై హీరోగా చూసుకోవడం.. అది ఇప్పటికి నెరవేరనుంది అనుకుని ఓకే చెప్పేశారు. అలా షూటింగ్ పట్టాలెక్కేసింది.

పల్లె పరిమళం.. సామాజిక కోణం

ఊరంటే చెరువు. ఊరంటే మట్టి. ఊరంటే ప్రేమ. పల్లె చల్లంగుంటే దేశం చల్లంగుంటది. ఇలాంటివన్నీ తుపాకీ రాముడు సినిమాలో చూడవచ్చు. ఇద్దరు అమాయకుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకథ. సామాజిక కోణంలో నిర్మించిన సినిమా. ఇందులో పూర్తి స్థాయిలో తెలంగాణ కళాకారులు నటించారు. హీరో, హీరోయిన్, పాత్రలన్నీ తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారే చేశారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇందులో స్థానికులు కూడా పాలుపంచుకున్నారు. బతుకమ్మ పాట, బోనాల పాట, చెరువు పాట, అమ్మపాట తెలంగాణలో బహుళ ప్రజాదరణ పొందిన పాటలన్నింటినీ సినిమాలో పొందుపర్చారు.

అందరూ మనోళ్లే..

రసమయి ఫిలింస్ పతాకంపై శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బతుకమ్మ సినిమాకు డైరెక్టర్‌గా పనిచేసిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేవెళ్ల ప్రాంతానికి చెందిన ప్రియ కథానాయికగా ఇందులో కనిపించనున్నారు. ఆర్.ఎస్. నందా, గౌతం రాజు, రవి ఆదేష్, అంబటి వెంకన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మూలకథ రసమయి బాలకిషన్ అందించగా.. అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్ పాటలు అందించారు. దీపావళి కానుకగా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది.

tupaki-ramudu2

కెమెరా ముందు ఏడ్చా..

ఇదివరకు చిన్న చిన్న పాత్రలు చేశా. సినిమాల్లో చేయాలనేది ఆశయం. ఇప్పటికి నెరవేరిందని సంతోషంగా ఉంది. తుపాకిరాముడిగా నా పాత్రకు వందశాతం న్యాయం చేశా. చాలామంది సినిమా కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. అందరికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్లు నన్ను ఆదరించినట్లుగానే ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా.
- కావలి రవికుమార్, నటుడు (బిత్తిరిసత్తి)

tupaki-ramudu3

కథను బట్టి హీరోలు రావాలె..

చాలా రోజుల నుంచి మంచి సినిమా తీయాలనే ఓ కోరిక ఉండేది. అందుకోసమే ఉద్యమ సమయంలో తుపాకి రాముడు కథను రాశాను. బిత్తిరి సత్తి కోసమే తుపాకిరాముడు కథ రాశానా అనిపిస్తుంది. హీరో అనగానే ఇలా ఉండాలి.. అలా ఉండాలని అనుకుంటరు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వేలాదిమంది సత్తిని చూడ్డానికి వచ్చేవాళ్లు. హీరోను బట్టి కథలు రావొద్దు.. కథను బట్టి హీరోలు రావాలె. తుపాకీ రాముడు సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్త వాళ్లే. కానీ చాలా ఏండ్ల అనుభవం ఉన్నట్లుగా నటించిండ్లు. మా సినిమా పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. చాలామంది సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
- రసమయి బాలకిషన్, నిర్మాత, శాసనసభ్యుడు

-పడమటింటి రవికుమార్
-సిఎం. ప్రవీణ్

834
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles