పట్టుదలతోనే ఫలితం!


Fri,October 18, 2019 01:32 AM

చిన్నప్పుడు తండ్రి నవ్వుతూ అన్న మాటలు ఆమెలో బలంగా నాటుకున్నాయి. ఎప్పటికైనా ఆ మాటలు నిజం చేయాలని నిర్ణయించుకుంది. కుటుంబ నేపథ్యం బాగోలేకపోయినా కష్టపడింది. అనుకున్నది సాధించింది.
sheerath
షీరత్ ఫాతిమా.. అలహాబాద్ యువతి. తండ్రి ఓ గవర్నమెంట్ ఆఫీస్‌లో అకౌంటెంట్. ఫాతిమా చదువుతున్నప్పుడు తండ్రి ఆమెను అప్పుడప్పుడూ ఆఫీస్‌కు తీసుకెళ్లేవాడు. అక్కడ ఓ లాల్ బత్తి (ఎర్రబుగ్గ) కారు ఉండేది. తండ్రి దాన్ని ఫాతిమాకు చూపిస్తూ నువ్వెప్పటికైనా అందులో తిరగాలి అని నవ్వుతూ అనేవాడు. అది చాలా కష్టమైన పని అనుకుంది ఫాతిమా. ఎందుకంటే కుటుంబ నేపథ్యం అలాంటిది. ఫాతిమాకు నలుగురు తోబుట్టువులు. ఈమెనే పెద్దది. కాబట్టి ఎక్కువ బాధ్యతలుండేవి. ఎలా అయినా ఐఏఎస్‌ఐ అయి, లాల్‌బత్తి కారులో తండ్రికి కనిపించాలనుకుంది ఫాతిమా. ఇటు చదువుకుంటూనే స్థానిక ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా చేరింది. మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమైంది. తల్లిదండ్రులు కూడా ఇంటి పనులు చెప్పలేదు. తల్లి ఎప్పుడూ ఆహారాన్ని ఫాతిమా గదికి తెచ్చేది. ఫాతిమా పాఠశాలకెళ్లడానికి ఉదయం 6.30కే ఇంటి నుంచి వెళ్లి మూడుగంటలకు తిరిగొచ్చేది.


మిగిలిన సమయం అంతా చదువుకొనేది. ప్రిలిమ్స్ కోసం ఇరవై రోజులు పాఠశాలకు సెలవు పెట్టింది. మొదటిసారి రాసిన ప్రిలిమ్స్ కొద్దిపాటి మార్కులతో తప్పింది. ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని ఫాతిమాలో పెంచింది. 2017లో మళ్లీ ప్రిలిమ్స్ రాసింది. అనుకున్నట్టుగానే ఆమె మంచి మార్కులతో మెయిన్స్‌కు అర్హత సాధించింది. మెయిన్స్ రాసిన 20 రోజులకు ఫాతిమాకు పెండ్లయింది. 15 రోజుల తర్వాత సివిల్స్ ఇంటర్వ్యూ కబురు అందుకుంది. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు ప్రోత్సహించారు. ఫాతిమా ఇంటర్వ్యూకు హాజరైంది. మూడ్రోజుల తర్వాత తను ఫలితాలు అందుకుంది. 990 మంది అభ్యర్థులలో ఫాతిమా 810 ర్యాంకు సాధించింది. ఆమె కల నెరవేర్చుకుంది. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు మళ్లీ పరీక్షలు రాస్తానని ఫాతిమా అంటున్నది.

905
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles