విశ్వసనీయ వాగ్దానం.. రక్షాబంధనం


Thu,August 15, 2019 01:17 AM

సహృదయం సాంమనస్యమవిద్వేషం కృణోమివః!
అన్యో ఉద్యమభిహర్యత వత్సం జాతిమివాధ్న్యా!!

rakhi--2
మంచి మనుషులుగా, మానవత్వం ఉట్టిపడే వ్యక్తులుగా మిమ్మల్ని రూపొందించాను. మానవ జీవితాల్ని అర్థవంతం చేసుకోండని మనుషులను ఆశీర్వదిస్తూనే మనుర్భవ మనుషులు కండని లోకాన్ని జాగృత పరుస్తుంది వేదవాజ్ఞయం.
మన నమ్మకాలే మన ఆలోచనలు మన ఆలోచనలే మన మాటలు. మన మాటలే మన చేతలు. మన చేతలే మన అలవాట్లు. మన అలవాట్లే మన విలువలు. మన విలువలే మన జీవితం. రక్షాబంధనం భారతీయత నీడలో పెల్లుబికిన నైతిక విలువల వారసత్వానికి ఆలంబనై నిలిచింది. వ్యక్తి కేవలం కుటుంబంలోని ఆడపిల్లలకు రక్షణనివ్వడంతో పాటు వ్యవస్థకు ఆసరా ఇచ్చే స్థాయికి ఎదగాలనే విశ్వశ్రేయస్సును ధ్వనింపజేస్తున్నది రక్షాబంధనం. ప్రపంచం మనుగడ ముందుకు సాగుతుంటే మనిషి వ్యక్తిత్వం, మానవత్వం మరుగున పడుతాయి. అమానుషత్వాన్ని రూపుమాపే రామరక్ష కావాలి రక్షాబంధనం. సంప్రదాయాలూ, విలువలూ మనిషికి ఎప్పుడూ ఒకే విధంగా దిశానిర్దేశం చేస్తాయి. ప్రపంచం, సమాజం ఎప్పుడూ మనిషి వెన్నంటి ఉంటాయి. మనం ప్రపంచానికి బాధ్యతాయుత భరోసాను ఇవ్వగలగడమే మనుషులుగా ప్రథమ కర్తవ్యం.

మంచి మనుషులుగా, మానవత్వం ఉట్టిపడే వ్యక్తులుగా మిమ్మల్ని రూపొందించాను. మానవ జీవితాల్ని అర్థవంతం చేసుకోండని మనుషులను ఆశీర్వదిస్తూనే మనుర్భవ మనుషులు కండని లోకాన్ని జాగృత పరుస్తుంది వేదవాజ్ఞయం.

విశ్వసనీయ వాగ్దానంగా భావించే రక్షాబంధనం రక్తసంబంధానికి మాత్రమే కాదు మానవీయ బంధాలకూ ప్రతీకగా నిలవాలి. త్యాగం, ప్రేమ, అనుబంధం, ఆదరణ, ఆప్యాయత, ఆలోచనలనే విలువల వారధి కావాలి. సంస్కృతీ పరంపరలో అనాదిగా వస్తున్న రక్షాబంధన వేడుక సహృదయతకు చిహ్నం. సహృదయత విశ్వశాంతినీ, సమరస భావనలనూ పెంపొందిస్తుంది. కల్మషం లేని మనుషుల భావతోరణం రక్షాబంధనమై నిలిస్తే సమాజంలోని అరాచక, అమానుష, అనిశ్చితి క్రియలను కార్యరూపం దాల్చకుండా చేస్తుంది. స్త్రీజాతి నిశ్చింతగా నిలబడగలుగుతుంది. బలం బలహీనతకు అభయం అవ్వాలి. కానీ భయం అవ్వకూడదు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు రక్షా బంధనాన్ని ఒక్కసారి కట్టించుకుంటే ఆ సంవత్సరమంతా దుష్టశక్తుల భయాలుండవని.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అమానుష దుష్ట శక్తులన్నింటినీ సోదరులకు సోదరీమణులు కట్టే రాఖీ పారదోలాలని, ధైర్యంగా ప్రపంచం ముందుకు నడవాలనీ, మనుషులుగా మనుషులు తమపై విజయం సాధించాలనీ కోరుకోవాలి.
ప్రతీ ఆచరణ ఒక కొత్త ఆలోచనతోనే సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆడపిల్లని గౌరవిస్తే కేవలం స్త్రీ జాతికి భద్రతనిచ్చినట్లు కాదు. కుటుంబాలను రక్షించినట్లు! వేద విజ్ఞానం అయినా, పురాణ కథనం అయినా, సంప్రదాయ వారసత్వం అయినా, సంస్కృతీ పరంపర అయినా మనిషిని విలువలకు రూపంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షవంటిది. రక్షాబంధన వేడుకు కూడా మానవీయ విలువలను అనుబంధాలకు ప్రతీకగా, విశ్వసనీయతకు ఆలంబనగా, భద్రతకు ప్రతిరూపంగా పరిఢవిల్లాలని కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు.
- ఇట్టేడు అర్కనందనాదేవి.

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles