నర్మద పరిక్రమ నదీమాత దర్శనం కోసం..!


Sun,October 20, 2019 01:00 AM

Narmada
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
- తీర్థయాత్ర 23


(గత సంచిక తరువాయి)
మన దేశంలో నదులు, నదాలు ఉన్నాయి. నదులన్నీ బంగాళాఖాతంలో కలిస్తే నదాలు అరేబియా సముద్రంలో కలుస్తాయి. నర్మద, తపతి, మాహి అనే మూడు మాత్రమే నదాలు. కాని, ఈ తేడా తెలియక మనమంతా వాటిని కూడా నదులుగానే పరిగణిస్తుంటాం. చాలా పొడుగ్గా ఉన్న సర్దార్‌ వల్లభబాయ్‌ బ్రిడ్జిని మా బస్‌ దాటి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలోని బరౌచివైపు ప్రయాణించింది.

నర్మద నదిని పరిక్రమ అయ్యేదాక దాట కూడదనే నియమం ఉంది కాబట్టి, చాలామంది ఈ బ్రిడ్జి రాక ముందు సముద్రాన్ని నావమీద కాని, ఈదికాని దాటి పరిక్రమను కొనసాగించే వారు. కాని, ఈ బ్రిడ్జి వచ్చాక టూరిస్ట్‌ బస్సులన్నీ దీనినుంచే అవతలకు వెళుతున్నాయి. ఇది సముద్రం మీద కట్టిన బ్రిడ్జి కాబట్టి, దీన్ని దాటినా నదిని క్రాస్‌ చేసినట్లు అవదని దేశాయ్‌ చెప్పారు. కొందరు ఈ బ్రిడ్జిమీద దాటకుండా బస్సు దిగి పడవలమీద దాటి, అవతల మళ్లీ బస్సు ఎక్కుతారని తర్వాత తెలిసింది. అక్కడ నదిలో ఆటుపోట్లు చూసుకొని స్నానం చేయాలని, అరికాళ్లలో శంఖు ముక్కలు దిగే ప్రమాదం ఉందని, క్రితం యాత్రలో ఓ మహిళ పాదంలోకి శంఖు ముక్క దిగి బాధ పడిందని దేశాయ్‌ బస్సు దిగబోయే ముందు చెప్పే తన ఉవాచలో అందరినీ హెచ్చరించారు.

గంట తర్వాత బరౌచిలోని పరిక్రమ వాసుల కోసం కట్టిన పెద్ద విశ్రాంతి గృహం ఆవరణలోకి గేటు దాటి మా బస్సు ప్రవేశించింది. 250 మందికి పైగా పడుకొనేంత విశాలమైన బేస్‌మెంట్‌లోని హాల్‌ను మాకు ఇచ్చారు. మెట్లు దిగి అంతా మా సామానుతో ఆ హాల్‌లోకి వెళ్లాం. ఎప్పటిలా ఓవైపు మగవాళ్లకు, మరోవైపు ఆడవాళ్లకు కేటాయించారు. పుణ్యక్షేత్రాల్లో చాలా గెస్టుహౌజ్‌ల నిర్మాణదారులు చూపించే కక్కుర్తి ఇక్కడా కనిపించింది. కిటికీలకు తలుపులు లేవు. తలుపుకు తాళం వేసి అంతా వెళితే లోపలకు రావడానికి దొంగలకు సులువు. హాల్‌కు కిచెన్‌, బాత్‌రూమ్‌లు అటాచ్డ్‌గా ఉన్నాయి.

ప్రభు సరుకులు తీసుకు రావడానికి వెళుతూంటే, నేను అందరికీ స్వీట్స్‌ తెమ్మని డబ్బిచ్చాను. అది తెలిసి వెంకటేశ్వరరావు దానిలో సగం తను ఇస్తానన్నారు. అందరికీ తను తీసిన ఫొటోలు కాపీ చేసి ఇవ్వడానికి సీడీలు కూడా తీసుకు రమ్మని ప్రభుకు డబ్బిచ్చారు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు తన వెంట ల్యాప్‌ట్యాప్‌ను తేవడం మీద కొందరు తోటి పరిక్రమ వాసులు మొదట్లో ‘ఈ ఆధ్యాత్మిక యాత్రలో వెంట అది ఎందుకని’ చెవులు కొరుక్కున్నారు. కాని, చివర్లో అతని కెమెరాతో తీసిన ఫొటోలను మందు ల్యాప్‌ట్యాప్‌లోకి, తర్వాత అందులోంచి సీడీల్లోకి ఎక్కించి ఇస్తే అప్పుడు ఆ ల్యాప్‌ట్యాప్‌ను అతను ఎందుకు తెచ్చారో తెలిసింది.

కొద్దిగా ముందుకు వెళితే నర్మద నది, కిందికి మెట్లు కనిపించాయి. నదిలోని నీరు బాగా మురికిగా ఉండి, స్నానానికి అనువుగా లేదు. పైగా బ్యాక్‌ వాటర్‌లా ఉంది. ఎవరూ స్నానం చేయడం లేదు. మెట్లు దిగి ఆఖరి మెట్టుమీద నిలబడి వేళ్లను ముంచి నీళ్లను తలమీద చల్లుకున్నాం.

ప్రభు గులాబ్‌జామ్‌లు తెచ్చారు. గులాబ్‌జామ్‌లకు 300, సీడీలకు 280 రూపాయలు అయ్యాయి. వెంకటేశ్వరరావు, నేను ఆ గెస్ట్‌హౌజ్‌లోని విశాలమైన ఆవరణలో ఉన్న అయిదారు దేవాలయాలను దర్శించాం. అవి దాటి కొద్దిగా ముందుకు వెళితే నర్మద నది, కిందికి మెట్లు కనిపించాయి. నదిలోని నీరు బాగా మురికిగా ఉండి, స్నానానికి అనువుగా లేదు. పైగా బ్యాక్‌ వాటర్‌లా ఉంది. ఎవరూ స్నానం చేయడం లేదు. మెట్లు దిగి ఆఖరి మెట్టుమీద నిలబడి వేళ్లను ముంచి నీళ్లను తలమీద చల్లుకున్నాం.
చీకటి పడుతుండగా వెనక్కి తిరిగి వస్తుంటే చెట్టుచుట్టూ కట్టిన చప్టామీద తన సంచీని ఉంచుకొన్న ఓ సన్యాసి ఉతికిన లుంగీని కొమ్మకు ఆరేసుకుంటూ కనిపించారు. ప్రపంచాన్ని త్యజించి, దైవమార్గంలో ఉండే సన్యాసులంటే నాకు బాగా ప్రీతి. వారికి నా చేతనైన సహాయం చేయడానికే ప్రయత్నిస్తాను.

“హరి ఓం స్వామీ” పలకరించాను.
హిమాలయాల్లో సాధువును పలకరించే తీరు ఇది. ఉత్తర భారతదేశంలో ఒకో పుణ్యక్షేత్రంలో ఒకో రకంగా ఇలా పలకరిస్తుంటారు. నర్మదా నదీతీరాన ‘ఓం నర్మదే హరే’ అని, కేదార్‌నాథ్‌లో ‘జై బోలేనాథ్‌' లేదా ‘శ్రీ కేదార్‌నాథ్‌కీ జై’ అని పలకరిస్తారు. అతను ఏమిటన్నట్లుగా నా వంక చూశారు.
“మీరు పరిక్రమలో ఉన్నారా?” హిందీలో అడిగాను.
“అవును” జవాబు చెప్పారు అతను.
“పరిక్రమ మొదలై ఎంతకాలం అయ్యింది?” మళ్లీ ప్రశ్నించాను.
“సంవత్సరన్నర.”
“నర్మదా మాత దర్శనం అయిందా?”
“అవుతుంటాయి. అవన్నీ బయటకు చెప్పే విషయాలు కావు. వెళ్లి నీ పని చూసుకో” ఉదాసీనంగా చూస్తూ చెప్పారాయన.


364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles