హైదరాబాద్ : “ రాష్ట్రంలోని గిరిజనులకు మీ అవసరం ఉంది. వారి జీవితాల్లో వెలుగు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. మారుమూల ప్రాంతాల్లో, ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నారు. అందుకే మీ నుంచి చాలా ఆశిస్తున్నాను. గిరిజనుల సమస్యలు మీరు తీర్చండి...మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను” అని గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల జేఏసీ సంక్షేమ భవన్ లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన శాఖలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఉద్యోగుల బాధ్యతలు, వారి సమస్యలను జేఏసీ చైర్మన్ నవీన్ నికోలస్, ప్రధాన కార్యదర్శి నరోత్తమ్ రెడ్డి, జేఏసీ నేతలు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రజలకు సరిగా చేరవేసే బాధ్యత మనపై ఉందన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మహిళల కోసం మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సిఎం కేసిఆర్ గారు ఆలోచించి, అమలు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా లంబాడ తండాలు, గిరిజన గూడాలు, చెంచు పెంటలలో ఉన్న వారందరి జీవితాల్లో వెలుగు తీసుకువచ్చేందుకు సమిష్టిగా పనిచేయాలన్నారు.
గిరిజన తండాలకు 3 ఫేజ్ కరెంటు ఇంకా రావడం లేదని ఇటీవల ముఖ్యమత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే...వెంటనే 3 ఫేజ్ కరెంటు ఇవ్వడం కోసం కమిటీ వేశారని, కమిటీ నివేదిక ప్రకారం దాదాపు 287 కోట్ల రూపాయలతో ఇక్కడ త్వరలో 3 ఫేజ్ కరెంటు రానుందని చెప్పారు. అదేవిధంగా అంగన్ వాడీ టీచర్లు, ఉద్యోగులకు కేంద్రం 25శాతం నిధులు ఇస్తుంటే రాష్ట్రం ప్రభుత్వం 75శాతం నిధులు కలిపి దేశంలో ఎక్కడా లేని విధంగా 10వేల రూపాయలు ఇస్తోందన్నారు.
గిరిజన ఆశ్రమ స్కూళ్లలో హెల్త్ సూపర్ వైజర్లకు కేవలం 4వేల రూపాయల కనీస వేతనం ఇస్తున్నారని, ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పెంచే ప్రయత్నం చేస్తానన్నారు. గిరిజన శాఖలో వేతనాలు తక్కువగా ఉన్నాయని, పదోన్నతుల విధానం కూడా సరిగా లేదన్న నేపథ్యంలో ఇతర శాఖలకు సమానంగా వేతనాలు ఇచ్చే విధంగా, పదోన్నతులు కూడా అదే స్థాయిలో కల్పించేటట్లు ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానన్నారు.
మొత్తానికి గిరిజనుల సమస్యలను తీర్చే బాధ్యత ఉద్యోగులుగా మీరు తీసుకోవాలని...మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.