క్యా బేజీ..టేస్టీ..


Thu,January 31, 2019 12:41 AM

vanta
ఇప్పుడంతా ఫాస్ట్‌ఫుడ్‌ల కాలం నడుస్తున్నది..గంటలు గంటలు వంటకు సమయం కేటాయించే తీరిక ఎవరికీ లేదిప్పుడు.. అందుకే చిటికెలో రెడీ అయిపోయే వంటలకే ఓటేస్తున్నారు..బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌తో ఆరోగ్యం పాడు చేసుకోకుండా.. ఇంట్లోనే క్యాబేజీతో చేసుకునే ఫాస్ట్‌ఫుడ్ స్నాక్స్ మీ కోసం తీసుకొచ్చింది జిందగీ..


హార్లిక్స్ ఓట్స్ క్యాబేజీ ఆమ్లెట్

Horlicks-Oats-Cabbage

కావాల్సినవి :

హార్లిక్స్ ఓట్స్ : 1 కప్పు, క్యారెట్ : అర కప్పు, క్యాబేజీ : అర కప్పు, మిరియాల పొడి : 1 టీస్పూన్, కోడిగుడ్డు : 3, చీజ్ : అర కప్పు, వెన్న, ఉప్పు : తగినంత

తయారీ :

కడాయిలో హార్లిక్స్ ఓట్స్‌ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బౌల్ తీసుకొని క్యారెట్, క్యాబేజీ, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపాలి. అందులోనే కోడిగుడ్ల మిశ్రమం కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపాలి. వేయించి పక్కన పెట్టిన హార్లిక్స్ ఓట్స్, చీజ్ వేసి కలుపాలి. తరువాత కడాయిలో వెన్న వేసి, కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేయాలి. ఆమ్లెట్ మీద కొంచెం చీజ్ వేయాలి. మూడు నిమిషాల తర్వాత నిదానంగా ఆమ్లెట్‌ని తిరగతిప్పి దానిమీద క్యారెట్, చీజ్ చల్లినట్టుగా వేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకంటే చాలు. నోరూరించే హార్లిక్స్ ఓట్స్ క్యాబేజీ ఆమ్లెట్ తయారయినట్లే.

పెసరపప్పు క్యాబేజీ వడ

MOONG-DAL-CABBAGE

కావాల్సినవి :

పెసరపప్పు : 1 కప్పు, క్యాబేజీ : 1 కప్పు, పచ్చిమిర్చి : 3, జీలకర్ర : అర టీస్పూన్, కరివేపాకు : 1 రెబ్బ, కొత్తిమీర : అర కప్పు, నూనె, ఉప్పు : తగినంత.

తయారీ :

పెసరపప్పుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. క్యాబేజీని చిన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పెసరపప్పు పిండిని క్యాబేజీతో కలుపాలి. దీంతో పాటు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కలుపాలి. ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. పిండిని చిన్న ముద్దలుగా చేసి వడలుగా చేయాలి. కాగిన నూనెలో వడలను వేయించాలి. బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ప్లేటులో టిష్యూ పేపర్ పెట్టి వడలను సర్వ్ చేసుకోవాలి. వడలను నేరుగా తిన్నా, ఏదైనా చట్నీతో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది.

స్టఫ్డ్ క్యాబేజీ రోల్స్

Stuffed-Cabbage

కావాల్సినవి :

కోడిగుడ్డు : 1, ఉల్లిగడ్డ : 1, తరిగిన అల్లం, వెల్లుల్లి : 1 టీస్పూన్, ఉల్లికాడలు : పావుకప్పు, కూరగాయల ముక్కలు : పావు కప్పు, చికెన్ : 250 గ్రా., క్యాబేజీ ఆకులు : 7, మిరియాల పొడి : పావు టీస్పూన్, సోయా సాస్ : పావు టీస్పూన్, వెన్న : 1 టేబుల్ స్పూన్

తయారీ :

క్యాబేజీ ఆకులను వేడి నీటిలో మూడు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత క్యాబేజీ ఆకులను పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, క్యారెట్, బీన్స్ ముక్కలు, ఉల్లి కాడలు, తరిగిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, మిరియాల పొడి, సోయాసాస్, వెన్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపాలి. ఉడికించిన క్యాబేజీ ఆకుల్ని ముడత లేకుండా తెరిచి కొంచెం క్యాబేజీ మిశ్రమం పెట్టి రోల్ చెయ్యాలి. ఇప్పుడు క్యాబేజీ రోల్స్‌ని స్టీమర్‌లో పెట్టి మూతపెట్టాలి. 15 నిమిషాల తర్వాత రోల్స్‌ని బయటకు తీసి చిల్లీసాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

క్యాబేజ్, క్యారెట్, సోయా సాండ్‌విచ్

CARROT-CABBAGE-SOYA

కావాల్సినవి :

వెన్న : 4 టీస్పూన్లు, ఉల్లిగడ్డ : 2 టేబుల్ స్పూన్లు, క్యాబేజీ : 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ : 2 టేబుల్ స్పూన్లు, సోయా బీన్స్ : 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి : 1 టేబుల్ స్పూన్, చీజ్ : అర కప్పు, బ్రెడ్ : 4, కొత్తిమీర : తగినంత.

తయారీ :

కడాయిలో కొంచెం వెన్న వేసి కరుగనివ్వాలి. అందులో క్యాబేజీ, క్యారెట్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సోయాబీన్ ముక్కలు వేసి దోరగా వేయించాలి. కడాయి దించేముందు కొత్తిమీర, మిరియాల పొడి, చీజ్ కలిపి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌కి రెండువైపులా వెన్న రాసి, పక్కన పెట్టిన మిశ్రమాన్ని రెండు బ్రెడ్‌ల మధ్యలో పెట్టాలి. రెండు వైపులా సరిపడా వెన్న రాసుకోవాలి. గ్రిల్లింగ్ పాన్‌లో బ్రెడ్‌ని వేడి చేసి రెండువైపులా కాల్చాలి. గ్రిల్లింగ్ పాన్‌లోంచి తీసిన బ్రెడ్‌లను సాండ్‌విచ్ మాదిరిగా కట్ చేస్తే మీకు నచ్చిన క్యాబేజీ సాండ్‌విచ్ తయారయినట్లే. దీన్ని గార్నిష్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

చనాదాల్ క్యాబేజీ పరాటా

CHANA-DAL-CABBAGE

కావాల్సినవి :

శనగపప్పు : 1 కప్పు, జీలకర్ర : అర టీస్పూన్, గోధుమపిండి : 2 కప్పులు, ఉల్లిగడ్డ : పావు కప్పు, క్యాబేజీ : 1 కప్పు, పసుపు : పావు టీస్పూన్, కారం : 1 టీ స్పూన్, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

శనగపప్పుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం నూనె వేసి జీలకర్రని వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యాబేజీ, పసుపు, కారం వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఉడికించిన శనగపప్పుని కూడా అందులో వేసి కలుపాలి. బాగా వేగిన తర్వాత కడాయిని పక్కన పెట్టి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని చిన్న పరిమాణంలో గుండ్రంగా చేసుకోవాలి. చల్లారిన క్యాబేజీ మిశ్రమాన్ని చేతితో మెత్తగా కలుపాలి. ఇవి పరాటా ఉండల కంటే చిన్నసైజులో ఉండాలి. క్యాబేజీ పిండిని పరాటా పిండిలో పెట్టి పరాటా రుద్దాలి. కడాయిలో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత తయారుచేసిన పిండిని వేసి కాల్చాలి. రెండువైపుల కాలిన తర్వాత ప్లేటులోకి సర్వ్ చేసి గుండ్రంగా ఉన్న పరాటాని నచ్చిన విధంగా కట్ చేసుకొని తినొచ్చు.

-సంజయ్ తుమ్మ
- సెలబ్రిటీ చెఫ్

2177
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles