తియ్యని బంధం!


Thu,August 15, 2019 01:19 AM

Raakhii
అన్నా.. చెల్లెలి అనుబంధం.. అక్కా.. తమ్ముడి మమకారం.. ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు.. ఒక కడుపున పుట్టకపోయినా కూడా.. మనకు తారసపడే అన్నాతమ్ముళ్లెందరో.. వారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఈ వేడుక రోజున రాఖీ కట్టడమే కాదు.. ఒకరికొకరు నోరు తీపి చేసుకోవాలి.. అందుకే ఈ వారం స్పెషల్‌గా కొన్ని స్వీట్స్‌ని మోసుకొచ్చాం.. ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటూ.. మీ తోబట్టువులకు తీపిని పంచండి..

మిల్క్ మైసూర్ పాక్

milk-mysorepak

కావాల్సినవి :

చక్కెర : 400 గ్రా., మిల్క్ పౌడర్ : 100 గ్రా., మైదా : 50 గ్రా., నెయ్యి : 100 గ్రా., నట్స్ : గార్నిష్ కొరకు

తయారీ :

నెయ్యి, మిల్క్‌పౌడర్, మైదాను కలిపి పెట్టుకోవాలి. కడాయిలో నీరు పోసి చక్కెర వేయాలి. పాకం తీగలా వచ్చేలా తయారు చేసుకోవాలి. దానిలో నెయ్యి, మిల్క్ పౌడర్, మైదా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మైదా కలర్ మారే వరకూ కలుపాలి. ఈ మిశ్రమాన్ని ట్రేలో వేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారక ముందే వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన నట్స్‌తో అలంకరించుకొని సర్వ్ చేసుకుంటే రుచితో పాటు కలర్‌ఫుల్‌గానూ ఉంటుంది.

ఐస్‌క్రీమ్ బర్ఫీ

icecream-barfi

కావాల్సినవి :

చక్కెర : 250 గ్రా., పిస్తా : 20 గ్రా., మిల్క్ పౌడర్ : 100 గ్రా., నెయ్యి : 50 గ్రా.

తయారీ :

మైదా, నెయ్యి, మిల్క్ పౌడర్ కలిపి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని చక్కెర రెండు తీగల పాకం చేసుకోవాలి. అందులో మైదా, నెయ్యి, మిల్క్ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని వేసి దించేయాలి. మిశ్రమం బాగా దగ్గర పడేవరకు కలుపాలి. ఆ తర్వాత ఒక పెద్ద ప్లేట్ మీద నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. దీన్ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని తరిగిన పిస్తాతో అలంకరించుకోవాలి. అంతే.. టేస్టీ ఐస్‌క్రీమ్ బర్ఫీ రెడీ!

కోవా గుజియా

kova-gujia

కావాల్సినవి :

కోవా : 150 గ్రా.
నెయ్యి : 50 గ్రా.
చక్కెర : 200 గ్రా.
తినే సోడా : 2 గ్రా.
మైదా : 250 గ్రా.
నూనె : తగినంత.

తయారీ :

మైదా, నెయ్యి, తినే సోడా, నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకొని గంటపాటు పక్కన పెట్టుకోవాలి. చక్కెర రెండు తీగల పాకం పట్టుకోవాలి. మైదాను చిన్న ఉండలు చేసుకొని వాటిని ఒత్తుకోవాలి. కోవా ఫిల్లింగ్ పెట్టుకొని గుండ్రంగా చుట్టుకోవాలి. కావాలనుకున్నవాళ్లు సగం చంద్రుడు ఆకారంలో కూడా చుట్టుకోవచ్చు. కడాయిలో నూనె పోసి ఉండలను దోరగా వేయించుకోవాలి. వీటిని చక్కెర పాకంలో రెండు నిమిషాలు నానబెట్టి తీసివేయాలి. తయారయిన దాన్ని బాదం, పిస్తాలలో అలంకరించుకోవాలి.

బ్రెడ్ రస్‌మలాయ్ రబ్డీ

bread-rasmalayi-rabdi

కావాల్సినవి :

బ్రెడ్ ముక్కలు : 4, పాలు : 500 మి.లీ., యాలకుల పొడి : అర టీస్పూన్, బాదం : 10 గ్రా., పిస్తా : 10 గ్రా.
మిల్క్‌మెయిడ్ : 50 మి.లీ., చక్కెర : 50 గ్రా., నూనె : తగినంత

తయారీ :

బ్రెడ్ ముక్కల మీద కొన్ని పాలు చిలుకరించి వాటిని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. బ్రెడ్ ఉండల మధ్యలో తరిగిన బాదం, పిస్తా పెట్టి మళ్ళీ రోల్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. సన్నని సెగపై రోల్స్‌ను దోరగా వేయించి చల్లారనివ్వాలి. మందపాటి గిన్నెలో మిగిలిన పాలు పోసి చిక్కపడే వరకూ మరిగించాలి. అందులో చక్కెర, మిల్క్‌మెయిడ్ వేసి బాగా మరిగించి యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించిన బ్రెడ్ రోల్స్‌ను మరిగిన పాలలో వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చల్లారనిచ్చి ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచాలి. బాదం, పిస్తాలతో అలంకరించుకొని సర్వ్ చేయాలి.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles