యువకుడి దారుణ హత్య

Tue,August 13, 2019 09:47 PM

young man brutal murder in Adilabad

ఆదిలాబాద్ : మొదటి భార్యతో సంబంధం కొనసాగుతున్నదని తెలుసుకొని రెండో భార్య తన సోదరుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కల్‌గూడ కాలనీలో చోటు చేసుకున్నది. పట్టణంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన షేక్ అఫీజ్(26) ఆరేండ్ల క్రితం మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన సభాను పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని బొక్కల గూడ కాలనీకి చెందిన ఫిర్దోస్‌ను పెళ్లి చేసుకున్నాడు. షేక్ అఫీజ్‌కు గతంలో పెళ్లి జరిగినట్లు రెండో భార్య ఫిర్దోస్‌కు తెలిసింది.

దీంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. షేక్ అఫీజ్ మొదటి భార్య సభా వద్దకు వెళ్లి వచ్చేవాడు. ఉంటే మొదటి భార్య వద్ద ఉండాలని లేదంటే తన వద్దే ఉండాలని రెండో భార్య ఫిర్దోస్ భర్తతో గొడవ పడేది. గతంలో రెండో భార్య జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో భర్త షేక్ అఫీజ్‌పై కేసు పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా.. కలిసి ఉంటామని ఒప్పుకున్నాడు. షేక్ అఫీజ్‌లో మార్పు రాకపోవడంతో రెండో భార్య ఫిర్దోస్ తన సోదరుడితో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం వేసింది.

పండుగ సందర్భంగా భర్త షేక్ అఫీజ్‌ను తన తల్లిగారిల్లు బొక్కలగూడకు ఆహ్వానించింది. ముందుగా ప్లాన్ వేసుకున్న ఫిర్దోస్ భర్త ఇంటికి రాగానే తన కుటుంబ సభ్యులు, సోదరుడి స్నేహితులతో కలిసి మొత్తం ఏడుగురు షేక్ అఫీజ్‌ను హతమార్చారు. కత్తెరతో ఛాతిపై, కడుపులో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సురేశ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

1746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles