చిరుధాన్యాలతో.. చల్లగుండా!


Thu,February 7, 2019 01:50 AM

Millets
చల్లగాలి కాస్త నెమ్మదించింది.. వేడి గాలులు తగులుతున్నాయి.. వాతావరణానికి తగ్గట్టుగా.. ఆహారాన్ని కూడా మార్చేయాలండోయ్.. మరి రుచి మాటేంటనే కదా మీ సందేహం.. చిరుధాన్యాలతో సూపర్‌గా వంటలు చేసేయొచ్చు.. అటు ఆరోగ్యం.. ఇటు ఆనందం రెండింటినీ సొంతం చేసుకోవచ్చు.. లడ్డు.. పలావు.. ఉప్మా.. పాయసంతో పసందైన ఈ విందు మీకోసం..


రాగిలడ్డు

raagi-laddu

కావాల్సినవి :

రాగులు : 250 గ్రా.నెయ్యి : 100 గ్రా.యాలకులపొడి : 2 టీస్పూన్స్ బెల్లం : 250 గ్రా. డ్రైఫ్రూట్స్ : తగినన్ని

తయారీ :

రాగులు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. కడాయిలో నూనె వెయ్యకుండా దోరగా వేయించుకోవాలి. తర్వాత బెల్లం సన్నగా తురిమి పెట్టుకోవాలి. అంతలోపు వేయించిన రాగుల్ని పిండి పట్టించాలి. పిండిలో వేడి చేసిన నెయ్యి, యాలకుల పొడి, తురిమిన బెల్లం వేసి బాగా కలుపాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు లేదా కావాల్సిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇష్టమున్నవాళ్లు డ్రైఫ్రూట్స్‌ని సన్నగా తరిగి పిండిలో కలుపుకోవచ్చు. తయారయిన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే పదిరోజుల పాటు పదిలంగా ఉంటాయి.

ఊదల ఉప్మా

oodhala-upma

కావాల్సినవి :

ఊదలు : 2 కప్పులు, నూనె/నెయ్యి : 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు: అర టీ స్పూన్, జీలకర్ర : అర టీ స్పూన్, శనగపప్పు : ఒక టీస్పూన్, పచ్చిమిర్చి : 3, కరివేపాకు : 2 రెమ్మలు, పల్లీలు : 2 టీ స్పూన్స్, అల్లం : 1 చిన్నముక్క, ఉల్లిగడ్డ : 1, పసుపు : చిటికెడు, ఉప్పు : తగినంత

తయారీ :

ఊదలు శుభ్రం చేసుకొని గంటపాటు నీటిలో నానబెట్టాలి. కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చెయ్యాలి. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, అల్లం ముక్కలు, పల్లీలు, పసుపు, ఉల్లిపాయలతో తాళింపు వేసుకోవాలి. ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో ముందుగా నానబెట్టిన ఊదలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపాలి. నీరు ఇగిరే వరకూ కలుపుతూ ఉడుకనివ్వాలి. ఉప్పు, కారం సరిచూసుకొని నీరు ఇంకిపోయే వరకూ ఉడికించాలి. అంతే వేడి వేడి ఊదల ఉప్మాని ఊరగాయతో పాటు వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

సజ్జల చక్కెర పొంగలి

sajjala-chekkara-pongali

కావాల్సినవి :

సజ్జలు : 2 కప్పులు, పెసరపప్పు : 1 కప్పు కిస్మిస్ : అర కప్పు, యాలకుల పొడి : పావు టీస్పూన్, బెల్లం : తగినంత, జీడిపప్పు : అర కప్పు కొబ్బరి : అర చెక్కనెయ్యి : 3 టీస్పూన్స్

తయారీ :

సజ్జలు శుభ్రం చేసుకొని గంటపాటు నీటిలో నానబెట్టాలి. అదే విధంగా పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి నెయ్యిలో దోరగా వేయించి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా దోరగా వేయించాలి. బెల్లం తురుముకొని చిక్కగా పాకం పట్టుకోవాలి. అందులో యాలకుల పొడి కూడా వెయ్యాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి పెసరపప్పు, సజ్జలు దోరగా వేయించుకొని సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి ( 1 కప్పు సజ్జలు+పెసరపప్పు = 3 కప్పుల నీళ్లు). ఇందులో కొబ్బరిముక్కలు, జీడిపప్పు, కిస్మిస్‌తో పాటు బెల్లం పాకం కూడా వేసి బాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి దింపేయాలి. తియ్యని పొంగలి మీ ముందుంటుంది.

సామల వెజిటేబుల్ పులావ్

samala-vegpulo

కావాల్సినవి :

సామలు : 100 గ్రా., నూనె, నెయ్యి : 3 టీస్పూన్స్, పచ్చిమిర్చి : 6, ఉల్లిగడ్డ : 1, కొత్తిమీర : 1 కట్ట, పుదీనా : 1 కట్ట, ఆలుగడ్డ : 1, కాప్సికమ్ : 1, అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, యాలకులు : 8, లవంగాలు : 8, దాల్చిన చెక్క : 4 ముక్కలు, పలావు ఆకులు : 4, జీడిపప్పు : అర కప్పు, బీన్స్ : 6, గ్రీన్‌పీస్ : అర కప్పు,
ఉప్పు : తగినంత

తయారీ :

సామలను శుభ్రం చేసి గంటపాటు నీటిలో నానబెట్టాలి. కూరగాయలు, కొత్తిమీర, పుదీనాని కట్‌చేసి పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె లేదా నెయ్యి వేసి దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావు ఆకులు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేగనివ్వాలి. ముందుగా కట్‌చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత సరిపడా నీరు పోసి కలుపుతూ మరగనివ్వాలి. నానబెట్టుకున్న సామలు వేసి కలిపి ఉడికించాలి. అందులో సగం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు సన్నని సెగపై ఉంచి స్టౌ మీది నుంచి దింపేయాలి. మిగిలిన కొత్తిమీర, పుదీనా చల్లుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

3010
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles