మహ జ్ఞానదీపం


Fri,July 12, 2019 01:10 AM

సిద్ధ పురుషుడు, వైదిక సంస్కృతికి పట్టుకొమ్మ వ్యాసభగవానుని జీవిత విశేషాలు
అసత్తు నుండి సత్తులోకి, తమస్సు నుండి వెలుగులోకి, మృత్యుముఖం నుండి మోక్షానికి తీసుకొని వెళ్లేవాడే అసలైన గురువు. సనాతన గురుపరంపరకు శ్రీకారం చుట్టినవాడు భగవాన్ వేదవ్యాసుడు. అందుకే, గురుపూర్ణిమనే మనం వ్యాసపూర్ణిమగానూ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహాను భావుని జీవిత విశేషాలు తెలుసుకొందాం.
vyasa-bhagavan
నీళ్లలోని ఆయన కాళ్లమీది చర్మాన్ని, మాంసాన్ని చేపలు ఇతర జలచరాలు తినేశాయి! కేవలం ఎముకలే మిగిలాయి!! ఆర్నెల్ల తర్వాత నర్మదా మాత ఆయనకు దర్శనం ఇచ్చింది. మనకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులైతే, జ్ఞానంతో ఇదే శరీరంలో పునర్జన్మ నిచ్చేవారు గురువులు. గురువు లేని విద్య గుడ్డి విద్య కదా. గురువే సమస్త విద్యలకు వారధి. జ్ఞాన విజ్ఞానాలకు పెన్నిధి. తమ సంతానానికి కీడు తలపెట్టని వారు తల్లిదండ్రులైనట్లే, శిష్యుల అభివృద్ధిని నిరోధించని వారే నిజమైన గురువులు. వారు జ్ఞాన శరీర ప్రదాతలు. పోషణ, రక్షణ తల్లిదండ్రుల నుంచి లభిస్తే.. క్రమశిక్షణ, విద్యా కౌశల్యం, కళానైపుణ్యాలు గురువుల వల్లనే సంప్రాప్తిస్తాయి. గురువే లేకుంటే ఈ లోకం అంధకారమయ్యేది. జ్ఞానమే వెలుగు. మనల్ని అజ్ఞానమనే అంధకారం నుంచి బయట పడవేసే జ్ఞానదీపం గురువే. గురువు జ్ఞానానికి పూర్వరూపమని, శిష్యుడు ఉత్తర రూపమని, గురుశిష్యుల బంధం లోక కల్యాణ కారకమని, గురూపదేశం లోకానికే శిరోధార్యమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. వశిష్ఠుని మునిమనవడుగా, శక్తికి మనవడిగా, పరాశరునికి పుత్రునిగా, శుకునికి తండ్రిగా ప్రసిద్ధి చెందిన వ్యాసుడు గురువులకే మహాగురువు.

వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం/ పరాశరాత్మజం వందేశుకతాతం తపోనిధిం అన్నది సంస్కృత మూలాధారం. వ్యాసుడు సత్యవతీ-పరాశరులకు జన్మించాడు. సత్యవతీ కుమారుడు కనుక సాత్యవతేయుడని, పరాశరుని వల్ల పుట్టాడు కాబట్టి, పారాశర్యుడని కూడా ఆయన్ని పిలుస్తాం. కృష్ణ అనే పేరుగల ద్వీపంలో జన్మించడం వల్ల కృష్ణ ద్వైపాయనుడు అని కూడా ఆయనకు పేరు వచ్చింది. అంతేకాక, వేదార్థం తెలిసి, వైదిక సంస్కృతికి పట్టుకొమ్మగానూ ఆయన నిలిచాడు. నాలుగు వేదాలను నాలుగు దిక్కులకూ ప్రసరింపజేశాడు. దీనివల్లే తాను వేదవ్యాసుడు అయినాడు. ఇంతేకాదు, వ్యాసుడు సిద్ధ పురుషుడు. పుట్టుకతోనే అత్యంత ప్రతిభావంతుడు. కనుకనే, ఎంతో గొప్ప వాజ్మయాన్ని సృష్టించగలిగాడు. పురాణ వాజ్మయకర్తగా, భారత-భాగవతాది గ్రంథాల సృష్టికర్తగా, అన్నింటికీ మించి దర్శనగ్రంథాలలో తలమానికమైన వేదాంత దర్శనానికి రూపశిల్పిగా వ్యాసుడు లోకప్రసిద్ధుడు.

ఇవన్నీ ఒక ఎత్తయితే వేదాంత దర్శనానికి రూపశిల్పి కావడం మరో ఎత్తు. వ్యాసుడు చారిత్రిక పురుషుడు కూడా. ప్రత్యక్షంగా కౌరవ పాండవులకు బంధువూ అవుతాడు. భారతగాథలోని పలు కీలక సన్నివేశాలలో అప్పుడప్పుడు ఆయన మనకు చాలా గొప్పగా తారసపడతాడు. అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న వేళ. వ్యాసుడు నేరుగా వారి దగ్గరకు వెళ్లి ధైర్యం చెబుతాడు. ఇదే సమయంలో అర్జునునికి పాశుపతాస్త్ర ప్రాప్తికై ఉపాయాన్ని బోధిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా కూడా ఆయన మనకు దర్శనమిస్తాడు. వ్యాసుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అంశా స్వరూపమే. ఇందుకు సాక్ష్యం శ్రీ కృష్ణుని నోట వచ్చిన గీతాబోధ. ఇది వారిలోని ఆధ్యాత్మిక పటిమకు ఒక గొప్ప ఉదాహరణ.

vyasa-bhagavan2
వ్యాసుడు మొట్టమొదట జయ అనే పేరుతో మహాభారతాన్ని 8,800 శ్లోకాలతో రచించాడు. తర్వాత 24,000 శ్లోకాలకు, తదనంతరం లక్ష శ్లోకాలకు పెరిగి, ఇవాళ ఇంతటి మహాభారతమైంది. నారాయణం నమస్కృత్య/ నరం చైవ నరోత్తమమ్/ దేవీం సరస్వతీం వ్యాసం/ తతో జయ ముదీరయేత్ అన్న శ్లోకాన్నిబట్టి జయనామం వెల్లడవుతున్నది. దీనిని శిష్యులు పైల, సుమంత, జైమిని, వైశంపాయనులకు, తన కుమారుడైన శుకునికి ఆయన బోధించాడు. వారు దాన్ని అంతటా వ్యాపింపజేశారు.

విశేషించి వ్యాసుడు ఉత్తర మీమాంసను రచించి దార్శనికుడుగా ప్రసిద్ధిగాంచాడు. పూర్వ మీమాంసను రచించిన జైమిని, వ్యాసుని శిష్యుడు కావడం విశేషం. ఆ ఉత్తర మీమాంసకే బ్రహ్మసూత్రాలు అని పేరు. అద్వైతమత ప్రవక్త శంకరులు, వ్యాసుడు రచించిన భారతాంతర్గత భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను గ్రహించి, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని తనదైన మహాభాష్యాన్ని అందించాడు. అది శంకరభాష్యంగా ప్రసిద్ధిగాంచింది.

ఇలా ఆదినుండి గురుపరంపరకు ఆద్యుడై, భారతీయ ఆధ్యాత్మిక ప్రగతికి పెట్టనికోటగా నిలిచిన వ్యాసుని పేరుతో గురుపూర్ణిమ విశేష ప్రాశస్త్యాన్ని సంతరించుకొంది. గురుపూర్ణిమ గురుశిష్య బంధాన్ని, వైదిక సాంస్కృతిక వైభవాన్ని, ప్రాచీన గురుపరంపరను మనకు గుర్తుచేస్తున్నది. వేదాలపట్ల అనంతమైన గౌరవాన్ని పెంచుతున్నది. వ్యాసుడు మంత్రద్రష్ట కూడా. ఋషి కాకపోతే కవి కాలేడన్న వాక్యానికి ఆయనే చక్క ని నిదర్శనం. భారతేతిహాసాన్ని రచించడం వల్ల తాను కవిగా మారాడు. మహాభారతం ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వ గ్రంథం.

మంచిచెడ్డల మధ్య జరిగే సంఘర్షణలకు ప్రతిరూపమే ఇది. అందులో ఉన్నది సమస్త మానవజాతి కథ. వ్యాసుని లోకజ్ఞతకు భారతగాథ అద్దం పడుతున్నది. ఋషియైన కవి ఎలా ఉండాలో, సమాజానికి ఉపదేశించగలిగిన గురుస్థానమేమిటో ఈ గ్రంథం నిరూపిస్తున్నది. మహాభారతం కేవలం ఉపదేశం మాత్రమే చేయదు. ఆహ్లాదాన్నిస్తుంది. కళ్లల్లో నీరు నింపుతుంది. మరీమరీ ఆలోచింపజేస్తుంది. ఆత్మోన్నతిని కలిగిస్తుంది. అన్నింటినీ మించి మనల్ని నీతివంతులైన మానవులుగా తీర్చిదిద్దగలిగిన అద్భుత గ్రంథం అది.

ఒక్కమాటలో చెప్పాలంటే, మానవజాతి సమస్తం వ్యాసునికి ఋణపడి ఉంది. ఆయన ప్రసాదించిన జ్ఞానం అక్షయపాత్ర. శిష్యుడు తనకు విద్యామృతాన్ని ధారపోసే గురువును తల్లిగాను, తండ్రిగాను భావించాలని భారతగాథ ప్రబోధిస్తున్నది. విద్యార్థుల ముఖాలనుండి వెలువడే ప్రతిమాట వెనుక, చేసే ప్రతిపని వెనుక చదువు చెప్పిన గురువే ఉన్నాడన్న విషయం మరవరాదు. గురుపూర్ణిమ భారతీయ సంస్కృతిలోని విశిష్ఠమైన గురుస్థానాన్ని తెలియజేస్తుంది. గురువు ఎల్లవేళలా ఆరాధ్యుడన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది.

గురువే బ్రహ్మకు ప్రతిరూపమని, బ్రహ్మనుంచి వేదం ఏ విధంగా లోకంలోకి వచ్చిందో, గురువువల్లనే జ్ఞానం మానవాళికి అందుతుందని గురుపూర్ణిమ మహత్తరమైన సందేశాన్ని ఇస్తున్నది. సంతానాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులెంతో కష్టపడతారు. అందుకు తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి పిల్లలకు నూరేళ్లయినా సరిపోవు. గురువుల విషయంలోను ఇదే గుర్తుపెట్టుకుంటే గురుపూర్ణిమ సార్థకమైనట్లే.

vyasa-bhagavan3

ఆద్యంతాలు లేనివాడే ఆదిగురువు!

గురూనాం గురు: గురువులకే గురువు ఈశ్వరుడు. మనకు ప్రథమగురువు పరమేశ్వరుడే. పూర్వే షామపి గురు:/ వచ్ఛే దాత్ (యోగ. 1-26). ఒకప్పుడుండి, మరొకప్పుడు లేనివాడై ఉండక, అన్ని కాలాల్లో ఆద్యంతాలు లేనివాడై వేద ప్రకాశకులైన పూర్వఋషులకు గురువైనవాడు పరమేశ్వరుడే. అందుకే, ఆయన ముఖం నుండి వెలువడిన వేదాలను శ్రవణ మననాదుల ద్వారా మనం గ్రహించి మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం.
a-chennappa

1101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles