పరాశక్తి ముక్తి సందేశం


Sun,September 29, 2019 12:14 AM

parasakthi
అటు బతుకమ్మ పండుగ, ఇటు దేవీనరాత్రులు జరుగుతున్న వేళ ఇది. శక్త్యారాధనా సమయం. బతుకమ్మ పేరుతో గౌరమ్మ అయినా, శరన్నవరాత్రులలో దుర్గాదేవి అయినా పరాశక్తి స్వరూపాలే. నిజానికి ఏ అమ్మయినా ప్రేమస్వరూపిణి. కానీ, రాక్షస సంహారంతో ఉగ్రరూపం దాల్చే అమ్మవారిని శాంతస్వరూపిణి వలె పూజించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే, చాలామంది వేదపండితులు దేవీనవరాత్రులలో అమ్మవారి అర్చనపట్ల అత్యంత నియమనిష్ఠలతో ఉంటారు. పూజలు చేసేవారూ అంతటి భక్తిశ్రద్ధలను కలిగిఉన్నప్పుడే ఫలితం లభిస్తుందని వారంటారు. అత్యంత దుర్భరమైన పరాశక్తి కటాక్షాన్ని పొందే సులభతరమైన మార్గాలను ఈ సందర్భంగా తెలుసుకొందాం.


నిద్రాణంగా ఉన్న మనలోని శక్తులను ఉద్భుదం చేసే శక్తి దసరా పండుగకున్నది. మనం శక్తిమంతులం కావడానికే ఈ శక్త్యారాధన!

అనంతశక్తి ఒకటి ప్రపంచాన్ని నడిపిస్తున్నది. సృష్టి ఆవిర్భావానికి ఏ శక్తి అయితే కారణమో అదే శక్తికూడా విశ్వప్రళయానికీ కారణభూతమవుతుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ శక్తినే ఉపనిషత్తులు ‘పరాశక్తి’గా అభివర్ణించాయి. అదే ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా పలు రూపాలుగా సాక్షాత్కరిస్తుందని వేదవిద్వాంసులు అంటారు. నిజానికి ‘ఈ శక్తులన్నీ వేర్వేరా?’ అనే ప్రశ్న ఉదయించవచ్చు. ఏ శక్తికది వేర్వేరుగా కనిపించినా, అన్ని శక్తులూ కలిస్తేనే ఆ అనంత ‘శక్తి’ అవుతుంది. మరి, ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకోవడం మనలాంటి సామాన్యులకు సులభమేనా?

జగద్రక్షణకు కేవలం ఇచ్ఛాశక్తి మాత్రమే కాదు, జ్ఞాన, క్రియాశక్తులు మూడూ అవసరం. నిజానికి ‘పరాశక్తి’ జ్ఞానశక్తికి ప్రతిరూపం. ఆమె జ్ఞానస్వరూపిణి. అయితే, ‘ఆమెలో క్రియ ఉందా’ అంటే ‘ఉందనే’ చెప్పాలి. మరి, ఈ క్రియాశక్తి అనే మాటకు అర్థమేమిటి? దీన్నే మనం తెలుసుకోవాలి. ప్రకృతి అంతా ఒక జడపదార్థం. దీనినే ‘క్రియ’కు ప్రతిరూపంగా చెప్పాలి. విశ్వపదార్థం పరిణామం చెందడం వల్లనే మనకు కనిపించే ఈ క్రియాప్రపంచం ఉద్భవిస్తున్నది. అందుకే, వేద పండితులు ‘క్రియ కలిగిన ఈ ప్రపంచమంతా ఎవరి అధీనంలో ఉంటుందో అదే క్రియాశక్తి’ అన్నారు. ఈ విధంగా త్రివిధశక్తులతోకూడిన పరాశక్తి మనతోపాటు సమస్త విశ్వాన్నీ పరిపాలిస్తున్నది.

అన్ని ప్రాణులలోను, పంచభూతాలలోను, ఆఖరకు విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఈ పరాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి విద్వాంసులు వేదకాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అర్హులైన వారు ఆమెను సాక్షాత్కరింపజేసుకొంటున్నారు. కానీ, సామాన్యుల పరిస్థితి ఏమిటి? పరాశక్తి అందరికీ సులభంగా లభించాలంటే ఏం చేయాలి? ఇదే అసలు ప్రశ్న. పరాశక్తినే మనం ‘దుర్గ’గా భావిస్తున్నాం. ఎవరిని చేరటానికి కష్టమో ఆమె పేరే ‘దుర్గ’. ఆమె అన్నివేళలా ఆరాధింపదగింది. తనను శబ్దం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. వేదమంత్రాలు, స్తోత్రగ్రంథాలు దీనికి ఉపకరిస్తాయి. అలాగే, ఆమెను ధ్యానం ద్వారానూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇందుకు యోగాభ్యాసం తోడ్పడుతుంది. ఆమెను సమాధిస్థితిలో సైతం దర్శింపవచ్చు. ఇది ఏకాగ్రతతో కూడిన తపస్సువల్ల సిద్ధిస్తుంది.

‘సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే/ భయోభ్యస్ర్తాహి నోదేవి దుర్గేదేవి నమోస్తుతే’ ॥ అన్నది దుర్గాస్తోత్రం. జగత్తు అంతటా వ్యాపించి, లోకాలన్నింటికీ ఏలికయై, అనంతశక్తి సమన్వితయై, ప్రాణికోటికి భయం లేకుండా చేసే దుర్గాదేవి మనందరికీ నమస్కరింపదగింది, ఉపాసింపదగింది. జ్ఞానశక్తిని, క్షాత్రశక్తిని, తపోశక్తిని పొందాలనుకున్న వారు ఈ అమ్మవారిని విధిగా ఆశ్రయించక తప్పదు. జ్ఞానశక్తి అందితే దానిద్వారా ఏకంగా ముక్తినే సాధించవచ్చు. క్షాత్రశక్తిని సమీకరించుకొంటే అమ్మవారితోపాటు దేశాన్నికూడా రక్షించుకోవచ్చు. అదెలా అన్నది ఇక్కడ ఆసక్తికరం.

దుర్గాస్తుతి, దుర్గోపాసన మానవాళికి గొప్పగా ఉపయోగపడతాయి. ఇంకా, జ్ఞానశక్తిని ఆశ్రయించి దుర్గను ఉపాసిస్తే పారమార్థికంగా మోక్షం లభిస్తుంది. క్షాత్రశక్తిని ఆశ్రయించి దుర్గాదేవిని స్తుతిస్తే మనతోపాటు దేశమూ ఆ తల్లి రక్షణను పొందుతుంది. ‘య: ఆత్మదా బలదాయస్య విశ్వఉపాసతే’ అన్నది శాస్త్రం. అన్ని బలాలను ఇచ్చి, మనందరినీ అద్భుతంగా ఆదుకొనేది ఆ అనంత శక్తి సమన్వితురాలైన అమ్మవారు మాత్రమే. అందుకే, మనం ఆమెనే ఉపాసించాలి. అన్ని బలాలలోకెల్లా క్షాత్రబలం ఉన్నతమైంది. అది లేకపోతే, రాజు లేడు. రాజ్యం లేదు. ఫలితంగా ప్రజలూ ఉండరు. రాజు ప్రజలను శత్రువులనుంచి రక్షించి కన్నబిడ్డల వలె పరిపాలించాలంటే దుర్గాదేవిని ఉపాసించవలసిందే. ఏది చేరడానికి కష్టమైందో అదే దుర్గం. భౌతికంగా శత్రుదుర్భేద్యంగా దుర్గాన్ని నిర్మించుకొన్నప్పుడే దేశానికి రక్షణ లభిస్తుంది. దుర్గతోనే దుర్గానికి, అందలి రాజ్యానికి, ప్రజలకు, పాలకులకు అందరికీ రక్షణ. అందుకే, ప్రతీ ఏడాది విజయదశమి (దసరా) వేళ మనం దుర్గాదేవి ఆరాధనను తొమ్మిది రోజుల ఉత్సవం (నవరాత్రులు)గా జరుపుకొంటున్నాం. ఈ నేపథ్యంలో విజయదశమిని ఒక విధంగా క్షత్రియుల పండుగ అనాలి. క్షాత్రశక్తి ఉపాసనగానూ ఇది ప్రసిద్ధమైంది.

‘ధనుర్దుర్గం మహీదుర్గం అబ్దుర్గం వార్‌క్షమేవనా/ నృ దుర్గం గిరిదుర్గం వా సమాశ్రత్య వసేత్పురమ్‌' ॥ - క్షాత్రశక్తి నిరూపితం కావాలంటే దుర్గాల నిర్మాణం అత్యంత పటిష్ఠంగా ఉండాలి. పూర్వం మన రాజులు కోటలు నిర్మించుకొనే వారు. అవి సామాన్యులకు దుర్గమాలు. శత్రువులు ప్రవేశింప వీలుగాని విధంగా ధనుష్పాణులైన వీరులతోకూడిన దుర్గం, మట్టితో నిర్మితమైన దుర్గం, జలంతో చుట్టబడిన దుర్గం, నాలుగువైపుల వనాలతోకూడిన దుర్గం, అన్నివైపుల సేనలు నిలువ గలిగిన దుర్గం, చుట్టూ పర్వతాలు గలిగిన దుర్గం, మొదలైన వాటిమధ్య కోటను నిర్మించి, అందులో నగరాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఆనాటి పాలకులు ఎంతటి బలవంతులో తెలుస్తున్నది. ప్రజలకు దుర్గాదేవి ఉపాసనవల్ల ఈ సంసారం నుండి విజయం సిద్ధించినట్లే, పాలకులు దుర్గాలను పటిష్ఠంగా నిర్మించుకొని, ప్రజలకు రక్షణ కలిగించి, శత్రువులపై దండెత్తి విజయం పొందవచ్చు. యుద్ధానికి వెళ్లేముందు తొమ్మిది రోజులు క్రమం తప్పక దుర్గాదేవిని పూజించేవారు. ఇందులోని రహస్యం ఆయా దుర్గాలను శత్రు నిర్భేద్యంగా చేసుకోవడమే. అకస్మాత్తుగా యుద్ధానికి వెళ్లకుండా, మొదట దుర్గాన్ని పటిష్ఠం చేసుకుంటే, విజయం వరిస్తుందన్న సందేశం దుర్గానవరాత్రుల వల్ల లోకానికి అందింది.

క్షాత్రశక్తిని పెంచుకొని, తద్వార దేశాన్ని రక్షించుకోవాలనే ఉపదేశాన్నిచ్చే ‘విజయదశమి’. ఈ నేపథ్యంలోనే ఆయుధపూజకు సంకేతంగానూ నిలుస్తున్నది. ఇలా ఆవిర్భవించినవే శక్త్యారాధనా పద్దతులు. అమ్మవారి చేతిలోని శూలం అందుకు ఒక ఉదాహరణ. భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం దేశస్థులలో క్షాత్రశక్తిని పెంచడానికే కాని, కేవలం పూజలకోసం కాదు. నిద్రాణంగా ఉన్న మనలోని శక్తులను ఉద్భుదం చేసే శక్తి దసరా పండుగకున్నది. మనం శక్తిమంతులం కావడానికే ఈ శక్త్యారాధన! ఆబాలగోపాలం కొత్తబట్టలు ధరించి నూతనోత్సాహాన్ని పొందినట్లే, దసరా పండుగనాడు బుద్ధిబలంతోపాటు భుజబలాన్ని కూడా సంపాదించుకొని అన్ని రంగాలలో మనం విజయులం అవుదాం.
parasakthi1

ఇదీ నవరాత్రుల పరమార్థం

దశకంఠుడైన రావణున్ని సంహరించిన శ్రీరామునికి విజయదశమి పండుగకు సంబంధం ఉంది. శ్రీరాముని విజయం నుండే ఈ పండుగ ప్రారంభమైందని పౌరాణిక చరిత్ర చెబుతున్నది. శ్రీరాముడు దశశిరస్సులుగల రావణున్ని సంహరించి అధర్మం మీద విజయాన్ని సాధించాడు. కనుకనే, ఈ పండుగ ‘విజయదశమి’ అయింది. మరి, ‘దుర్గాదేవికి, నవరాత్రుల పూజకు సంబంధమేమిటి’ అనే సందేహం కలుగవచ్చు. క్షత్రియులు దుర్గాన్ని అభేద్యంగా నిర్మించుకొని, శత్రువులమీద దండయాత్ర చేసేవారు. అట్లా చేసినప్పుడే వారికి విజయం సంప్రాప్తిస్తుందన్నది విశ్వాసం. ఈ క్షత్రియధర్మమే ఇందులోని పరమార్థం! ఇదే పరమార్థాన్ని ఈ కాలానికి విజయసంకేతంగానూ వర్తింపజేసుకోవచ్చు.

ఆచార్య మసన చెన్నప్ప
సెల్‌: 98856 54381

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles