8 నెలల తర్వాత హత్యకేసును ఛేదించిన పోలీసులు

Tue,August 13, 2019 09:21 PM

police solved murder case after 8 months

వేములవాడ : మంత్రాల నెపంతోనే తమ కుటుంబ పెద్దలు చనిపోయారని విశ్వసించి ఓ వృద్ధురాలిని హత్యచేయగా, 8 నెలల తర్వాత కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఇందులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌హెగ్డే వివరాలను వెల్లడించారు. వేములవాడ పరిధిలోని సంకెపల్లి గ్రామానికి చెందిన బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములు మల్కపేట రిజర్వాయర్‌లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి కుటుంబ పెద్దలు అనారోగ్యంతో మృతిచెందారు.

ఇదే గ్రామానికి చెందిన లచ్చవ్వ మంత్రాలతోనే వారు చనిపోయినట్లుగా నమ్మారు. వారికి దగ్గరగా ఉండే ఎండీ షబ్బీర్, పండుగ నర్సయ్య, జింక రాజుతో చర్చించి లచ్చవ్వను చంపేందుకు పథకం పన్నారు. 2018 డిసెంబర్ 12న పండుగ లచ్చవ్వ (75)ను ఆమె నివాసంలోనే మారణాయుధాలతో బుర్ర తిరుపతి, పర్శరాములు, షబ్బీర్ దాడిచేయగా మృతిచెందింది. హత్యకు సహకరించి వారికి సమాచారం అందించిన పండుగ నర్సయ్య, జింక అంజయ్య, జింక రాజుతో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బుర్ర తిరుపతి, బుర్ర పర్శరాములుతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ చేశామన్నారు. మిగితా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వాడిన విధానంతో విచారణ జరిపి, నిందితులను 8 నెలల తర్వాత చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సీఐ వెంకటస్వామి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐలు వెంకటస్వామి, రఘుచందర్ ఉన్నారు.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles