చదువుల యాప్‌లు.. విద్యార్థుల గురువులు

Sun,November 17, 2019 07:40 AM

హైదరాబాద్ : మార్పు మంచిదే.. విజ్ఞానం వికసించేలా చేసి.. చైతన్యం దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహించే ఏ సాంకేతికతనైనా మనం ఆహ్వానించాల్సిందే. అందుకు ఇంటర్నెట్ గురువులు దారి చూపడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని మనం అందుకోగలిగే జ్ఞానాన్ని పెంచుకుంటే చాలు.. వేల రూపాయలు పెట్టి పిల్లలకు ట్యూషన్లు చెప్పించుకునే బాధ తప్పుతుంది. సందేహం వస్తే తెల్లారి మాస్టార్‌నే అడగాల్సిన అవసరం లేదు. అర క్షణంలో పరిష్కరించే అద్భుత యాప్‌లు నెట్టింట్లో బోలేడు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలు. ఒకటో తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు లెక్కలు, ఇంగ్లిష్, సైన్స్ తదితర సబ్జెక్టుల సందేహాలను పరిష్కరించడానికి ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉన్న లెర్నింగ్ యాప్‌ల సాయంతో చిన్నారులకు గురువులుగా మారుతున్నారు.
సందేహం..క్షణంలో పరిష్కారం..!!
సాధారణంగా పిల్లలు లెక్కల సబ్జెక్టును క్లిష్టంగా భావిస్తారు. పెద్దలకు కూడా ఈ సబ్జెక్టు కొంత కష్టమే. అందుకోసం సాయంత్రం వేళల్లో ట్యూషన్లు పెట్టిస్తారు. ఇంటికొచ్చాక హోం వర్క్ సమయంలో మ్యాథ్స్‌లో ఏదైన సమస్య తలెత్తితే.. ఉదయం స్కూల్ ప్రారంభం వరకు వేచి ఉండాలి. చదువుకోని తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లల పరిస్థితి కొంత బాధాకరమే. నగరంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నెట్టింటి సాయంతో ట్యూషన్లు చెబుతున్నారు. ఫొటోమ్యాథ్స్, బైజుస్, ఎపిక్, ఎడ్మడో తదితర లెర్నింగ్ యాప్స్ ప్రస్తుతం యమ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మ్యాథ్స్‌లో ఎలాంటి సమస్యనైనా ఫొటోమ్యాథ్స్ యాప్ స్కాన్ చేస్తే వెంటనే జవాబు వస్తుంది. అంతేకాదు కొన్ని యాప్‌లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా పదో తరగతి వరకు ప్రతి సబ్జెక్టు గురించి సవివరంగా ఉంటాయి.
నెట్టిల్లే గురువు..!!
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇంటర్నెట్ పెద్ద గైడ్. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అరచేతిలో విజ్ఞానగని. ప్రభుత్వ, బ్యాంకు కొలువులకు సన్నద్ధమయ్యే వారి సందేహాలను పరిష్కరించడానికి ఇంటర్నెట్ ఓ గురువుగా పనిచేస్తున్నది. వేల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు క్లాస్‌రూంలలో వచ్చే సందేహాలను కూడా ఇంటర్నెట్‌లో శోధించి తెలుసుకుంటున్నారు. అందుకోసం ఎక్కువగా కొన్ని యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్, సాఫ్ట్‌వేర్ స్కిల్ నేర్చుకోవడానికి సంబంధించి చాలా యాప్‌లు వచ్చాయి. అన్‌అకాడమీ, జగ్రన్‌జోశ్, లిండ, టీశాట్ తదితర యాప్‌లు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. కొన్ని యాప్‌లు మొదటి మూడు నెలలు ఉచిత సర్వీస్‌లు అందించి అనంతరం ఛార్జీ చేయనున్నాయి. నగరంలోని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. స్కూల్ యాజమాన్యాలు సైతం కొన్ని యాప్‌లను సృష్టించి వాటిని వినియోగిస్తున్నాయి.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles