సోమశిల-శ్రీశైలం క్రూయీజ్‌ బోట్‌ ప్రయాణం ప్రారంభం

Thu,November 21, 2019 05:05 PM

నాగర్‌కర్నూల్‌: సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల వద్ద ఏర్పాటు చేసిన క్రూయీజ్‌ బోట్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు ప్రారంభించారు. అదేవిధంగా వాటర్‌ స్పోర్ట్స్‌, బోటింగ్‌, కాటేజీలు, ఇతర పర్యాటక సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


నల్లమల దట్టమైన అరణ్యం.. ఒకప్పుడు పగలు పోలీసులు.. రాత్రుళ్లు మావోయిస్టులు ఒకరివెనుక ఒకరు.. ఒకరి కోసం మరొకరు వెదుకులాడిన ప్రాంతం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో గూడేలు గజగజవణికిపోయేవి. పోలీసుల బూట్ల చప్పుళ్లు, మావోయిస్టుల తుపాకుల శబ్దాల కారణంగా కృష్ణమ్మ జల సవ్వడులు.. నల్లమల కొండల అందాలను కారడవి కప్పివేసింది. కానీ, తెలంగాణ స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో సోమశిల సోమేశ్వరాలయం, సోమేశ్వరుడి పాదాలను కడుగుతున్నట్టుగా ఉండే కృష్ణానది.. అక్కడి నుంచి తూర్పువైపు శ్రీశైలం రిజర్వాయర్ వరకు సాగే ప్రయాణం మధురానుభూతిని కల్పించనున్నది. నదిలో నీరు పుష్కలంగా ఉండటంతో ఎనిమిది నెలలపాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ పర్యాటక సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు రెండు లాంచీలను నడుపుతుండగా.. ఇప్పుడు కొల్లాపూర్ సమీపంలోని పుణ్యక్షేత్రమైన సోమశిల, అమరగిరి తదితరప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. నల్లమల అందాలను వీక్షిస్తూ సోమశిల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ చేరుకునే అవకాశం కల్పిస్తున్నది.


పాపికొండలకన్నా ఎత్తు
గోదావరిలో పాపికొండల ఎత్తు సముద్రమట్టానికి రెండొందల మీటర్ల కన్నా మించదు. కానీ, సోమశిల నుంచి శ్రీశైలం వరకు విస్తరించి ఉన్న అమరగిరులు 400 మీటర్ల ఎత్తులో కనువిందు చేస్తాయి. సోమశిల వద్ద నీటిమట్టం 300 అడుగులు ఉంటుంది. ఫిబ్రవరిలో 100 అడుగులకు నీటిమట్టం తగ్గినా ప్రయాణానికి ఏ ఆటంకమూ ఉండకపోగా.. అమరిగిరులు ఇంకా ఎత్తుగా కన్పిస్తూ ఆకట్టుకుంటాయి.

బంగారువర్ణపు కొండలు..
సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదీతీరంలో వరుసగా నిలబడి ఉన్నట్టుగా ఉండే కొండలు, గట్లు కనువిందు చేస్తాయి. అవి సూర్యకాంతిలో బంగారు వర్ణంతో మెరిసిపోతుంటాయి. మధ్యమధ్యలో కోతులు, తిమ్మన్నలు, నెమళ్లు, చిరుతలు కనిపిస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక నుంచి ఇక్కడివరకు నిలిచి ఉండే కృష్ణ్ణమ్మ చల్లని గాలికి చిన్నచిన్న అలలుగా పలకరిస్తున్నట్టుగా ఆనందాన్ని పంచుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ కింద మునిగిపోయిన పాత అమరగిరి, మారుగుంది, ఎర్రమటం, మాడ్గుల, రాంపురం, ముక్కిడి గుండం, నార్లాపూర్, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాల మీదుగా ప్రయా ణం సాగుతుంంది. నదికి ఇరువైపులా ఆదివాసీలు, చెంచుల ఆవాసాలు.. జొన్నలరాశిబోడ గట్టు, అమరగిరి ద్వీపాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం నీటిని తోడిపోసే ప్రదేశం కనిపిస్తుంది. జానళ్లకొండలు, మత్స్యకారులు నివాసం ఏర్పాటుచేసుకున్న ఎర్రగుండు, ఒకప్పుడు ఎర్రగట్టు బొల్లారంగా పేరెన్నికగన్న కోతిగుండు కనిపిస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వైపు సా గుతున్న ప్రయాణంలో గుండ్లపెంట, సోములకుంట, సోములకుంటవాగు, బేతంచర్ల కాలువ, ఎద్దులకొండ, లింగమయ్యపెంట, ఒకప్పుడు అధికంగా గొర్రెలు మేతకు వచ్చే తుమ్మతోక కనిపిస్తాయి. బంగారు రంగుతో కనిపించే దేవుని కొండ, పచ్చగూటి, నీటిగంగ, ప్రమాదాలు పొం చిఉన్న సుడిగుండాలు అచ్చెరువొందిస్తాయి.


చేపల దిబ్బ చీమల తిప్ప
సోమశిల నుంచి నదిలో మూడు కిలోమీటర్లు పయనిస్తే నయన మనోహరంగా కనిపించే చీమల తిప్ప ద్వీపం వస్తుంది. చేపల వ్యాపారానికి ఈ తిప్ప ప్రధానకేంద్రంగా ఉన్నది.

కాళికాదేవి కొలువైన అంకాళమ్మ కోట
చీమల తిప్పకు పక్కనే ఆంకాళమ్మ కోట ఉన్నది. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉన్నది. కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు, చెంచులకు ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్నది. ఈ గుట్టపై స్నానాల గుండం ఉండటం విశేషం. అంకాళమ్మ .. పేరు వినేందుకు భయంకరంగా ఉన్నా గుడిలోని అమ్మవారు మాత్రం సింహాసనంపై ప్రశాంత వదనంతో దర్శనమి స్తుంది. నల్లమల తీరగ్రామాలైన అమరగిరి, మొలచింతలపల్లి, సోమశిల, సిద్దేశ్వరం, సంగమేశ్వరం, దుర్గం, కొల్లాపూర్‌తోపాటు వివిధ చెంచుగ్రామాల నుంచి ప్రతి మంగళవారం భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలుచేస్తారు.

చుక్కల కొండ
కృష్ణానదీ ప్రవాహంలో సందర్శకులను మైమరపించే ప్రదేశం చుక్కల కొండ. నదిలో వెళుతుండగా రెండుఒడ్ల నుంచి చెట్లు కలిసిపోయినట్టుగా ఉండటంతో ఇక్కడ చీకటి కమేస్తుంది. అక్కడక్కడా చుక్కల్లా ఆకాశం కనిస్తుంది. దీంతో ఆ ప్రాంతాన్ని చుక్కల కొండ అని పిలుస్తుంటారు.


అక్కమహాదేవి గుహలు
శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. శ్రీశైలంవైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రంఇది. అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పర్యటన చాలా రెట్లు ఆహ్లాదభరితంగా ఉంటుంది. పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనున్నది.
సోమశిల అభివృద్ధికి రూ.20.86 కోట్లు
సోమశిలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20.86కోట్లు వెచ్చించింది. సోమశిల వద్ద ఐదుబ్లాకుల్లో కాటేజీలను నిర్మించింది. ఒక్కోబ్లాక్‌లో మూడు కాటేజీలు ఉంటాయి.రూ.2.95 కోట్లతో లాంచీని కొనుగోలు చేసింది. మొత్తం 125 సీట్ల కెపాసిటీ ఉన్నా... 100 మంది వరకు ఒకేసారి ప్రయాణం చేసేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా నాలుగు సీట్ల సామర్థ్యం ఉన్న ఆరు స్పీడ్‌బోట్లు, ఎనిమిది సీట్లు ఉన్న నాలుగు స్పీడ్‌బోట్లు అందుబాటులో ఉంచింది. రూ. 7.84 కోట్లతో సోమశిల ప్రాంతం మొత్తం సోలార్ లైటింగ్ ఏర్పాటుచేశారు. వీటిని రాష్ట్రమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. సోమశిల నుంచి లాంచీని ప్రారంభించి సింగోటం వరకు అందులో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత పరిస్థితులను అంచనావేస్తూ అధికారులు శ్రీశైలం వరకు లాంచీని నడుపుతారు.

ఇలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి 170 కి.మీ. ప్రయా ణిస్తే కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) వస్తుంది. అక్కడి నుంచి మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే కృష్ణానది మధ్య ప్రకృతి అందాలకు నెలవైన సోమశిల సోమేశ్వరాలయం దర్శనమిస్తుంది. ఇక్క డి నుంచి నదిలో బోటుద్వారా శ్రీశైలం రిజర్వాయర్ వరకు ప్రయాణించవచ్చు.

2312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles