బతకడానికి ఒక ఆశ ఉంటే..


Thu,August 15, 2019 01:16 AM

తల్లిదండ్రులు లేని పిల్లలను సమాజం చిన్నచూపు చూస్తుంది. వారికి ఎలాంటి రిజర్వేషన్ కల్పించకుండా ప్రభుత్వం వారిని ఒంటరిగానే బతకాలంటూ హేళన చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రాష్ఠ్ర ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి అనాథలకు రిజర్వేషన్ కల్పించిందో మహిళ.
Amruta
గోవాకు చెందిన 24 ఏండ్ల అమృతా కార్వాండే అనాథాశ్రమంలో పెరిగింది. ఆమె బాధ్యతలు ఆశ్రమం పట్టించుకొనే గడువు కూడా తీరింది. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన అమృత ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? అనే అలోచనలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అంతలోనే ఓ వృద్ధ అంధ దంపతులు కంటపడ్డారు. వారు ఎవరిమీదా ఆధారపడకుండా బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిని చూసి జీవితంపై కొత్త ఆలోచనలు, ఊహలు మొదలయ్యాయి అమృతకు. ఫ్రెండ్ సలహాతో పుణేలోని మోడ్రన్ కాలేజ్‌కు ఐప్లె చేసింది. కాలేజ్ హాస్టల్‌లో చేరింది. రాత్రి కాలేజ్‌కు వెళ్లడం, పగలు చిన్న ఉద్యోగం చేసేది. చదువు పూర్తి అయిన తర్వాత 2017లో ఓపెన్ కేటగిరి కింద మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరై 100కు 39 మార్కులు సాధించింది. మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ఉన్నా అమృతకు ఎలాంటి కాల్ రాలేదు. దీనికి ప్రధాన కారణం, తల్లిదండ్రుల సర్టిఫికేట్ లేకపోవడం. దీన్నంతటితో వదులకుండా అనాథలందరినీ ఒకచోట చేర్చి పోరాడాలనుకున్నది. తహశీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందర్నీ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసింది. సాయం చేయడానికి వారికి ఎలాంటి అధికారం లేదని చెప్పారు. దీంతో అమృత అనాథ పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ర్టానికి ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సిఫారసు పంపింది. 2018లో అనాథల కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో 1 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆమె పోరాటం అలా వృథా కాకుండా ఎంతోమంది అనాథలకు ఆశ రూపం అయింది.

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles