పసందైన పచ్చళ్లు!


Thu,May 16, 2019 01:59 AM

MANGO-PICK
కాస్త కారం.. కాస్త ఉప్పు.. దానికి ఆవపొడి.. మెంతి పొడి కలిస్తే.. ఎర్రటి పచ్చడి నోట్లో నీళ్లూరిస్తుంది! రోహిణి కార్తెకు ముందు.. వెనుక తేడా లేకుండా.. పచ్చళ్లను జాడీల్లోకి ఎత్తుతుంటారు చాలామంది.. మామిడికాయలతోనే పది రకాల పచ్చళ్లను పెడుతుంటారు.. కానీ ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి.. కూరగాయలతో.. నాన్‌వెజ్‌లతో పచ్చళ్లను ఎలా పెట్టాలో చూడండి.. ఇంటిల్లిపాది రుచికరమైన పచ్చళ్లను ఆస్వాదించండి..


మష్రూమ్ పచ్చడి

MUSHROOM-PICKLE

కావాల్సినవి :

మష్రూమ్స్ : 10, పసుపు : పావు టీస్పూన్, నువ్వుల పొడి : ఒక టీస్పూన్, ఆవపొడి : ఒక టీస్పూన్, కారం : ఒక టేబుల్‌స్పూన్, నిమ్మరసం : 2 టేబుల్‌స్పూన్స్, నూనె : అర కప్పు, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : మష్రూమ్‌లను కడిగి రెండు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి ముక్కలను కొద్దిగా వేయించి దించేయాలి. ఇవి రంగు మారే వరకు ఆగాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత దీంట్లో పసుపు, నువ్వుల పొడి, ఆవపొడి, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపాలి. దీన్ని ఒక సీసాలోకి ఎత్తి గట్టిగా మూత పెట్టేయాలి. వెంటనే కాకుండా ఒక వారం తర్వాత ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది.

మిక్స్‌డ్ వెజిటేబుల్ పచ్చడి

MIXED-VEGETABLE-PICKLE

కావాల్సినవి :

bమామిడికాయ : 1, క్యారెట్ : 1, కాలీఫ్లవర్ ముక్కలు : అర కప్పు, పచ్చిమిర్చి : 4, ఎండుమిర్చి : 3, కరివేపాకు : ఒక రెమ్మ, పసుపు : అర టీస్పూన్, కారం : 2 టేబుల్‌స్పూన్స్, ఆవాలు : ఒక టీస్పూన్, నిమ్మకాయలు : 3, వెల్లుల్లిపాయలు : 5, ఆవపొడి : ఒక టేబుల్‌స్పూన్, మెంతిపొడి : అర టీస్పూన్, వెనిగర్ : ఒక టేబుల్‌స్పూన్, నూనె : 4 టేబుల్‌స్పూన్స్, నిమ్మరసం : 2 టేబుల్‌స్పూన్స్, దొడ్డు ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో నూనె పోసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : ఒక పెద్ద గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయలు, పసుపు, కారం, ఆవపొడి, మెంతిపొడి, వెనిగర్, దొడ్డు ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపాలి.
స్టెప్ 3 : ఈ మిశ్రమంలో ముందుగా పోపు పెట్టిన దాన్ని పోసి బాగా కలుపాలి. రెండు రోజుల తర్వాత ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది.

క్యారెట్ పచ్చడి

CARROT-PICKLE-TASTY

కావాల్సినవి :

క్యారెట్ : 250 గ్రా., ఆవనూనె : ఒక టేబుల్‌స్పూన్, వెనిగర్ : అర టీస్పూన్, నల్ల జీలకర్ర : అర టీస్పూన్, మెంతిపొడి : అర టీస్పూన్, ఆవపొడి : 3 టీస్పూన్స్, కారం : 3 టీస్పూన్స్, చక్కెర : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : క్యారెట్‌ని కడిగి చెక్కు తీసి మూడు ఇంచుల పొడవు ఉండేలా పొడుగు ముక్కలు కోసి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి వేడయ్యాక.. నల్ల జీలకర్ర వేసి వేయించాలి. ఈ నూనెని క్యారెట్ ముక్కల మీద పోయాలి.
స్టెప్ 3 : క్యారెట్ మిశ్రమంలో ఇంకా వెనిగర్, ఆవ పొడి, మెంతి పొడి, కారం, చక్కెర, ఉప్పు వేసి అన్నీ వేసి బాగా కలుపాలి. దీన్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి. ఏదైనా కూరతో పాటు ఈ పచ్చడిని ట్రై చేయొచ్చు.

మటన్ పచ్చడి

Mutton-Pickle

కావాల్సినవి :

మటన్ ముక్కలు : ఒక కప్పు, వెల్లుల్లిపాయలు : 5, ఎండుమిర్చి : 4, కరివేపాకు : ఒక రెమ్మ, ధనియాలు : అర టీస్పూన్, ఆవాలు : అర టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, కారం : ఒక టీస్పూన్,
గరం మసాలా పొడి : పావు టీస్పూన్, చింతపండు రసం : అర కప్పు, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : మటన్‌ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టెప్ 2 : ఇప్పుడు మిక్సీలో ఉడికిన మటన్ ముక్కలను, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి.
స్టెప్ 3 : కడాయిలో ఎండు మిర్చి, కరివేపాకు, ధనియాలు వేసి వేయించుకోవాలి. వీటిని కాసేపు చల్లారనిచ్చి మరొక మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
స్టెప్ 4 : మరో కడాయిలో నూనె పోసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టిన మటన్‌ని వేసి ఐదు నిమిషాలు కలుపాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలు కలుపాలి.
స్టెప్ 5 : ఇప్పుడు కరివేపాకు పొడి, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపాలి. ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉంచి దించేయాలి. టేస్టీ మటన్ పచ్చడి రెడీ! అన్నం, పుల్కాలతో బాగా లాగించేయొచ్చు.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

1343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles