ప్లాస్టిక్‌ భూతం..పర్యావరణానికి నష్టం

Mon,September 16, 2019 08:40 AM


కొడంగల్‌ : మానవ జీవితంలో ప్లాస్టిక్‌ అంతర్భాగంగా, విడదీయరాని బంధంగా మారిపోయింది. ప్రస్తుతం ఎలాంటి వస్తూవులను కొనుగోలు చేయాలన్నా ప్లాస్టిక్‌ కవర్లు తప్పని సరి. పెరుగుతున్న అవసరాలకు ప్లాస్టిక్‌కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు దీనివల్ల ఉత్పన్నమైయ్యే సమస్యలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. వీటి వాడకాన్ని ప్రభుత్వం నియంత్రించినా ఎక్కువ మోతాదులో అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి వస్తువు నీటిలో, భూమిలో కరిగే లక్షణాలు కలిగి ఉన్నందున పర్యావరణానికి వాటితో ఎలాంటి ముప్పు ఉండదు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్‌ వాడకాలు అధిమవడంతో పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుందని ప్రపంచం కోడై కూస్తున్నా నిషేధం అమలు జరుగడంలేదు. ఇనుముతో సహా ఇతరాత్ర లోహాలు భూమిలో, నీటిలో కరిగే లక్షణాలు కలిగి ఉన్నాయి. కాగితం మట్టిలో కలిసిపోయేందుకు దాదాపుగా నెల రోజుల సమయం సరిపోతుంది. కానీ అదే ప్లాస్టిక్‌ భూగర్భంలో కలిసి పోయేందుకు 20 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అంటే ప్రస్తుతం మనం వాడిపడేసిన, వాడుతున్న ప్లాస్టిక్‌ భూమిలో కరిగేందుకు ఎన్ని ఏండ్లు కావాలి. గతంలో ప్లాస్టిక్‌ పరిజ్ఞానం అందుబాటులో లేని సందర్భాల్లో కాగితం కవర్లు వాడుకలో ఉండేవి. వాటిని తయారు చేయడంలో చిన్న పాటి కుటీర పరిశ్రమగాలుగా వెలసి మహిళలకు ఉపాధి అభించేది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ అందుబాటులోకి రావడంతో ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం సైతం నామమాత్రంగా ప్లాస్టిక్‌ నివారణ చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణపై అధికారుల్లోనూ చిత్తశుద్ధి లోపించడంతో పాలిథీన్‌ సంచుల వాడకం పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదు. భవిష్యత్‌లో ఇదేవిధంగా కొనసాగితే మనిషి మనుగడ ఏవిధంగా సాగుతుందో అని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు.


అధికారుల పర్యవేక్షణ లోపించడంతో గ్రామీణ ప్రాంతాల్లో హోల్‌సేల్‌ స్థాయిలో ప్లాస్టిక్‌ అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి దుకాణంలో ఏ చిన్నపాటి వస్తువులు కొనుగోలు చేసినా ప్లాస్టిక్‌ కవర్ల వాడకం పరిపాటిగా మారిపోయింది. దీంతో వట్టి చేతులతో దుకాణాలకు వెళ్లడం ప్లాస్టిక్‌ సంచిలో వస్తువులను తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. కానీ పర్యావరణం కాపాడటంలో తామూ పాలుపంచుకుందామనే భావన మాత్రం కలుగడం లేదు. ఒకవేళ దుకాణంలో ప్లాస్టిక్‌ కవర్‌ అందించకపోతే వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేయరు. దీంతో సదురు దుకాణదారులు కూడా తప్పనిసరిగా ప్లాస్టిక్‌ కవర్లను వాడాల్సి వస్తుంది. ఇంకో దౌర్భాగ్యం ఏమంటే ప్రస్తుతం ప్లాస్టిక్‌తో తయారైన విస్తర్లలో భోజనం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది.

విస్తర్లలో వేడి పదార్థాలు వేసుకోవడం వల్ల ప్లాస్టిక్‌లోని విష పదార్థం మనిషి భుజించే ఆహారంతో కలిసి కడుపుల్లో నింపుకుంటున్నారు. దీంతో రోగాలు రావడం వేలకు వేలు వైద్యానికి ఖర్చులు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇండ్లలోని వ్వర్థ పదార్థాలను సైతం కవర్లలో నింపి రోడ్లపై, మురుగుకాలువల్లో, నీటి గుంతల్లో పడేస్తున్నారు. దీంతో అవి కుళ్లిపోవడమే కాకుండా కంపువాసనలు వెదజల్లడం, ఆ నీటిని జలచరాలు తాగడంతో వాటికి ముప్పు వాటిల్లుతుంది. ప్లాస్టిక్‌లో ఉండే విష పదార్థాలు నీటిలో చేరి మురుగు కాలువల నుంచి వాగులు, నదులు కలుషితమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చెందుతున్నారు. ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే కొంత మేరకైనా ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్టాస్టిక్‌ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ బూనుదాం.. మనల్ని మనం కాపాడుకుందాం... లేకపోతే సమస్య ఉధృతరూపం దాల్చి మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది.

ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలు


* ప్లాస్టిక్‌, పాలిథీన్‌ సంచుల తయారీలో కార్బన్‌, సీసం, పాదరసం, కాడ్మియం తదితర రసాయన పదార్థాలను వాడుతారు. అవి గాలిలో చేరడం వల్ల శ్వాసకోశ, ఇతరాత్ర ప్రమాదకరమైన జబ్బులు సంభవిస్తాయి. గర్భిణులు ప్లాస్టిక్‌ కలుషిత గాలిని పీల్చడం వల్ల పుట్టే బిడ్డకు అంగవైకల్యం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎదుగుదల లోపాలు ఏర్పడుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.
* నిత్యం ఉపయోగించే పాలను సైతం ప్లాస్టిక్‌ కవర్లలో నింపి సరఫరా చేస్తున్నారు. దాంతో పెద్దల నుంచి చిన్నారుల వరకు ప్రమాదం పొంచి ఉంది.
ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లడం వళ్ల ప్లాస్టి సీజర్స్‌, పీలియోథిన్‌, సీసం వంటి వివిధ రసాయనాలు అంటుకుంటాయి. దీంతో అల్సర్‌, చర్మవ్యాధులు, అంధత్వం, కాలేయం దెబ్బతినడం, ప్రత్యుత్పత్తి అవయవాలపై ప్రభావం చూపుతుంది. డయాబెటిస్‌, తలనొప్పి, అజీర్తి వచ్చే అవకాశం లేకపోలేదు.
*ఆవులు, బర్రెలు, మేకలు ఇతరాత్రా జీవరాసులు ప్లాస్టిక్‌ కవర్లను తినడం వల్ల జీర్ణాశయం దెబ్బతిని మరణించడం జరుగుతుంది.
నియంత్రణ శూన్యం
* ప్లాస్టిక్‌ కవర్లను నియంత్రించాలని ప్రభుత్వం, పర్యావరణ శాఖ పదే పదే సూచిస్తున్నా అమలు మాత్ర జరుగడం లేదు. 40 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న కవర్లను ప్రభుత్వం నిషేధించినా వాడకంలో మాత్రం తగ్గడం లేదు. నివారణకు ప్రభుత్వం స్థానికంగా ఉండే కొన్ని శాఖలకు బాధ్యతలు అప్పగించినా పర్యవేక్షణ జరగడం లేదు. ప్రస్తుతం తాండూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధం గట్టిగా అమలు జరుగుతుంది.
* దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లకు బదులు జూట్‌ బ్యాగులు అందిస్తున్నారు. కొన్ని పెద్ద దుకాణాల్లో చేతి సంచులు తీసుకెళితేనే వస్తువులు అందిస్తున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. దుకాణాల్లో చిన్న పాటి ప్లాస్టిక్‌ కనిపిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దీంతో దుకాణ దారులో ప్లాస్టిక్‌ను నిషేధించారు.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...


* బజారుకు వెళ్లే ప్రతి సారి జూట్‌ బ్యాగును తప్పనిసరి తీసుకెళ్లాలి
* దుకాణదారులు సైతం ప్లాస్టిక్‌ కవర్ల అందించకుండా ఉండాలి.
* వాహనదారులు తమ వద్ద ఎల్లవేళలా సంచిని ఉంచుకోవాలి.
* దుకాణాల్లో, మాంసం విక్రయ కేంద్రాల్లో, కూరగాయల కొనుగోలు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నిషేధించేవిధంగా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలి.
* హోటళ్లు, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వేడి వస్తువులను తీసుకొచ్చే అవసరం వస్తే టిఫిన్‌ బాక్సులను తీసుకెళ్లి ఆహార పదార్థాలను తీసుకురావడం ఉత్తమం.
* పాఠశాలల్లో విద్యార్థులకు ప్టాస్టిక్‌ వాడకంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles