అమ్మకు... కమ్మని పాయసాలు!


Thu,August 8, 2019 01:16 AM

Varalakshmi-Vratam
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే.. శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.. అంటూ.. ఆ వరలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తాం.. షడ్రసోపేత వంటకాలతో అమ్మకి నైవేద్యం సమర్పిస్తాం.. అందులో పాయసం అమ్మకు ప్రీతిగా పెడతాం..
ఈ వరలక్ష్మీ వ్రతానికి.. రకరకాల పాయసాలను చేసి పెట్టి.. ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి..


సేమియా పాయసం

Semiya-Payasam

కావాల్సినవి :

పాలు : అర లీటరు
సేమియా : ఒక కప్పు
సాబుదానా : 2 టేబుల్‌స్పూన్స్
చక్కెర : అర కప్పు
యాలకుల పొడి : ఒక టీస్పూన్
జీడిపప్పు : 10
కిస్మిస్ : 10
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2 : అదే కడాయిలో సేమియాని కూడా కాస్త వేయించి చల్లారనివ్వాలి. ఈలోపు పది నిమిషాలు సాబుదానాలో నీళ్లు పోసి నానబెట్టాలి.
స్టెప్ 3 : ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. మరుగుతున్న పాలల్లో చక్కెర వేసి కలుపాలి. దీంట్లోనే సాబుదానా, సేమియా వేసి కలుపాలి.
స్టెప్ 4 : బాగా చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసి కలుపాలి. దించేముందు వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి కలుపాలి. తియ్యని సేమియా పాయసం మీ నోరూరిస్తుంది.

శనగపప్పు పాయసం

chana-dal-kheer

కావాల్సినవి :

శనగపప్పు : అర కప్పు
సాబుదానా : 3/4 కప్పు
బెల్లం తురుము : ఒక కప్పు
పాలు : 2 కప్పులు
యాలకుల పొడి : అర టీస్పూన్
జీడిపప్పు : 10
కిస్మిస్ : 10
నెయ్యి : అర టేబుల్‌స్పూన్

తయారీ :

స్టెప్ 1 : శనగపప్పు అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచి తీయాలి. సాబుదానాలో కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉంచాలి.
స్టెప్ 2 : బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి వేయించి పక్కన పెట్టాలి. పాలు వేడి చేసి పక్కన పెట్టాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం నీళ్లు పోసి సన్నని మంట మీద పదినిమిషాలు మరగనివ్వాలి. ఇందులో ఉడికించిన శనగపప్పును వేసి కలుపాలి. ఐదు నిమిషాలు బాగా కలుపాలి.
స్టెప్ 4 : దీంట్లో పాలు పోసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి కలుపుతుండాలి. ఆ తర్వాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి కలిపి దించేయాలి. దీన్ని చల్లగా తింటే మరింత టేస్టీగా ఉంటుంది.

గోధుమ రవ్వ పాయసం

godhuma-rava-payasam

కావాల్సినవి :

గోధుమ రవ్వ : అర కప్పు
పాలు : అర కప్పు
బెల్లం :1 3/4 కప్పులు
జీడిపప్పులు : 8
కిస్మిస్ : 10
యాలకుల పొడి : అర టీస్పూన్

తయారీ :

స్టెప్ 1 : గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. దీంట్లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మరిగిన తర్వాత దించేయాలి.
స్టెప్ 2 : కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను సన్నని మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో వేయించిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలిపి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడుకనివ్వాలి.
స్టెప్ 4 : ఇందులో పాలు, బెల్లం మిశ్రమాన్ని పోసి మూత పెట్టకుండా కలుపాలి. ఇలా పావుగంట పాటు ఉడుకనివ్వాలి. దీంట్లో జీడిపప్పు, కిస్మిస్‌లతో గార్నిష్ చేసి దించేయాలి. టేస్టీ గోధుమరవ్వ పాయసం రెడీ!

క్యారెట్ పాయసం

carrot-kheer

కావాల్సినవి :

పాలు : 2 1/2 కప్పులు
క్యారెట్ తురుము : ఒక కప్పు
చక్కెర : 4 టేబుల్‌స్పూన్స్
యాలకుల పొడి : అర టీస్పూన్
కుంకుమపువ్వు : చిటికెడు
జీడిపప్పులు : 7
కిస్మిస్ : 10
నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టాలి. కుంకుమ పువ్వును ఒక గిన్నెలో వేసి పాలు పోసి ఉంచుకోవాలి.
స్టెప్ 2 : ఇదే గిన్నెలో క్యారెట్ తురుము వేసి సన్నని మంట మీద పది నిమిషాల పాటు వేయించాలి. ఇందులో పాలు పోసి సన్నని మంట మీద ఉడికించాలి.
స్టెప్ 3 : పదిహేను నిమిషాల పాటు కలిపిన తర్వాత చక్కెర వేయాలి. అలాగే పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపాలి.
స్టెప్ 4 : ఇప్పుడు కుంకుమ పువ్వును తీసేసి ఆ పాలను ఈ క్యారెట్ పాయసంలో పోసి కలుపాలి. చివరగా జీడిపప్పు, కిస్మిస్ లతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

అటుకుల పాయసం

atukula-payasam

కావాల్సినవి :

అటుకులు : అర కప్పు
కొబ్బరి పాలు : 2 1/2 కప్పులు
బెల్లం : అర కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్
జీడిపప్పులు : 15
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్
గసగసాలు : అర టేబుల్‌స్పూన్
కొబ్బరితురుము : 1 1/2 టేబుల్‌స్పూన్స్
పాలు :5 టేబుల్‌స్పూన్స్

తయారీ :

స్టెప్ 1 : నీళ్లను వేడి చేసి అందులో బెల్లం వేసి పెట్టుకోవాలి. పాలల్లో కాసేపు గసగసాలు, కొబ్బరి తురుము, 5 జీడిపప్పులను నానబెట్టి వాటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అటుకులను వేయించి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో గసగసాల పేస్ట్‌లో కొన్ని నీళ్లు పోసి వేయించాలి. ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద అలాగే ఉంచాలి.
స్టెప్ 3 : ఇందులో బెల్లం నీళ్లను పోసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. దీంట్లో అటుకులను వేసి కలుపాలి. రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు పోసి పది నిమిషాల పాటు ఉడుకనివ్వాలి.
స్టెప్ 4 : దీంట్లో యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి కలిపి దించేయాలి. దీన్ని వేడిగా కంటే చల్లగా తింటే మరింత టేస్టీగా ఉంటుంది.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles