సరికొత్త ఉద్యానవనాలు


Thu,August 8, 2019 01:15 AM

హైదరాబాద్‌ అనగానే అద్దాలమేడలే కాదు, అందమైన ఉద్యాన వనాలు, ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఉరుకుల పరుకుల నగర జీవితాలకు ప్రశాంతత, ఆనందంతోపాటు ఆరోగ్యాన్నిస్తూ పరవశింపచేస్తున్నాయి అర్బన్‌ పార్కులు. ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తూ పులకరింప చేస్తున్నాయి. అడవులను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘జంగల్‌ బచావో-జంగల్‌ బడావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటు జనాలకు మానసికోల్లాసం అందించేందుకు మరిన్ని పార్కులను
ఏర్పాటు చేసేందుకు ్ర పభుత్వం సిద్ధమవుతున్నది.

park
రాష్ట్ర జనాభాలో మూడోవంతుపైగా హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో ప్రధానంగా నగర శివార్లలోనే అత్యధికంగా 50కి పైగా అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. విశ్వనగరంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలున్న నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అర్బన్‌ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుండడంతో ఇప్పటికే ప్రారంభించిన పలు అర్బన్‌ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో వాకింగ్‌ ట్రాక్‌లు, కానోఫి వాక్‌లు, పాత్‌వేలు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు.

ఆరోగ్య సంజీవని వనం


KVR
‘ఆరోగ్య సంజీవని వనం’ పేరుతో అర్బన్‌ పార్కును ర్పాటు చేశారు. ఎల్బీనగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, తుర్కయంజాల్‌, నాదర్‌గుల్‌, మన్నెగూడ పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడేలా గుర్రంగూడ రిజర్వు ఫారెస్ట్‌లో అర్బన్‌ పార్కును అటవీ శాఖ అభివృద్ధి పరిచింది. ఈ పార్కులో వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లతోపాటు కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్‌ స్పాట్‌, అక్కడేవనభోజనాలు చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతులు అందిస్తున్నారు. పిల్లలకు సాహస క్రీడలు, రాశివనం, నక్షత్రవనం ఉన్నాయి. తక్కువ ప్రాంతంలో ఎక్కువ పచ్చదనం పెంచే మియావాకి పద్ధతిలో మొక్కలను ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు.


ఆరోగ్యవనం

నాగారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 75 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదాన్ని పంచేందుకు ఇది సిద్ధమవుతున్నది. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో ఉన్న అటవీ భూమిలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నాలుగు కిలోమీటర్ల వరకు ఔషధ మొక్కలు,వాకింగ్‌ ట్రాక్‌, వాటర్‌ ఫాల్స్‌, యోగా మందిరంతోపాటు కొండపై గాజీబో నిర్మాణాలను చేపట్టారు. మరికొన్ని రోజుల్లో ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానున్నది.

కండ్లకోయ ఆక్సీజన్‌ పార్కు


par
రిజర్వ్‌ ఫారెస్టులో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘ఆక్సీజన్‌ పార్కు’ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. యాంత్రిక జీవనానికి దూరంగా.. విషవాయువుల జాడలేని స్వచ్ఛమైన గాలిని అందించేలా దీనిని నిర్మించారు. ఇక్కడ పలురకాల పూలు, పండ్ల చెట్లతోపాటు ఔషధ గుణాలు కలిగిన అరుదైన మొక్కలున్నాయి. చిన్నపాటి కుంటలు, వివిధ రకాల పక్షుల కిలకిల రావాలు ఇక్కడ సందడి చేస్తుంటాయి. మర్రిచెట్టు కింద రచ్చబండ సెట్‌, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌, చిన్నారుల క్రీడామైదానం, వాచ్‌టవర్‌ వంటివి ఎంతో ఆకర్షిస్తున్నాయి.

సరికొత్త థీమ్‌ పార్కులు

గ్రేటర్‌ పరిధిలో రూ.120 కోట్లతో 47 పార్కులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు ఎకరానికిపైగా విస్త్రీర్ణమున్న ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే అందుకోసం 47 స్థలాలను గుర్తించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ ప్రాముఖ్యం తెలిపే పార్కులను జోన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేయడం, చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, ఇంకుడుగుంతల నిర్మాణం, వ్యర్థాల తరలింపు కేంద్రాల నిర్వహణ, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిరిగి ఉపయోగించడం, డంపింగ్‌యార్డు ఆధునికీకరణ పనులను ఇతర స్వచ్ఛ కార్యక్రమాలను ప్రతిబింబించే దృశ్యాలు, రూపకాలతో సరికొత్త థీమ్‌ పార్కులను ప్రవేశపెట్టనున్నారు.

పంచతంత్ర పార్కు


park1
శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లి జర్నలిస్ట్‌ కాలనీలో చిన్నారుల కోసం ‘పంచతంత్ర థీమ్‌తో ప్రత్యేకంగా పార్కు ఏర్పాటు చేశారు. రూ. 50 లక్షలు ఖర్చుతో దీనిని వినూత్నంగా తీర్చిదిద్దారు. ఇందులో పంచతంత్ర నీతి కథలు, చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్‌ పెయింటింగ్స్‌, ఇతర క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. మొసలి, కోతి, ఏనుగు వంటి పిల్లల కథలు చెప్పేందుకు ఆరు అంశాల్లో బొమ్మలున్నాయి. బొమ్మల్లో ఉండే ఆడియో విధానం ద్వారా మీట నొక్కగానే సంబంధిత అంశానికి చెందిన కథను బొమ్మ వినిపిస్తుంది.

కుక్కల పార్కు


dogpark
కొండాపూర్‌లో కుక్కల కోసం ప్రత్యేకంగా పార్కు ఏర్పాటు చేశారు. 1.35 ఎకరాల స్థలంలో డాగ్‌ పార్కును అభివృద్ధి చేశారు. రూ. కోటి వ్యయంతో కుక్కలు, మనుషులు నడిచేవిధంగా వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మించారు. ఈ పార్కులో పెంపుడు కుక్కలను ఆడించేందుకు వీలుగా సౌకర్యాలున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ డాగ్‌ పార్కు అందుబాటులో ఉంటుంది. శునకాల కోసం ఈత కొలను, వ్యాయామ, ఆహారశాల, ముస్తాబు కేంద్రం వంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.
...? పసుపులేటి వెంకటేశ్వరరావు

509
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles