హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు. దీనికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సచివాయంలో ప్రారంభించారు. https// cmrf.telangana.gov.in\వెబ్సైట్లో ఉన్న దరఖాస్తుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖను జతచేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులో సంబంధితుల బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక కోడ్ ఇస్తారు.
ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత దవాఖానలకు అధికారులు పంపి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్‌ను ఆమోదించి క్లెయిమ్ చెక్కును సిద్ధం చేస్తారు. చెక్‌పై దరఖాస్తుదారుడి అకౌంట్ నంబర్‌ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్కు పకదారి పట్టే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్కులను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు.