ఓనం విందు!


Thu,September 5, 2019 01:17 AM

ONAM
కేరళీయుల అతిపెద్ద పండుగ ఓనం.. మలయాళీలందరూ భక్తి, శ్రద్ధలతో జరుపుకొనేపండుగ.. తెలుగువారికి ఉగాది ఎలాగో.. మలయాళీలకు ఓనం అలాగ.. పది రోజుల పాటు జరిపే ఈ పండుగకు.. సంగీత, నృత్య రూపకాలు ప్రధాన ఆకర్షణయితే..
అక్కడి స్పెషల్ వంటకాలు అందరినీ కట్టి పడేస్తాయి.. అందుకే ఈ పండుగ సందర్భంగా.. కేరళ స్పెషల్ వంటకాలు మీ కోసం ఇస్తున్నాం..


మిక్స్‌డ్ వెజిటేబుల్ కుట్టు

Mixed-vegetable-koottu-curr

కావాల్సినవి :

బీట్‌రూట్ : 1 (చిన్నది)
ఆలుగడ్డ : 2
క్యారెట్ : 1
బీన్స్ : 6
పసుపు : 3/4టీస్పూన్
కారం : 3/4 టీస్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
నల్ల శనగలు : ఒక కప్పు
కొబ్బరితురుము : 1 1/2 కప్పులు
జీలకర్ర : అర టీస్పూన్
మిరియాలు : అర టీస్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
గరం మసాలా పొడి : 3/4టీస్పూన్
బెల్లం తురుము : పావు టీస్పూన్
కొబ్బరి నూనె : ఒక టేబుల్‌స్పూన్
ఆవాలు : 3/4 టీస్పూన్
ఎండుమిర్చి : 2, ఉల్లిగడ్డలు : 6(చిన్నవి)
ఉప్పు : తగినంత

తయారీ :

ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టి పెట్టుకోవాలి. ఒక కప్పు కొబ్బరితురుము తీసుకొని అందులో జీలకర్ర, మిరియాలు వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చిన్న గిన్నె పెట్టి అందులో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పసుపు, కారం, కరివేపాకు, ఉప్పు వేసి కప్పున్నర నీళ్లు పోసి మూత పెట్టేయాలి. పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో బీట్‌రూట్ ముక్కలు, నానబెట్టిన శనగలు కలిపి రెండు నిమిషాలు ఉడుకనివ్వాలి. ఇందులో ముందుగా చేసిన కొబ్బరి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపాలి. దీన్ని రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఇప్పుడు చిన్న కడాయి పెట్టి కొబ్బరి నూనె పోసి ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ పోపులోనే కొబ్బరితురుము వేసి బాగా వేగాక ముందు చేసి పెట్టిన కర్రీలో వేసి కలుపాలి. పది నిమిథషాల పాటు కూరని కదిలించకుండా ఉంచాలి. ఆ తర్వాత అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు.

ఓలన్

olan-recipe

కావాల్సినవి :

అలసందలు : అర కప్పు ,బూడిద గుమ్మడికాయ ముక్కలు : 3 కప్పులు, పచ్చిమిర్చి : 3, కొబ్బరి పాలు : పావు కప్పు, కరివేపాకు : రెండు రెమ్మలు, కొబ్బరి నూనె : ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు : తగినంత

తయారీ :

కుక్కర్‌లో అలసందలు వేసి కడిగి.. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కనీసం 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. వీటిలో నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బూడిద గుమ్మడి కాయల్లో రెండు కప్పుల నీళ్లు పోసి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడికించాలి. ముక్కలు కాస్త ఉడికాక.. అందులో అలసందలు వేసి కలుపాలి. పది నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కొబ్బరి పాలు, కరివేపాకు వేసి మరికాసేపు సన్నని మంట మీద ఉంచాలి. చివరలో కొబ్బరి నూనె వేసి దించేయాలి. టేస్టీ ఓలన్ రెడీ!

పులిస్సెరీ

pulissery

కావాల్సినవి :

పెరుగు : ఒక కప్పు, దోసకాయ ముక్కలు : ఒక కప్పు, వెల్లుల్లి పాయలు : 2, చిన్న ఉల్లిగడ్డలు : 2, పసుపు : అర టీస్పూన్, కొబ్బరి తురుము : అర కప్పు, జీలకర్ర : అర టీస్పూన్, పచ్చిమిర్చి : 2, కారం : పావు టీస్పూన్, ఎండుమిర్చి : 2, మెంతులు : పావు టీస్పూన్, ఆవాలు : అర టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, కొబ్బరి నూనె : 2 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

కొబ్బరి తురుము, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో దోసకాయ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. పావుగంట తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. వేరే కడాయిలో కొబ్బరి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కలుపాలి. దీంట్లోనే కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి పోపు పెట్టాలి. దీన్ని దోసకాయ మిశ్రమంలో వేసి కలుపాలి. రెండు నిమిషాలు దాన్ని వేడి చేసి దించేస్తే సరి. సూపర్ కర్రీ మీ ముందుంటుంది.

మాంబాజా పాయసం

Mango-Payasam

కావాల్సినవి :

మామిడి పండు : 1
బెల్లం తురుము : అర కప్పు
ఎండు అల్లం పొడి : అర టీస్పూన్
యాలకుల పొడి : ఒక టీస్పూన్
బియ్యం : పావు కప్పు
పాలు : 2 లీటర్లు, జీడిపప్పులు : 10
కిస్మిస్ : 10,
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్

తయారీ :

మామిడి పండు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మిక్సీలో వేసి, కొన్ని పాలు, బెల్లం, యాలకుల పొడి, ఎండు అల్లం పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని మిగిలిన పాలు పోసి వేడి చేయాలి. ఈ లోపు బియ్యం కడిగి కాసేపు నానబెట్టాలి. ఈ బియ్యాన్ని మరుగుతున్న పాలల్లో వేసి ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత దీంట్లో మామిడిపండు గుజ్జును వేసి కలుపుతుండాలి. సన్నని మంట మీద పది నిమిషాల పాటు అడుగు అంటకుండా కలుపాలి. పక్కన చిన్న కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. పాయసంలో వేసి కలిపి రెండు నిమిషాలాగి దించేయాలి. దీన్ని వేడిగా కానీ, ఫ్రిజ్‌లో పెట్టుకొని కాసేపు ఆగి తిన్నా యమ టేస్టీగా ఉంటుంది.

అవియల్

avial-recipe

కావాల్సినవి :

బూడిద గుమ్మడికాయ ముక్కలు : ఒక కప్పు, మంచి గుమ్మడికాయ ముక్కలు : ఒక కప్పు, ములక్కాడ ముక్కలు : ఒక కప్పు, పుల్లగంద ముక్కలు : ఒక కప్పు, అరటికాయ : 1, బీన్స్ : అర కప్పు, మంగళూర్ కుకుంబర్ : 1 (చిన్నది), కొబ్బరితురుము : ఒక కప్పు, పచ్చిమిర్చి : 3, జీలకర్ర : ఒక టీస్పూన్, పెరుగు : ఒక కప్పు, కరివేపాకు : 2 రెమ్మలు, కొబ్బరినూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

కూరగాయలన్నింటినీ బాగా కడుగాలి. అన్నింటినీ ఒకే రకంగా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటికాయను మాత్రం కట్ చేసి నీళ్లలో వేసి పెట్టుకోవాలి. అలా చేస్తే అవి నల్లగా కాకుండా ఉంటాయి. పెరుగును బాగా గిలక్కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని కూరగాయలన్నింటినీ, బీన్స్‌తో సహా వేసి కొద్దిగా పసుపు, ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. సన్నని మంట మీద దాదాపు సగం ఉడికే వరకు అలాగే ఉంచాలి. ఒకవేళ నీళ్లు ఆవిరైపోతుంటే.. మధ్యలో కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. మూత పెట్టి మళ్లీ పూర్తిగా ఉడికేవరకు ఉంచాలి. కాసేపటి తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత పెరుగు వేసి మరో రెండు నిమిషాలు కలుపాలి. చివరగా కొబ్బరి నూనె, కరివేపాకు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. అన్నం, సాంబార్‌తోపాటు ఈ కూర వడ్డించుకుంటే యమ టేస్టీగా ఉంటుంది.

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles