టెన్నిస్‌లో సంచలనం సంజన


Wed,August 14, 2019 12:42 AM

లేడి పిల్లలా కదలికలు.. కళ్లు చెదిరే స్మాష్‌లు.. ప్రత్యర్థికి చెమటలు పట్టించేలాడ్రాప్‌షాట్‌లు.. అత్యధిక సమయం సర్వీస్‌ నిలుపుకొనే టెక్నిక్‌లు.. కొండంత ఆత్మస్థయిర్యాన్ని కూడగట్టుకుని ప్రతిసారి ఇదే చివరి ఆట అనుకుంటూవిజయాల్ని ఖాతాలో వేసుకుంటున్నది సంజన. ఆమె బ్యాట్‌ పట్టిందంటే చాలు.. టోర్నీ ఏదైనా టైటిల్‌ గెలువాల్సిందే.. ఆమె కోర్టులో దిగిందంటే చాలు మెడల్‌ మెడలో పడిపోవాల్సిందే.. ఆమె చేతుల్లో ఇంద్రజాలం.. ఆమె కళ్లల్లో ఎవరెస్టంత ఆత్మస్థయిర్యం చూస్తే ఎవరైనా ఔరా! అనాల్సిందే! హైదరాబాద్‌కు చెందిన సంజన టెన్నిస్‌లో రాణిస్తున్నది. ఆమె మనోగతమిది.
Sanjjanaa
ఊహ తెలియని వయసు.. ఆటలంటే అమితాసక్తి.. ప్రతి రోజు పేపర్లలో ఆటల పేజీలోని బొమ్మలు చూసేదా చిన్నారి. టీవీల్లో ఆటల కార్యక్రమాల్ని రెప్పవాల్చకుండా వీక్షించేది. బ్యాట్‌ పట్టుకుని వేగంగా వస్తున్న బాల్‌ను తిరిగి అదే వేగంతో కొట్టడం.. చుట్టూ గీతలున్న చిన్న కోర్టు.. ఆ చిన్నారికి భలే గమ్మత్తుగా అనిపించింది. అక్కడక్కడా పైకి ఎగరడం.. క్షణాల వ్యవధిలో అటూ ఇటూ జరగడం ఇవన్నీ ఆ చిన్నారికి టెన్నిస్‌పై ఆసక్తిని పెంచాయి. ఆ ఆసక్తికి తల్లిదండ్రులు, మరికొంతమంది ప్రోత్సా హం తోడవడంతో ఆమె టెన్నిస్‌ ప్రయాణం సాఫీగా సాగుతున్నది.


ఏడేండ్లప్పుడే టెన్నిస్‌..

సంజనకు ఏడేండ్లు ఉన్నప్పుడే టెన్నిస్‌పై ఆసక్తి కలిగింది. తమ ఇంటి సమీపంలో వేదాంత్‌ (వరుసకు అన్న అవుతాడు) ఉండేవాడు. అతడు టెన్నిస్‌ ఆడుతుండేవాడు. అలా సంజనకు టెన్నిస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. తనకూ టెన్నిస్‌ నేర్పించమని ఆమె తల్లిదండ్రులతో మారాం చేసింది. ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు (ASCI సంజయ్‌ అకాడమీలో) యం. సంజయ్‌ కుమార్‌తో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అప్పుడు సంజన రెండో తరగతి. ప్రతీ రోజు స్కూలుకు వెళ్లొచ్చాక టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేసేది. పాఠశాలకు సెలవు దొరికితే చాలు రోజంతా టెన్నిస్‌ ధ్యాసే. అలా ఎనిమిదో ఏటనే అండర్‌ 8 విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. 2013లో మొదటి టోర్నమెంట్‌లో విజయం సాధించాక ఆమెకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా అండర్‌ 10, 12, 14, 16 విభాగాల్లో ఇండియాలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇటీవల నిర్వహించిన అండర్‌ 18 ఇండియా లెవెల్‌ పోటీల్లో 13వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌, స్ట్రెంతనింగ్స్‌ విభాగాల్లో సింహాచలం నాయుడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఇల్లు అమ్మి..

సిరిమల్ల అజయ్‌కుమార్‌, వేద దీపిక దంపతుల కుమార్తె సంజన. ఆమె తల్లిదండ్రులు ప్రయివేటు ఉద్యోగం చేసేవారు. సంజనకు పదేళ్ల వయసు రాగానే ఆమె తల్లి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటలో వెన్నంటి నిలిచింది. వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్లు ఆడేందుకు సంజన వెళ్తే ఆమెకు తోడుగా వేద దీపిక వెళ్లేది. సంజన టోర్నమెంట్ల కోసం వేదదీపిక ఇతర రాష్ర్టాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో తల్లీ కూతుళ్లకు ప్రయాణం ఇబ్బంది కలిగించేది. అందుకని 2017లో అజయ్‌ కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కుటుంబ పోషణ భారం కావడంతో హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని అమ్మేశారు. కానీ తన కూతురు విజయ ప్రస్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని నిర్ణయించుకున్నారు. కానీ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం మానేయడంతో కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆర్థిక కష్టాలు వెంటాడాయి.
Sanjjanaa1

టీచర్లుగా మారిన తల్లిదండ్రులు

సంజన ఆటలో ఎంత ప్రతిభ చూపిస్తున్నదో అంతే ప్రతిభ చదువులోనూ చూపిస్తున్నది. రెగ్యులర్‌గా స్కూలుకు వెళ్లకపోయినా చదువులో రాణిస్తున్నది. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నది సంజన. ఆట కోసం పూర్తి సమయం కేటయిస్తుండడంతో స్కూలు కు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమెకు తల్లి, తండ్రి, అక్క ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల పాఠాలు చెబుతున్నారు. ఇంటినే పాఠశాలగా మార్చి పాఠాలు బోధిస్తున్నారు.

ఆపద్బాంధవులు!

సంజన టోర్నీలకు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణభారం ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు సంజనను ఆటకు దూరంగా ఉంచాలనుకున్నారు. ఆ సమయంలో సంజన ప్రతిభను గుర్తించిన యుగేంధర్‌ (సీఎండీ కార్వీ గ్రూప్‌) స్పాన్సర్‌గా నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ తర్వాత రెయిన్‌బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ కంచర్ల రమేశ్‌ స్పాన్సర్‌గా నిలిచి సంజన భవిష్యత్‌కు బాటలు వేశారు. వీరి ప్రోత్సాహంతో సంజన ఎన్నో టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధిస్తున్నది. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన ఏషియా ఓషియానా రాడ్‌ లివర్‌ జూనియర్‌ ఛాలెంజ్‌ కాంపిటీషన్‌లో ఇండియా నుంచి రిప్రజెంట్‌ చేసింది. ఇందులో సంజన నాలుగు సింగిల్స్‌, ఒక డబుల్స్‌ ఆడింది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా హాంకాంగ్‌పై విజయం సాధించింది. డబుల్స్‌లో సైతం హాంకాంగ్‌పై విజయం సాధించింది.

గ్రాండ్‌స్లామ్స్‌ ఆడాలి..

ప్రతి రోజు ఆరు గంటలు ఆట కోసం కష్టపడతాను. ప్రతి ఆటలో సర్వీస్‌ ఎక్కువ నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను. రోజుకు 400 నుంచి 600 బాల్స్‌ ఆడతాను. అమ్మానాన్నల కలలు నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. ఇప్పటి
వరకు అన్నింట్లో నంబర్‌వన్‌గా నిలిచాను. ఆటలో గెలువాలంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నా.. మానసికంగా అంతకు రెట్టింపు ఫిట్‌నెస్‌ అవసరం. నాకు ప్రోత్సాహాన్నిస్తున్న కంచర్ల రమేశ్‌సార్‌కు రుణపడి ఉంటాను. చిన్న వయసులో గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడాలనేది నా లక్ష్యం. సాధనతో నా గమ్యాన్ని చేరుకుంటాను.
- సంజన సిరిమల్ల, టెన్నిస్‌

క్రీడాకారిణి

సంజన ప్రధాన విజయాలివే..
-జూనియర్‌ ఫెడ్‌కప్‌ భారత జట్టుకు ఎంపిక (2019)
-ఖేలో ఇండియా అండర్‌-17 డబుల్స్‌లో కాంస్యం(2019)
-అండర్‌ 16 నేషనల్స్‌ టైటిల్‌
(2019, ముంబాయి)
-కోల్‌కతాలోని గ్రాస్‌ కోర్ట్స్‌లో రోడ్‌ టూ వింబుల్డన్‌ నేషనల్స్‌ టైటిల్‌ విజేత
-బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ జూనియర్‌ ఫెడ్‌కప్‌నకు సంజన ఇండియా నుంచి ప్రాతినిధ్యం.
-సింగపూర్‌లో జరిగిన వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఫ్యూచర్‌ స్టార్స్‌కు ఇండియా నుంచి ప్రాతినిధ్యం.
-ఐటీఎఫ్‌ మూడు గ్రేడ్‌ 5లో ఫైనలిస్ట్‌..
-లండన్‌లో జరిగిన రోడ్‌ టూ వింబుల్డన్‌ పోటీల్లో ఫైనలిస్ట్‌(2018)
-బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా ఓషియానో వరల్డ్‌ జూనియర్‌ కాంపిటీషన్‌కు ఇండియా నుంచి ప్రాతినిధ్యం.
-ఇప్పటివరకు అన్ని కేటగిరీల్లో 100కు పైగా టైటిల్స్‌ గెలుచుకుంది.
..?పడమటింటి రవికుమార్‌ నర్రె రాజేశ్‌

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles