ఆ స్ఫూర్తికి సలామ్‌!


Fri,October 18, 2019 01:11 AM

భారతరత్న, మన దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ జయంతి (అక్టోబర్‌ 15)ని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా ఇటీవలె జరుపుకొన్నాం. ఈ సందర్భంగా వారి వ్యక్తిత్వంపై చిన్న ప్రస్తావన.
Shaastreeyam


* మానవజాతికి సైన్సు (విజ్ఞానశాస్త్రం) ఒక అందమైన బహుమతి. మనం దానిని వక్రీకరించకూడదు.
- ఏపీజే అబ్దుల్‌ కలామ్‌
భారత మాజీ రాష్ట్రపతి, ఏరోస్పేస్‌ శాస్త్రవేత్త
జయంతి: 15 అక్టోబర్‌
జీవితకాలం: 1931-2015


స్వాతంత్య్రానంతర ఆధునిక భారతావనిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజానీకాన్ని ప్రభావితులను చేయగలిగిన అతికొద్దిమంది మహానుభావులలో డా॥ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ (జీవితకాలం: 1931-2015) ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రజల రాష్ట్రపతి’గా పేరెన్నికగన్న వారి జయంతిని ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’ (World Students Day) గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి 2010లోనే నిర్ణయించింది. ఈ మేరకు నాటినుంచీ ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకొంటున్నారు. ప్రత్యేకించి మన దేశంలో వారి జయంతిని ‘జాతీయ విద్యార్థుల దినోత్సవం’ (National Students Day)గా కూడా పాటిద్దామన్న డిమాండ్‌కూడా ఇటీవల వినబడుతున్నది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా ఆచరణలోకి తెస్తే అంత మంచిది. ఇంతేకాదు, ఒక భారతీయుడిగా ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తిని ఎంతవరకు కొనసాగిస్తున్నామన్నది కూడా అందరం ఈ సందర్భంగా ఆలోచించుకోగలగాలి.

మన దేశంలో బాపూజీ తర్వాత అంతటి నిజాయితీ, నిరాడంబరత, శాంతి, మతసామరస్యాలతో కూడిన జీవన విలువలకు కట్టుబడిన వ్యక్తిగా అబ్దుల్‌ కలామ్‌ పేరెన్నిక గన్నారు. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను పొందిన కొద్దిమంది రాష్ట్రపతులలో వీరొకరు. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన కులమతాలకు అతీతంగా సర్వమానవ శ్రేయస్సు కోసం తపించిన తీరు అనిర్వచనీయం. తనకు ముగ్గురు (కన్నతల్లి, ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి, మదర్‌ థెరిసా) అమ్మలు అంటే ఎంతో ఇష్టమని చెప్పడం ద్వారానే ఆయనలోని సమున్నత వ్యక్తిత్వం ఆవిష్కారమవుతుంది. వారు జీవించినంత కాలం ప్రపంచానికి ముఖ్యంగా యువతరానికి అనంతమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నారు. వారిలోని మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవడానికి ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌' (ఒక విజేత ఆత్మకథ) పుస్తకం ఒక్కటి చదివితే సరిపోతుంది. ఒక సామాన్యుని నుంచి శాస్త్రవేత్తగా అబ్దుల్‌ కలామ్‌ ఎదిగి వచ్చిన తీరు అసాధారణం.

అంతరిక్ష శాస్త్రవేత్తగా, మన దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విజ్ఞానశాస్త్ర పరిశోధనా సంస్థల (డిఆర్‌డీఓ, ఇస్రో) నిర్వాహకుడుగా, ‘భారతీయ క్షిపణి మానవుడు’ (Missile Man of India) గానూ.. ఇన్ని రకాలుగా ఆయన సల్పిన కృషి అంతా ఒక ఎత్తయితే, అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అధిష్టించిన తర్వాత కూడా మానవీయతకే పెద్దపీట వేయడం, మరీ ముఖ్యంగా విద్యార్థులకు పాఠాలు చెప్పడంలోనే అనిర్వచనీయ తృప్తిని పొందగలిగిన వారి ఉదాత్త వ్యక్తిత్వం ఒక్కటీ మరో ఎత్తుగా అభివర్ణించాల్సిందే. ఈ గొప్పతనానికి గుర్తింపుగానే ఐక్యరాజ్యసమితి (ఐరాస) వారి జయంతిని తొమ్మిదేండ్ల కిందట (2010) ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించిందనడంలో సందేహం లేదు.

179
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles