క్రిస్పీగా.. టేస్టీగా..!


Thu,May 23, 2019 12:29 AM

mokka-jonna
పచ్చళ్లు.. వడియాల పనికి ముగింపు పాడేశారా?పాపం.. పిల్లలకు హాలీడేస్ అయిపోతున్నాయి.. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేసి పెట్టారా?లేకపోతే వెంటనే వీటిని ట్రై చేయండి.. పిల్లలు ఫాస్ట్‌ఫుడ్‌ల జోలికి వెళ్లకుండా.. ఇంట్లోనే టేస్టీ ఫుడ్‌ని రుచి చూసేందుకే ఈ రెసిపీలు.. అటు ఆరోగ్యం.. ఇటు రుచిని బ్యాలెన్స్ చేయడానికి సిద్ధం కండి..


మెంతికూర చేప


menthikura-fish
కావాల్సినవి :
చేపలు : 200 గ్రా. (ముండ్లు లేని..), క్యారెట్ : 2,
ఉల్లిగడ్డ : 1,
క్యాప్సికం : 1,
పచ్చి మిరపకాయలు : 4,
నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్,
బటర్ : ఒక టేబుల్ స్పూన్,
మిరియాల పొడి : ఒక టీస్పూన్, పుదీనా : రెండు రెమ్మలు,
కొత్తిమీర : చిన్న కట్ట,
ఉప్పు : తగినంత

తయారీ :
క్యారెట్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం, ఉల్లిపాయలను నిలువు పొడుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. చేపలను కూడా బాగా కడిగి, పొడుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి కొద్దిగా బటర్ వేసి క్యారెట్, క్యాప్సికం, ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగాక.. చేప ముక్కలు వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి సన్నని మంట మీద కాసేపు అలాగే ఉంచాలి. కొత్తిమీర, పుదీనా వేసి ఒక నిమిషం పాటు కలిపి దించేయాలి. రెండు నిమిషాలాగి నిమ్మరసం వేసి కలిపి ఆ తర్వాత సర్వ్ చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది.

స్వీట్ చిల్లీ వెజిటేబుల్ సలాడ్


sweet-chilly-salad
కావాల్సినవి :
పచ్చి మొక్కజొన్నలు : ఒక కప్పు, ఉల్లి కాడలు : ఒక కట్ట, క్యారెట్స్ : 2, క్యాప్సికం : 1, ఉల్లిగడ్డ : 1, పుదీనా : చిన్న కట్ట, స్వీట్ చిల్లీ సాస్ : ఒక టేబుల్‌స్పూన్ , నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, చక్కెర : 100 గ్రా., ఉప్పు : తగినంత

తయారీ :
క్యారెట్, క్యాప్సికం, ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో పావు లీటరు నీళ్లు పోసి అందులో చక్కెర, ఉప్పు వేసి మరిగించాలి. ఇందులోనే నిమ్మరసం, మొక్కజొన్నలు, స్వీట్ చిల్లీ సాస్, పుదీనా ఆకులు వేసి బాగా కలుపాలి. కాసేపు ఉడికిన తర్వాత క్యారెట్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను వేసి సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించుకోవాలి. నీళ్లు ఒంపేసి ఈ సలాడ్‌ని హాట్‌గా లాగించేస్తే బాగుంటుంది.

పొనగంటి పన్నీర్


ponaganti-panner
కావాల్సినవి :
పన్నీర్ : పది ముక్కలు, పెరుగు : ఒక కప్పు, పొనగంటి కూర : 2 కట్టలు, ఉల్లిగడ్డ : 1 (పెద్దది), పచ్చి మిరపకాయలు : 4, సలాడ్ ఆయిల్ : ఒక టేబుల్‌స్పూన్, నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, బటర్ : రెండు టేబుల్‌స్పూన్స్, కొత్తిమీర : చిన్న కట్ట, ఉప్పు : తగినంత

తయారీ :
కడాయి పెట్టి కొద్దిగా నూనె పోయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పొనగంటి కూర వేసి మూత పెట్టేయాలి. ఇవి బాగా ఉడికాక దించేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్‌ని పొడుగు ముక్కలుగా కట్ చేసి పొనగంటి పేస్ట్‌లో వేయాలి. ఇందులోనే సలాడ్ ఆయిల్, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసి, ఉప్పు వేసి బాగా కలుపాలి. చివరగా నిమ్మరసం పోసి కాసేపు అలా ఉంచాలి. ఇప్పుడు పన్నీరుకు చిన్న చిన్న స్టిక్స్‌ని గుచ్చాలి. తవా పెట్టి బటర్ వేసి ఈ ముక్కలను రెండు వైపులా వేయించాలి. అంతే.. వేడి వేడి పొనగంటి పన్నీర్ రెడీ!

మొక్కజొన్న కోడి వేపుడు


mokka-jonna-kodi-vaypudu
కావాల్సినవి :
చికెన్ : 200 గ్రా. (బోన్‌లెస్), స్వీట్‌కార్న్ : 100 గ్రా., టమాటాలు : 2, మిరియాల పొడి:ఒక టీస్పూన్, వెల్లుల్లి పాయలు : 5, బటర్ : ఒక టేబుల్‌స్పూన్, నూనె : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :
చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వెల్లుల్లి పాయలును దోరగా వేయాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి సగానికి పైగా ఉడికాయనుకున్నాక.. మొక్కజొన్న గింజలు పోసి, టమాటా ముక్కలు వేసి మూత పెట్టాలి. ఇవి కాస్త ఉడికాక.. బటర్ వేసి కలుపాలి. సన్నని మంట మీద ఉంచి ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి రెండు నిమిషాలాగి దించేయాలి. మొక్క జొన్న కోడి వేపుడు నోరూరించడానికి మీ ముందుంటుంది.

నువ్వుల గోబీ ఫ్రై


nuvvula-gobi-fry
కావాల్సినవి :
గోబీ ముక్కలు : 10,
మైదా : రెండు టేబుల్‌స్పూన్స్,
మిరియాల పొడి : ఒక టీస్పూన్, కారం : ఒక టీస్పూన్,
పచ్చిమిర్చి : 4,
కార్న్‌ఫ్లోర్ : ఒక టీస్పూన్,
నువ్వులు : ఒక టీస్పూన్ ,
నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :
ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. ఇందులో గోబీ ముక్కలను వేసి రెండు నిమిషాలు ఉంచి తీయాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలో వేసి.. ఇందులో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, నువ్వులు, కారం వేసి బాగా కలుపాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి గోబీ ఒక్కో ముక్కను దోరగా వేయించుకోవాలి. వీటిని ఏదైనా స్వీట్ చట్నీతో తింటే మరింత టేస్టీగా ఉంటాయి.

yadagirif
జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

1391
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles