బాబుకు ఏ ఆట మంచిది?


Thu,September 5, 2019 01:06 AM

మా బాబు వయస్సు పన్నెండేండ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. స్పోర్ట్స్ అంటే చాలా పిచ్చి. చాలా రకాల ఆటలు తరచుగా ఆడుతూ ఉంటాడు. కాకపోతే, తరచుగా గాయపడుతూ ఉంటాడు. సాధారణంగా కండరాల గాయాలతోనూ, స్పోర్ట్స్ ఇంజురీస్ తోనూ, నొప్పులతోనూ బాధపడుతూ ఉంటాడు. ఈ క్రీడా గాయాలను నిరోధించలేమా? మా అబ్బాయి ఏ క్రీడలో రాణించగలడో చెప్పగలరా?
- పి. సుధాకర్ రావు, హబ్సిగూడ

webDCFADHD
సాధారణ క్రీడా, వ్యాయామ గాయాలను నిరోధించడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. అయితే చాలా సందర్భాల్లో గాయపడకుండా జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంటుంది. చేపట్టిన క్రీడ, చేస్తున్న వ్యాయామానికి తగిన విధంగా సంసిద్ధులం కాకపోవడం వల్ల గాయాలను కొనితెచ్చుకొన్నవాళ్లం అవుతుంటాం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా సాధన వల్ల దానికి సంబంధించి నైపుణ్యం పెరిగి గాయాలకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. ప్రతీ వ్యాయామం, ఆట ముందస్తు సన్నద్ధత (వార్మింగ్ అప్)తోనే మొదలవ్వాలి. దానివల్ల కండరాలకు రక్తం సరఫరా పెరుగుతుంది. కండరాలు శ్రమకు సిద్ధం అవుతాయి. గాయపడే ప్రమాదం తక్కువ అవుతుంది. కండరాలపై అధిక భారం మోపటం వల్ల కలిగే గాయాలను కొద్దిపాటి జాగ్రత్తతో నిరోధించవచ్చు.

దాదాపు గంటసేపు ఆడకుండా హఠాత్తుగా మైదానంలోకి వచ్చి బంతిని కొట్టేందుకు పూనుకోవద్దు. పర్వతారోహణ, పరుగు లేదా టీమ్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు అందుకు ఉపయోగించే కండరాలను సన్నద్ధం చేస్తూ కొద్దివారాల పాటు ముందస్తు శిక్షణ పొందాలి. అలసిపోయినట్టు గుర్తించిన తరువాత వ్యాయామం నిలిపివేయాలి. ఆట నుంచి తప్పుకోవాలి. కొంత విరామం తరువాత మళ్లీ ఆడవచ్చు. మరోరోజు వ్యాయామాన్ని కొనసాగించవచ్చు.
అదేవిధంగా ఒక క్రీడను ఎంచుకు ముందు వ్యక్తి శరీర పరిస్థితి దానికి తగినదేనా కాదా అని క్లినికల్ టెస్టుల ద్వారా వైద్య నిపుణులు నిర్ధారించి చెప్పగలరు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆయా క్రీడల్లో రాణిస్తారో సూచించగలరు. కొత్తగా వ్యాయామం ప్రారంభించేవారికి ఏ రకమైనవి మంచివో చెప్తారు. ఆస్తమా, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారికి కొత్తగా వ్యాయామం ప్రారంభించేందుకు ఈ విధమైన పరీక్షలు, సూచనలు చాలా అవసరం.

డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం
సీనియర్ ఆర్థోపెడిక్,
జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్,
స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్,యశోద హాస్పిటల్స్,హైదరాబాద్

245
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles