ప్రజలకు సైన్స్‌ అందుతున్నదా?


Fri,October 18, 2019 01:11 AM

వరుసగా వాస్తవాలను చెప్పినంత మాత్రాన అది సైన్స్‌ కాదు. వాటి మధ్యగల పరస్పర సంబంధం చెప్పాలి. వాటికి మనతోగల అనుబంధాన్ని చెప్పాలి. అప్పుడే సైన్స్‌ మనకు పనికి వచ్చేదిగా కనిపిస్తుంది.
Vignanam
‘తెలుగు పాఠకులు సైన్సు చదువుతున్నారా?’ అన్నది పెద్ద ప్రశ్న. నిజంగా పాతకాలం నాటి వార్తాపత్రికలను సంపాదించి చూస్తే అందులోకూడా అక్కడక్కడ ఒక సైన్స్‌ వ్యాసం కనబడుతుంది. ఇవాళటి పత్రికలలో అంతగా సైన్స్‌ కనిపించక పోవచ్చు. ‘తెలుగులో సైన్స్‌ చదవడం ఎందుకు?’ అని మీరు అడగవచ్చు, నేను దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ‘సైన్స్‌ చదువుతున్నారా’ అంటే ‘మా పిల్లలు చదువుతున్నారు’ అని పెద్దవాళ్లు చాలామంది జవాబు చెప్తారు. పిల్లలు పరీక్షల కోసం సైన్స్‌ చదువుతారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే రకం సైన్స్‌ వాళ్లకు చెప్పరు. చెప్పేవాళ్లకుకూడా ఆ దృష్టి లేదు. ఇంతకూ ‘సైన్స్‌ అంటే మన గురించే’ అన్న భావన చాలామందికి లేదు.


మనకు సైన్స్‌ పేరున తెలుస్తున్న విషయాలలోనూ ఈ రకమైన సూచనలు కనిపించవు. కనుకనే, సైన్స్‌ అంటే ఇదేదో మనకు అవసరం లేని విషయంగా మిగిలిపోతున్నది. మనిషికి తాను మనిషిని అన్న అవగాహన కూడా లేనినాడు, చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించడం మొదలైంది. అవసరం కొద్దీ ఏవో పరికరాలను తయారుచేయడం మొదలుపెట్టాడు. ఈ పద్ధతిలో కొనసాగిన సైన్స్‌ ఇవాళ అందరికీ అందని స్థాయికి ఎదిగింది. పత్రికల్లో కనిపించే సైన్స్‌లో బోలెడంత సమాచారం ఉంటుంది. అది ఒక రకంగా సామాన్యులకు అర్థం కాదు. ఇంకా అదంతా మనకు అవసరం లేదనిపిస్తుంది. మహా అయితే ఆశ్చర్యకరంగానూ ఉండవచ్చు. అలాగని, మొత్తం సైన్స్‌ ఆశ్చర్యకరంగా ఉండాలన్న నియమమూ లేదు.

సైన్స్‌లో ఉండేది చాలా మామూలు వాస్తవం. అయితే, అది మనం తెలుసుకున్నందువల్ల ప్రయోజనం వెంటనే కనిపించక పోవచ్చు. సైన్స్‌ అంటే సత్యాలను తెలుసుకోవడం. ఈ మాట నేనే కాదు. చాలామంది చెబుతూ వస్తున్నారు. తెలుసుకున్న సత్యాలు మన జీవితంలో భాగాలని ముందు మనకు అర్థం కావాలి. ఉదా॥కు సూర్యుడినుంచి మన దగ్గరికి ఉన్న దూరం గురించి మీకు చెబితే ఆ విషయానికి మనకు సంబంధం కనిపించదు. సూర్యుడు అన్నాను. డు ము వు లు ప్రథమా విభక్తి. ఈ లెక్కన సూర్యుడు అంటే మగవాడు. కనుకనే, నా వ్యాసాలలో సూర్యుడి గురించి చెప్పవలసిన చోట సూర్యగోళం అంటాను. సూర్యగోళం నుంచి మన మధ్యన ఉన్న దూరం ప్రభావం మన బతుకుల మీద ఉన్నది. ఆ దూరం అంతే ఉండక పోతే, మన భూగోళం మీద, నీటిఆవిరి, నీరు, మంచు ఒకేసారి దొరికే అవకాశం ఉండేది కాదు. ‘ఈ సంగతి ఇప్పటి వరకు ఎవరైనా మనకు చెప్పారా?’ అన్నది ప్రశ్న. బడిలో కూడా బహుశా చెప్పకపోతే ఆశ్చర్యం లేదు.

సూర్యుని గురించి మనం ఎన్నో కధలు విన్నాం. సైన్స్‌లో మాత్రం అదే పేరు వాడుతూ మరేవో సంగతులు చెబుతారు. అక్కడ తికమక మొదలవుతుంది. సైన్స్‌ చెప్పే తీరు చెప్పే వారినిబట్టి మారుతుంది. ఒక రంగంలో పనిచేస్తున్న వారు ఆ రంగానికి గొప్ప పేరు తేవాలని మామూలు విషయాలనుకూడా గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. సైన్స్‌ అంటే వాస్తవాల వరుస. వరుసగా వాస్తవాలను చెప్పినంత మాత్రాన అది సైన్స్‌ కాదు. వాటి మధ్యగల పరస్పర సంబంధం చెప్పాలి. వాటికి మనతోగల అనుబంధాన్ని చెప్పాలి. అప్పుడే సైన్స్‌ మనకు పనికి వచ్చేదిగా కనిపిస్తుంది. ప్రపంచంలోని సైన్స్‌ మొత్తం మనకు పనికి రావాలని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. కొన్ని విషయాలు అవసరం కనుక తెలుసుకోవాలి. వాటి ఆధారంగా మరెన్నో విషయాలు తెలుస్తాయి. అవి బహుశా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి.

యుద్ధాల కోసం పరిశోధన మొదలు పెట్టి, కళ్ళజోళ్ళు కనుక్కున్నారంటే అది ఆశ్చర్యం కాదు. యుద్ధాల కోసం పరిశోధనలు మొదలు పెట్టి, కీటక నాశన రసాయనాలు అంటే పురుగు మందులు కనుగొన్నారు. సైన్స్‌ సమాచారం చెప్పే పద్ధతి ఒక రకంగా మంచిదే. అలాగే, సైన్స్‌ తత్వం గురించి చెప్పిన పద్ధతి మరింత మంచిది. తత్వం గురించి చెప్పాలంటే రాసే వారికి చక్కని అవగాహన ఉండాలి. పరిశోధకులు, శాస్త్రజ్ఞులకు రాయడం చేత కాదు. కనీసం వాళ్ళు అలా అనుకుంటారు. చేతనైన వారు రాయరు. వాళ్లకు రాయడానికి సమయం లేదు. మరి, మంచి సైన్స్‌ ప్రజలదాకా వచ్చే పద్ధతి ఏమిటి?
(సశేషం)

- డా॥ కె.బి.గోపాలం, సెల్‌: 9849062055

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles