మరో ప్రోటాను ప్రళయం?


Fri,October 18, 2019 01:12 AM

-వందేండ్లలో రానున్న సౌరతుపాను
-సాంకేతికతల విధ్వంసం తప్పదా?
-ఆన్‌లైన్‌ సమాచారానికి విఘాతమా?
మన భూమికి ప్రధాన ముప్పు
ఏ గ్రహశకలం నుంచో కాకుండా సూర్యునినుంచే రావచ్చునని, దీని నివారణ మన చేతుల్లో ఉండదని పరిశోధకులు అంటున్నారు.

protan

మన భూమికి ప్రధాన ముప్పు

ఏ గ్రహశకలం నుంచో కాకుండా సూర్యునినుంచే రావచ్చునని, దీని నివారణ మన చేతుల్లో ఉండదని పరిశోధకులు అంటున్నారు. ఆధునిక మానవుడి మేధోసంపదలైన ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ సాంకేతికతలను సర్వనాశనం చేయగల మరొక ‘ప్రోటాను ప్రళయం’ (proton storm) ప్రపంచానికి పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. సూర్యునిలో ఇలాంటి విధ్వంసకర తుపానులు సాధారణమే అయినా, ఇవి గతంలో అనుకొన్న దానికన్నా మరింత ఎక్కువగా తరచూ సంభవిస్తున్నట్టు వారు ఇటీవల గుర్తించారు. ఈ మేరకు క్రీ.శ. 8, 10, 19 శతాబ్దాలలో మూడు పర్యాయాలు ఇలాంటి భారీ అగ్నివర్షాలు ఇప్పటికే సంభవించాయని, ఇదే క్రమంలో నాలుగోది తలెత్తవచ్చునని వారు పేర్కొన్నారు. ఐతే, ఇది మరెంతో దూరంలో లేదని, వచ్చే వందేండ్లలోనే ఎదురుకావచ్చునని కూడా వారు సూచిస్తున్నారు. ఈ నిర్ధారణ నేపథ్యంలోని విశేషాలే ఇక్కడ చదువండి.

సుమారు 2,600 సంవత్సరాల కిందట సంభవించినట్టుగా భావిస్తున్న ఒక భారీ సౌరతుపానుకు చెందిన శాస్త్రీయ సాక్ష్యాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే రకమైన అంతరిక్ష వాతావరణ దృఘ్ఘటన అంతే భారీస్థాయిలో ఇప్పుడూ కలుగవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి గడచిన తాజా విపత్తు క్రీ.శ. 1859లో అమెరికాలో వెలుగుచూసింది. ఆ తర్వాతి నుంచీ మానవాళి పూర్తిగా విద్యుచ్ఛక్తిపైనే ఆధారపడుతున్నారు. ఒకవేళ మన కర్మకాలి అంతటి శక్తివంతమైన, భారీ సౌర ప్రళయమే కనుక మళ్లీ వస్తే ప్రపంచవ్యాప్త విధ్వంసం ఇంతా అంతా కాదు. మనిషి వైజ్ఞానిక ప్రగతి విద్యుచ్ఛక్తి దగ్గరే ఆగిపోకుండా, విద్యుత్‌కణం (ఎలక్ట్రానిక్స్‌)కు విస్తరించి, ఇందులో విప్లవాత్మక అభివృద్ధిని సాధించింది. ఇవాళ కంప్యూటర్‌, అంతర్జాల (ఇంటర్నెట్‌) సాంకేతికతలు అనేక దేశాల ప్రజల జీవన విధానానికి అత్యవసరమైనాయి. ఆర్థిక రంగం సైతం వీటిపైనే ఆధారపడి ఉన్నది. అనేక యాంత్రిక వ్యవస్థలు రోదసిలో భూమిచుట్టూ తిరుగాడుతున్న కృత్రిమ ఉపగ్రహాలపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. సూర్యుడు ప్రకోపించకూడదనే కోరుకొందాం. కానీ, కాలం ఎవరి చేతిలోనూ లేదు.

అంతరిక్షంలో ఏం జరుగుతున్నదీ ఖచ్చితంగా తెలుసుకొనే పరిస్థితి, అంతటి అద్భుత సాంకేతికతలను మానవులు ఇంకా సమకూర్చుకోలేదు. భూమిపైన వాతావరణమే మనకిప్పటికీ పెద్ద మిస్టరీగా ఉంటే, ఇక అంతరిక్షంలోని గ్రహాంతరాలలో, సూర్యుని ప్రభావిత శక్తుల నడుమ వాతావరణం అంచనాకైనా అందదు. ఈ నేపథ్యంలోనే స్వీడన్‌లోని పరిశోధకులకు గత సౌరతుపానులకు చెందిన బలమైన సాక్ష్యాధారాలు లభ్యమైనాయి. వీటి ఆధారంగానే సూర్యగోళంలో తరచూ విధ్వంసకర అగ్నిప్రకోపాలు తప్పవని వారు మానవాళిని హెచ్చరిస్తున్నారు. భూమికి పెనువిపత్తులంటూ ఏ గ్రహశకలాలతోనో కాకుండా సొంత కుటుంబ పెద్దయిన సూర్యుని నుంచే రానుందని తెలిశాక వారిలో ఒకింత ఆందోళన మొదలైంది. గతంలో వలె తీవ్రస్థాయి భీకర అగ్నివర్షం (Rain of Terror) పర్యవసానాలు ఊహిస్తేనే వారికి ఒళ్లు జల్లుమంటున్నది.

పారదర్శకత కోసమైతేనేం, సౌలభ్యానికైతేనేం చాలావరకు సాంకేతిక వ్యవస్థలన్నీ గత కొన్నేండ్లుగా ఆన్‌లైన్‌లోకే వచ్చేశాయి, ఇంకా వస్తున్నాయి. శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నట్టుగా తీవ్రస్థాయి ‘సౌర వికిరణ విపత్తు’ కనుక సంభవిస్తే భూమిపై ఊహింపశక్యం కాని మహోపద్రవం ఖాయమని ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. ఈ విధ్వంసం ఎప్పుడైనా, ఎంతటి స్థాయిలోనైనా జరగవచ్చునని వారంటున్నారు. ప్రస్తుత మన యాంత్రిక, సాంకేతికతలన్నింటికీ తీవ్ర విఘాతం కలుగడమే కాకుండా, బ్యాంకులలో నిక్షిప్తమై ఉన్న ఆర్థిక లావాదేవీల సమాచారమంతా మాయమై పోవడమో (blackouts) లేదా మూతపడి పోవడమో (shutdown) జరగవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మన సూర్యునిలోంచి అత్యంత తీవ్ర విద్యుదావేశిత కణాలు (CMEs: Coronal mass ejections) నిరంతరం విడుదలవుతూనే ఉంటాయి. వీటిలోంచి కొన్ని అత్యంత శక్తివంతమైనవి ఉండవచ్చు. అటువంటప్పుడు అవి మన వాతావరణ దుప్పటిని దాటుకొని భూవాతావరణంలోకి వస్తే మాత్రం పెను ప్రమాదమే ఎదురవుతుంది. అప్పుడు భూమిపై జీవ విఘాతం తప్పదు. ఈ రకమైన ‘ప్రళయాంతక అగ్నివర్షాన్నే’ వారు ‘ప్రోటాను తుపాను’ (Proton storm) గా పిలుస్తున్నారు. ఇది రోదసి వాతావరణంలోనే సంభవించినా భూమిని చేరితే, మానవజాతికి అత్యంత హానికరమని వారు అంటున్నారు.

అప్పుడు మన ‘పవర్‌ లైన్స్‌' విస్తృత అగ్నిప్రమాదాలకు లోనుకావచ్చునని వారన్నారు. 2012లో ఒక భారీస్థాయి ‘సీఎంఈ’ సౌరతుపాను ఎలక్ట్రానిక్స్‌ను నాశనం చేసే ప్రమాదం కేవలం తొమ్మిది రోజులలోనే ప్రాకృతికంగానే తప్పిపోయిందన్న సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దుర్ఘటన 1859 నాటి క్యారింగ్టన్‌ (Carrington) సంఘటనతో పోల్చదగిందని వారన్నారు. 1855-67 మధ్యకాలంలో సంభవించినట్టుగా చెబుతున్న ఆ భూమ్యయస్కాంత తుపానుకు మూలం శక్తివంతమైన ‘సీఎంఈ’ విస్ఫోటనమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆనాడు విద్యుత్‌ స్తంభాలు అంటుకొని, ఆపరేటర్లకు ఎలక్ట్రిక్‌ షాక్స్‌ తగిలాయని వారు చెప్పారు. ఈ స్థాయి తీవ్రతే కనుక మళ్లీ వస్తే సర్వవినాశనం తప్పదని కూడా వారు అంటున్నారు.

క్రీ.పూ. 660 ప్రాంతంలో సంభవించినట్టుగా భావిస్తున్న ప్రోటాను తుపానుతో పోల్చినప్పుడు 1859 నాటిది చిన్నదేనని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. జపాన్‌లోని పౌరాణిక విజ్ఞానంతోపాటు గ్రీన్‌ల్యాండ్‌ మంచుఫలకల కింద లభ్యమైన శాస్త్రీయ ఆధారాలనుబట్టి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. సుమారు 2,679 సంవత్సరాల కిందటి ఆ ఘోర ఉపద్రవాన్ని స్వీడన్‌లోని లండ్‌ (Lund) యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ప్రోటాన్‌ తుపాను సృష్టించే బెరిలియమ్‌-10, క్లోరిన్‌-36, కార్బన్‌-14 పరమాణువులను మంచుగర్భంలోనే కాకుండా వారు అంతకు ముందే వృక్షవలయాల్లోనూ కనుగొన్నారు. ప్రాచీన కాలంలో సంభవించినట్టుగా భావిస్తున్న ప్రోటాను ప్రళయాలకు శాస్త్రీయ ఆధారాలను వారు ఈ మేరకు గుర్తించారు. క్రీ.శ. 774-775, క్రీ.శ. 993-994 మధ్యకాలాలలోనూ ఈ తరహా విపత్తులు సంభవించినాయనడానికి కావలసిన సాక్ష్యాలను మరికొందరు శాస్త్రవేత్తలు అదే పరిశోధనా పద్ధతిలోనే గుర్తించారు. అయితే, 1956 నాటి ప్రోటాన్‌ తుపానును ఈ మూడింటి కంటే చిన్నస్థాయిదిగా వారు భావిస్తున్నారు.
- దోర్బల బాలశేఖరశర్మ

ఏం జరుగుతుంది?

వ్యోమనౌకలు, విమానాల్లోని ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను ప్రోటాను తుపాను సర్వనాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి అయస్కాంతావరణను ఢీకొన్న వెంటనే భూమిపైకి చేరుకొంటుంది. తర్వాత అది భూమ్యయస్కాంత తుపానుగా మారి, పవర్‌ గ్రిడ్స్‌ను విధ్వంసం చేస్తుంది. సుమారు వందేండ్లకు ఒకసారి చొప్పున అత్యంత తీవ్రస్థాయి ‘సీఎంఈ’ సౌరతుపాను భూమిదిశగా వస్తున్నదని, మరో వందేండ్లలో తర్వాతి విపత్తు రావచ్చునని వారు అంటున్నారు. ఐతే, అది ఏ క్షణంలోనైనా సంభవించవచ్చునని, దీనిని మన సాంకేతికతలు గుర్తిస్తాయన్న పూచీ (గ్యారెంటీ) ఏమీ లేదని ‘యు.ఎస్‌. జియాలజికల్‌ సర్వే’ పరిశోధకులు తెలిపారు. 1921లో ఈశాన్య అమెరికా సంయుక్త రాష్ర్టాలను అంధకారంలో ముంచెత్తిన ‘న్యూయార్క్‌ రెయిల్‌రోడ్‌ స్టార్మ్‌' తీవ్రతను కూలంకశంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశారు. ఆ తరహా వినాశకర విపత్తు సమీప భవిష్యత్తులోనే తిరిగి రావచ్చునని, ఇది అనివార్యమనీ అన్నారు.

రక్షణ ఏర్పాట్లు ఎక్కడ?

సుమారు 3,000 సంవత్సరాల కాలం సూర్యునికి అత్యల్పమే. అక్కడ విస్ఫోటనాలూ సహజమే. అయితే, ఇవి ‘మరింత అధికంగా సర్వసాధారణమని’ ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించడమే విశేషం. ఏ విస్ఫోటనం, ఎంత పరిమాణంలో, ఎంత శక్తివంతంగా సంభవిస్తుందన్నది తెలుసుకోవడానికి మరింత లోతైన, ఖచ్చితమైన పరిశోధనలు అవసరం. అవి మానవ నాగరికతలపై ఏ మేరకు ప్రభావం చూపగలవన్నదీ ఇదమిద్ధంగా శాస్త్రవేత్తలకు ప్రస్తుతానికి తెలియదు. ఈ మేరకు రక్షణ ఏర్పాట్లయితే లేనే లేవు. గతంలో ఇంత సాంకేతికత లేదు కాబట్టి, విపత్తుల నష్టాలు ఎక్కువగా లేకపోవచ్చు. కానీ, ఇప్పుడు అలా కాదు. ట్రిలియన్స్‌ డాలర్ల విలువ చేసే వినాశనాలు తప్పవు. తేరుకొన్నాక, తిరిగి అన్నింటినీ రూపొందించుకోవడం మరో పెద్ద సమస్య కాగలదు. కాబట్టి, కనీసం అలాంటి ప్రళయాలు ఎప్పుడు, ఏ స్థాయిలో సంభవించబోతున్నదీ మనం ముందుగానే తెలుసుకోగలిగితే ఎంతో కొంత నష్టనివారణ చేసుకోగలమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles