Crime News | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): స్నేహాన్ని ఆసరా చేసుకొన్న యువతి.. తన స్నేహితురాలు బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. నగరంలో ఇద్దరు యువతులు ఒక హాస్టల్ గదిలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కలిసి ఉండటం వల్ల ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. కొన్ని రోజులకు సెలవులు రావడంతో తమ ఊరికి వెళ్దామని నిందితురాలు తన స్నేహితురాలిని తమ ఇంటికి తీసుకెళ్లింది. రెండు రోజుల తరువాత నిందితురాలికి వక్రబుద్ధి పుట్టింది.
తనకు తెలిసిన యువకులతో కుట్రకు తెరలేపింది. స్నేహితురాలు గదిలో బట్టలు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియో తీసి తనకు తెలిసిన యువకులకు పంపించింది. ఈ విషయాన్ని బాధితురాలు గుర్తించలేదు. కొద్ది రోజులకు ఓ అనామక నంబర్ నుంచి వాట్సాప్‌లో తను బట్టలు మార్చుకుంటున్న వీడియోలు వచ్చాయి. మేం అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు.
దీంతో కొంత డబ్బు పంపించింది. మరోసారి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడంతో బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదుచేసింది. దర్యాప్తు జరిపిన షీ టీమ్స్ బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించగా బాధితురాలి స్నేహితురాలే వీడియోలు తీసి తమకు పంపించిందని ఒప్పుకున్నారు. దీంతో బాధితురాలి స్నేహితురాలైన యువతిని, బ్లాక్మెయిల్ చేస్తున్న వారిని షీ టీమ్స్ అరెస్ట్ చేసింది.