ఆహా.. ఆకుకూరలు!


Thu,January 24, 2019 02:26 AM

kodi-currys
చుక్కకూర.. తోటకూర.. మెంతికూర.. కొత్తిమీర.. ఆకులు ఏవైనా ఆరోగ్యానికి మంచివే! ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరాలు.. ఆకుకూరలు.. అతి చౌకగా దొరికే వీటిలో పోషకాలు కూడా మెండు! కానీ మామూలుగా వాటిని వండి వడ్డిస్తే తినే వాళ్లు తక్కువ.. అందుకే మరికొన్ని కూరల్లో వాటిని మిక్స్ చేస్తే.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేస్తారు..


చుక్కకూర కోడికూర

chukkakura-kodi

కావాల్సినవి :

చుక్కకూర : 100 గ్రా.
చికెన్ : 200 గ్రా.
ఉల్లిగడ్డ : 1
పచ్చిమిర్చి పేస్ట్ : అర టీస్పూన్
ధనియాల పొడి : ఒక టీస్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
కరివేపాకు : ఒక రెమ్మ
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
పసుపు : పావు టీస్పూన్
తాలింపు గింజలు : 50 గ్రా.
నూనె : 2 టేబుల్‌స్పూన్
ఉప్పు : తగినంత

తయారీ :

కడాయిలో నూనె వేసి తాలింపు గింజలు వేసి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కాస్త వేగిన తర్వాత పసుపు, కరివేపాకు, చుక్కకూర వేసుకొని రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి. దీంట్లో చికెన్, ఉప్పు వేసి పదినిమిషాలు సన్నని మంట మీద అలాగే ఉడికించాలి. చికెన్ కాస్త ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి మరికాసేపు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. దీన్ని చపాతీ లేదా అన్నంతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

తోటకూర పన్నీరు వేపుడు

tota-kura-panner

కావాల్సినవి :

తోటకూర : 200 గ్రా.
పన్నీర్ : 200 గ్రా.
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టీస్పూన్
ధనియాల పొడి : ఒక టీస్పూన్
గరం మసాలా : పావు టీస్పూన్
ఉల్లిగడ్డ : 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
కరివేపాకు : ఒక రెమ్మ
తాలింపు గింజలు : 50 గ్రా.
నూనె : ఒక టేబుల్‌స్పూన్
ఉప్పు : తగినంత

తయారీ :

కడాయిలో నూనె వేసి తాలింపు గింజలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు రంగు మారాక.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపాలి. దీంట్లో కరివేపాకు, తోటకూర వేసి మూత పెట్టేయాలి. బాగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసి సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు కలుపాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఒక నిమిషం తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. టేస్టీ కూర మీ ముందుంటుంది.

మెంతికూర పుట్టగొడుగుల వేపుడు

menthi-kura-puuta

కావాల్సినవి :

మెంతికూర : 100 గ్రా.
పుట్టగొడుగులు : 200 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ : అర టీస్పూన్
ధనియాల పొడి: ఒక టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
ఉల్లిగడ్డలు : 2, కొత్తిమీర : ఒక కట్ట
కరివేపాకు : ఒక రెమ్మ
నూనె : 2 టేబుల్‌స్పూన్స్
జీలకర్ర : పావు టీస్పూన్
వెల్లుల్లి : నాలుగు రెబ్బలు
ఎండుమిర్చి : 2, ఉప్పు : తగినంత

తయారీ :

ముందుగా కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగాక.. పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలుపుతుండాలి. ఇందులో మెంతికూర వేసి సన్నని మంట మీద ఉడికించాలి. కాస్త కూర దగ్గరకు అవుతున్న సమయంలో.. మష్రూమ్స్‌ని వేసి కలుపాలి. రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి ఉప్పు, ధనియాల పొడి వేసి డీప్ ఫ్రై అయ్యేలా చూడాలి. ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా లాగించేయాలి.

ఆకుకూరల చేపల పులుసు

panchakula-chaplu

కావాల్సినవి :

చేపలు : 200 గ్రా., చుక్కకూర : 50 గ్రా., తోటకూర : 50 గ్రా., పొనగంటి కూర : 50 గ్రా., గంగావాయిలి కూర : 50 గ్రా., మెంతికూర : 50 గ్రా., పచ్చిమిర్చి పేస్ట్ : 10 గ్రా., ధనియాల పొడి : ఒక టీస్పూన్, జీలకర్ర పొడి : ఒక టీస్పూన్, చింతపండు : 100 గ్రా., ఉల్లిగడ్డలు : 2, ఆవాలు : 20 గ్రా., మెంతులు : 20 గ్రా., ఎండుమిర్చి : 4, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్ , పసుపు : చిటికెడు, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

కడాయిలో నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపాలి. దీంట్లో చుక్కకూర, పొనగంటి కూర, గంగవాయిలి కూర, తోటకూర, మెంతికూరలను కడిగి వేసి బాగా కలుపాలి. మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇవి ఉడికాక.. చేప ముక్కలను వేసి రెండు నిమిషాల తర్వాత చింతపండు రసం, నీళ్లు పోసి మరుగనివ్వాలి. సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాసేపు ఉంచి దించేయాలి. వేడి వేడి అన్నంలో.. ఈ పులుసు పోసుకుని తింటే ఆహా ఏమి రుచి అనకమానరు.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

2619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles