హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగా ణ): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేటాయించిన ఎన్‌హెచ్ నంబరే దక్షిణ భాగానికీ వర్తిస్తుందని జాతీయ రహదారుల అథారిటీ స్పష్టం చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం ఆర్ఆర్ఆర్ను ఎన్‌హెచ్-161ఏఏగా పిలవనున్నారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది. ట్రిపుల్ఆర్ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే.
ఇందులో ఉత్తర భాగం 164 కిలోమీటర్లకు జాతీయ రహదారుల సంస్థ 2017 జూన్‌లో ఎన్‌హెచ్-161ఏఏ నంబర్‌ను కేటాయించింది. దక్షిణ భాగం రోడ్డు నిర్మాణానికి ఇటీవలే కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా, అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలపాల్సి ఉన్నది. జాతీయ రహదారుల విషయంలో నంబర్ కేటాయించటమే అత్యంత కీలకమ ని, నంబర్ కేటాయిస్తే ప్రాజెక్టు పనులు పుంజుకుంటాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ అనంతరం ఎన్‌హెచ్ నంబర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు, ఈనెల 6న ఢిల్లీలో ఫైనాన్స్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఇందులో ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి తుది అనుమతులు సహా 16 రాష్ట్ర రోడ్ల అప్‌గ్రేడేషన్ ప్రతిపాదనలు సమర్పించనున్నట్టు సమాచారం.